breaking news
Yellareddy Assembly Constituency
-
కాంగ్రెస్ గూండాల దాడికి ప్రతిదాడి తప్పదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పోలీసులకు జీతాలు ప్రజల సొమ్ము నుంచి వస్తన్నాయేగానీ.. కాంగ్రెస్ పార్టీ నుంచి కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నేత బిట్ల బాలరాజు, ఆయన కుటుంబ సభ్యులను మంగళవారం కేటీఆర్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారాయన. అనంతరం.. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా, అమానవీయంగా ఉంది. డీజీపీ నుండి కింది స్థాయి పోలీసు అధికారుల వరకు అందరికీ గుర్తుచేస్తున్నా. మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతోనే తప్ప, రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ముతోనో, కాంగ్రెస్ పార్టీ సొమ్ముతోనో కాదు. ప్రజల ప్రాణాలు పోతుంటే, రౌడీలు దాడులు చేస్తుంటే పోలీసులు చేష్టలుడిగి చూడటం పద్ధతి కాదు.. పోలీసులు నిశ్చేష్టులుగా వ్యవహరిస్తూ, నిందితులపై చర్యలు తీసుకోకపోతే తాము కూడా తిరగబడాల్సి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. "ఇక దాడికి ప్రతిదాడే సమాధానం అనుకుంటే, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి" అని హెచ్చరించారాయన. గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతోందని కేటీఆర్ ఆరోపించారు. నల్గొండలో మల్లయ్య యాదవ్ హత్య, సూర్యాపేటలో బీసీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన ఘటనలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. గాయపడిన భారతి గారి కుటుంబానికి, ఇతర కార్యకర్తలకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులను బీఆర్ఎస్ పార్టీనే భరిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, అవసరమైతే డీజీపీ, ఎస్పీ కార్యాలయాల ముట్టడికైనా పిలుపునిస్తామని.. న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భాషతో కార్యకర్తలను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు.. "ఖబడ్దార్ కాంగ్రెస్ గుండాలారా" అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్లు.. భారతి పరిస్థితి విషమంగానే ఉంది. ఆమెతో పాటు బాలరాజులపై దాడి చేసిన వారిని, ఆ దాడికి ప్రేరేపించిన వారిపై కూడా వెంటనే 'అటెంప్ట్ టు మర్డర్' (హత్యాయత్నం) కేసులు నమోదు చేయాలి. వెంటనే దోషులను అరెస్ట్ చేసి బాధితుల పక్షాన నిలబడాలి. ఆసుపత్రి పాలైన ఆ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి, నష్టపరిహారం చెల్లించాలి. ఈ పరామర్శలో ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, స్థానిక కార్యకర్తలు కేటీఆర్ వెంట ఉన్నారు. -
ఎల్లారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ...
ఎల్లారెడ్డి నియోజకవర్గం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో టిఆర్ఎస్ ఘన విజయం సాదిస్తే ఎల్లారెడ్డిలో మాత్రం టిఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్రరెడ్డి ఓడిపోవడం విశేషం. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్ధి జాజుల సురేందర్ 35148 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. సురేందర్‌కు 91510 ఓట్లు రాగా, రవీంద్ర రెడ్డికి 56362 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ధి టి.బాలరాజుకు 9600 పైచిలుకు ఓట్లు వచ్చాయి. సురేందర్ తొలిసారి గెలు పొందారు. ఆయన మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారు. కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచినా, ఆ తర్వాత కాలంలో ఆయన టిఆర్ఎస్లో చేరిపోవడం విశేషం. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇ.రవీంద్ర రెడ్డి నాలుగుసార్లు గెలిచిన నేతగా నమోదయ్యారు. రవీందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన 2004లో టీఆర్ఎస్ పక్షాన గెలిచి, ఉద్యమంలో బాగంగా 2008లో పార్టీ ఆదేశాల ప్రకారం పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేశారు. కాన ఓటమి చెందారు. ఆ తర్వాత 2009లో తిరిగి గెలిచారు. మళ్లీ ఉద్యమంలో 2010లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచారు. 2014 సాదారణ ఎన్నికలలో కూడా గెలుపొందినా, 2018లో ఓటమి చెందారు. ఎల్లారెడ్డిలో ఆరుసార్లు రెడ్డి నేతలు గెలుపొందితే, మరో ఆరుసార్లు బిసిలు గెలిచారు. వారిలో నలుగురు మున్నూరు కాపు వర్గం వారు కాగా, ఇద్దరు గౌడ వర్గం వారు. మూడుసార్లు ఎస్. సిలు ప్రాతినిధ్యం వహించారు. 1983 తరువాత ఒకే ఒక ఉప ఎన్నికలో 2018లో కాంగ్రెస్ ఐ గెలిచింది. మిగిలిన అన్నిసార్లు టిడిపి, టిఆర్ఎస్లు విజయం సాధించాయి. టిఆర్ఎస్ 2004లో కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉంటే, 2009లో టిడిపికి మిత్రపక్షం అయింది. 2014 నుంచి ఒంటరిగానే పోటీచేస్తోంది. ప్రముఖ దళితనేత టి.ఎన్.సదాలక్ష్మి ఒకసారి ఇక్కడ, మరోసారి కామారెడ్డిలో గెలిచారు. ఎల్లారెడ్డిలో రెండుసార్లు విజయం సాధించిన జె.ఈశ్వరీబాయి, మాజీ మంత్రి గీతారెడ్డి తల్లీ, కూతుళ్లు, 1978లో ఇక్కడ గెలిచిన బాలాగౌడ్ కొంత కాలం జడ్పి ఛైర్మన్‌గా, నిజామాబాద్ ఎమ్.పిగా కూడా పనిచేశారు. ఇక్కడ గెలిచినవారిలో టిఎన్ సదాలక్ష్మి గతంలో నీలం, కాసు మంత్రివర్గాలలో పనిచేస్తే, బాలాగౌడ్ 1981 తరువాత అంజయ్య, భవనం క్యాబినెట్లలో ఉన్నారు. నేరెళ్ల ఆంజనేయులు కొద్దికాలం చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఎల్లారెడ్డిలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కమలం వైపు ప్రొఫెసర్ చూపు!
