సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మారుస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకానికి వికసిత్ భారత్ - జీ- రామ్- జీ (గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)) పేరును పెట్టింది. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో సోమవారం ప్రవేశపెట్టారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) స్థానంలో కొత్త బిల్లును తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్రంగా స్పందించారు. ఈ బిల్లు చట్టాన్ని బలహీనపరుస్తుందని, వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఎవరైనా వ్యక్తిగత అభిలాష, పక్షపాతం, స్వేచ్ఛ ఆధారంగా చట్టాలు చేయకూడదని ప్రియాంకా గాంధీ అన్నారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ ఇచ్చే MGNREGS పథకాన్ని రద్దు చేసి కొత్త బిల్లుతో భర్తీ చేయడం అన్యాయమని ఆమె పేర్కొన్నారు. ఈ బిల్లు రైతులు, కార్మికులు, గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీస్తుందని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా బలమైన నిరసన వ్యక్తం చేస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశంలోని కోట్లాది కుటుంబాలకు రక్షణ కవచం. దానిని బలహీనపరచడం ప్రజల హక్కులను హరించడం అవుతుందని పార్టీ నేతలు పేర్కొన్నారు. కాగా ఈ బిల్లుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
గాంధీ పేరు తొలగించడం అనైతికం: థరూర్ వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఈ నిరసనకు మద్దతు తెలిపారు. రాముడి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం అపవిత్రం చేయొద్దు అంటూ కేంద్రాన్ని కోరారు. ప్రజల జీవనోపాధి కోసం రూపొందించిన పథకానికి పేరు మార్చడం అనైతికమని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ప్రజల హక్కులను కాపాడే పథకాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని స్పష్టం చేశారు.
ఈ మేరకు పార్లమెంటులో మహాత్మా గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పేరును తొలగించి "జిరాంజీ"గా మార్చడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు.


