- రామాలయ శిఖరంపై కాషాయ ధ్వజారోహణం
- రామ్‌లల్లాను దర్శించుకోనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర క్షేత్రం అయోధ్యలో మరో మహా ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అయోధ్యను సందర్శించనున్నారు. భవ్య రామమందిర నిర్మాణం పరిపూర్తికి గుర్తుగా ఆలయ శిఖరంపై కాషాయం పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. లంబకోణ త్రిభుజ ఆకారంలో ఉండే ఈ జెండా ఎత్తు 10 అడుగులు, వెడల్పు 20 అడుగులు.
జెండాపై శ్రీరాముడి శౌర్యం, తేజస్సును సూచించేలా సూర్యుడి గుర్తు, ఓం అనే మంత్రం, దేవకాంచన వృక్షం బొమ్మ ఉంటాయి. ఈ పవిత్ర పతాకం రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబించేలా గౌరవం, ఐక్యత, సాంస్కృతిక వికాస సందేశాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. అయోధ్యలోని సప్తమందిరాన్ని సైతం మోదీ దర్శించుకుంటారు. శేషావతార ఆలయం, మాత అన్నపూర్ణ అలయాల్లోనూ ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రామలల్లా గర్భాలయంలో మూలమూర్తిని దర్శించుకుంటారు. అయోధ్యలో ధ్వజారోహణం సందర్భంగా నిర్వహించే సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.


