అధికారులకు కుప్పం విమానాశ్రయ భూముల రైతుల మొర
వివరాల సేకరణకు వచ్చిన అధికారుల అడ్డగింత
భారీగా పోలీసుల మోహరింపు
రైతుల వ్యతిరేకతతో వెనుదిరిగిన అధికారులు
శాంతిపురం: ప్రతిపాదిత కుప్పం విమానాశ్రయానికి భూములు ఇచ్చేందుకు సుముఖంగా లేని రైతుల భూముల్లోని నిర్మాణాల వివరాల నమోదుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని దండికుప్పం వద్దకు మంగళవారం అధికారులు వస్తున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున రైతులు అక్కడికి చేరుకున్నారు. అధికారులతో వాదనకు దిగారు. రైతులకు నచ్చజెప్పేందుకు రాళ్లబూదుగూరు ఎస్సై నరేష్, తహసీల్దార్ ప్రకాష్ బాబు, డీటీ శివకుమార్ చర్చలు జరిపారు.
తమ భూములు ఇచ్చేందుకు సుమఖంగా లేమని, హైకోర్టును ఆశ్రయించినట్టు 44 మంది రైతులు తెలిపారు. కోర్టు ఉత్తర్వు, తమ అంగీకారం లేకుండా భూముల్లోకి రావద్దని తేల్చి చెప్పారు. పాతికేళ్ల క్రితం టైడిల్ సిల్క్ పరిశ్రమ కోసం అమ్మవారిపేట, కిలాకిపోడు రెవెన్యూలలో లాక్కున్న భూములు, ఇతర పరిశ్రమల కోసం ఆరేళ్ల క్రితం విజలాపురం, అమ్మవారిపేట రెవెన్యూలలో తీసుకున్న భూములు కూడా వృథాగానే ఉన్నాయన్నారు. రైతుల నుంచి తీసుకున్న భూములు ఐదేళ్లలో అభివృద్ధి చేయకపోతే భూ సేకరణ చట్టం ప్రకారం తిరిగి వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
భూముల్లోని నిర్మాణాల వివరాలను నమోదు చేసుకోవడానికి మాత్రమే వచ్చామని, సహకరించాలని అధికారులు కోరినా రైతులు ససేమిరా అన్నారు. కోర్టు వ్యాజ్యంలోని ఆస్తుల్లో ఎవరూ ప్రవేశించరాదని రైతులు తమ పొలాల్లో ఏర్పాటు చేసిన బోర్డులను అధికారులకు చూపించారు. ఇప్పటికే సేకరించిన రెండు వేలకు పైగా ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించి మిగతా రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చక్రపాణిరెడ్డి అధికారులను కోరారు.
రైతుల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కరుణకుమారికి అధికారులు ఫోన్‌లో వివరించి వెనుదిరిగారు.


