
భారతీయులందరూ అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి దీపావళి.మన మహర్షులు ఏర్పరచిన పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలు కలిగి, ఆచార వ్యవహారాలతో కలిసి ఉంటాయి. ఈ పండుగల వెనుక అపారమైన శాస్త్రీయత, సమాజానికి హితకరమైన అంశాలు అనేకం దాగి ఉంటాయి. ఈనేపథ్యంలో వివిధ ప్రాంతాల్లోజరుపుకునే వేడుకల గురించి తెలుసుకుందాం.
దీపావళి పూట...శివాజీ కోట! దీపావళి సీజన్‌లో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో శివాజీ పాలించిన కోటకు ప్రతిరూపంగా మట్టికోటలను తయారుచేయడం అనేది ఆచారం. ఈ కోటను నిర్మించే క్రమంలో బురదలో విత్తనాలు నాటుతారు. కోట చుట్టూ పచ్చదనం ఉండేలా చేస్తారు. రాత్రివేళల్లో ఈ మట్టి కోటపై చిన్న చిన్న దీపాను వెలిగిస్తారు.
జార్ఖండ్‌లో దీపావవళి పండగ సందర్భంగా సోహ్రై వేడుకను జరుపుకుంటారు.ఈ వేడుకలో భాగంగా దేవతలను స్వాగతించడానికి ఘరోండాలు(మట్టి బొమ్మల ఇళ్ళు) తయారు చేస్తారు. లక్ష్మీదేవిని స్వాగతించడానికి అగరువత్తులు కాల్చుతారు. సోహ్రై వేడుకలలో పశువులకు స్నానం చేయించి పూజలు చేస్తారు.
పేడ పూసుకునివేడుక చేసుకుంటారు: కర్నాటక, తమిళనాడు సరిహద్దులలోని గుమతాపుర గ్రామంలో దీపావళి ముగింపును పురస్కరించుకొని ‘గోరెహబ్బ’ వేడుక జరుపుకుంటారు. ఈ వేడుకలో భాగంగా మగవాళ్లు ఆవు పేడను ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఆడవాళ్లు ఒంటికి రాసుకుంటారు. ఆవుపేడలో ఔషధగుణాలు ఉన్నాయనే నమ్మకంతో ఏర్పడిన శతాబ్దాల నాటి సంప్రదాయం ఇది.
దీపావళి తరువాత పదిహేను రోజులకు వారణాసిలో దేవ దీపావళిని జరుపుకుంటారు. కార్తిక పూర్ణిమ రాత్రి గంగానది వెంబడి ఉన్న ఘాట్లు లక్షలాది దీపాలతో వెలుగుతాయి. ఆ వెలుగులప్రతిబింబాలు నదిలో అందమైన చిత్రాలను ఆవిష్కరిస్తాయి. గంగానదిలో స్నానం చేయడానికి దేవతలు భూమి మీదికి దిగి వచ్చిన రోజుగా ఈ రోజును జరుపుకుంటారు.
ఈ సారి రికార్డ్ బ్రేక్ : గత సంవత్సరం అక్టోబర్‌లో అయోధ్యలో 25.12 లక్షల దీపాలను వెలిగించి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సెట్ చేసింది. తాజాగా...28 లక్షల దీపాలను వెలిగించి తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేయాలనుకుంటోంది.