సాక్షి, హైదరాబాద్: పోలీసులకు జీతాలు ప్రజల సొమ్ము నుంచి వస్తన్నాయేగానీ.. కాంగ్రెస్ పార్టీ నుంచి కాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్‌పేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ నేత బిట్ల బాలరాజు, ఆయన కుటుంబ సభ్యులను మంగళవారం కేటీఆర్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారాయన. అనంతరం.. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా, అమానవీయంగా ఉంది. డీజీపీ నుండి కింది స్థాయి పోలీసు అధికారుల వరకు అందరికీ గుర్తుచేస్తున్నా. మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతోనే తప్ప, రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ముతోనో, కాంగ్రెస్ పార్టీ సొమ్ముతోనో కాదు. ప్రజల ప్రాణాలు పోతుంటే, రౌడీలు దాడులు చేస్తుంటే పోలీసులు చేష్టలుడిగి చూడటం పద్ధతి కాదు.. పోలీసులు నిశ్చేష్టులుగా వ్యవహరిస్తూ, నిందితులపై చర్యలు తీసుకోకపోతే తాము కూడా తిరగబడాల్సి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
"ఇక దాడికి ప్రతిదాడే సమాధానం అనుకుంటే, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి" అని హెచ్చరించారాయన.
గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతోందని కేటీఆర్ ఆరోపించారు. నల్గొండలో మల్లయ్య యాదవ్ హత్య, సూర్యాపేటలో బీసీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన ఘటనలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. గాయపడిన భారతి గారి కుటుంబానికి, ఇతర కార్యకర్తలకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులను బీఆర్ఎస్ పార్టీనే భరిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, అవసరమైతే డీజీపీ, ఎస్పీ కార్యాలయాల ముట్టడికైనా పిలుపునిస్తామని.. న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భాషతో కార్యకర్తలను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు.. "ఖబడ్దార్ కాంగ్రెస్ గుండాలారా" అంటూ నినాదాలు చేశారు.
ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్లు..
భారతి పరిస్థితి విషమంగానే ఉంది. ఆమెతో పాటు బాలరాజులపై దాడి చేసిన వారిని, ఆ దాడికి ప్రేరేపించిన వారిపై కూడా వెంటనే 'అటెంప్ట్ టు మర్డర్' (హత్యాయత్నం) కేసులు నమోదు చేయాలి. వెంటనే దోషులను అరెస్ట్ చేసి బాధితుల పక్షాన నిలబడాలి. ఆసుపత్రి పాలైన ఆ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి, నష్టపరిహారం చెల్లించాలి. ఈ పరామర్శలో ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, స్థానిక కార్యకర్తలు కేటీఆర్ వెంట ఉన్నారు.