సాక్షి, కామారెడ్డి: గాంధారి మండలం రాంలక్ష్మణ్‌పల్లికి చెందిన ప్రముఖ సర్జన్, ప్రొఫెసర్ కే.రాంసింగ్ కమలం పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో సమావేశమయ్యా రు. దీంతో ఆయన ఎల్లారెడ్డి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. సాధారణ గిరిజన కుటుంబంలో జన్మించి న రాంసింగ్ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగారు. మంచి సర్జన్‌గా పేరు గడించారు. ఉస్మానియా మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఇటీవలే కామారెడ్డి మెడికల్ కాలేజీకి బదిలీపై వచ్చారు. జనరల్ సర్జన్‌గా ఆయనకు మంచి పేరుంది. ఆయన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లిన వారికి సహాయం అందిస్తుంటారు. నియోజకవర్గం అంతటా విస్తృత పరిచయాలు ఉన్న డాక్టర్ కే.రాంసింగ్‌పై ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఒత్తిడి ఉంది. ఈ నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇందులో విద్యావంతుల సంఖ్యా అధికమే.. నియోజకవర్గంలో ఇరవై శాతానికిపైగా గిరిజనులు ఉంటారని అంచనా. ఇక్కడ ఇప్పటివరకు గిరిజనులెవరూ ఎమ్మెల్యేగా ఎన్నికవలేదు. గతంలో జమునా రాథోడ్ పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆమె గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఇటీవల వైఎస్సార్టీపీలో చేరారు. డాక్టర్ రాంసింగ్ స్థానికుడు కావడం, స్థానికంగా విస్తృత పరిచయాలు ఉండడంతో ఎన్నికల బరిలో నిలవాలని ఆయనకు చాలామంది సూచిస్తున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని డాక్టర్ రాంసింగ్ కలిశారు. గిరిజన సమస్యల మీద ప్రముఖులతో బీజేపీ అధ్యక్షుడు చర్చించగా.. ఆ సమావేశానికి రాంసింగ్‌కు ఆహ్వానం అందింది. మాజీ ఎంపీ రవీంద్రనాయక్, బీజేపీ నేత హుస్సేన్ నాయక్ తదితరులతో కలిసి ఆయన సమావేశంలో పాల్గొన్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో గిరిజనుల స్థితిగతులపై సమావేశంలో చర్చించినట్టు సమాచారం. సామాజిక మాధ్యమాలలో.. జనరల్ సర్జన్‌గా మంచి గుర్తింపు ఉన్న ప్రొఫెసర్ రాంసింగ్ ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన ఎల్లారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. మారనున్న రాజకీయ సమీకరణాలు.. డాక్టర్ రాంసింగ్ బీజేపీలో చేరితే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతాయని భావిస్తున్నారు. గిరిజనులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో వారు గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశాలున్నా యి. అదే సామాజికవర్గానికి చెందిన రాంసింగ్ పోటీ చేస్తే రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతాయని భావిస్తున్నారు. -
ఎల్లారెడ్డిలో ఎవరు? : పోటీకి సై అంటున్న మరికొందరు..
ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఎలక్షన్ బరిలో నిలవాలని యోచిస్తున్న పలువురు నేతలు.. నిత్యం జనం మధ్య ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలతో క్యాడర్లో జోష్‌ను నింపేందుకు యత్నిస్తూనే.. టికెట్టు కోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సాక్షి, కామారెడ్డి : జిల్లా రాజకీయాల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతిసారి ఎన్నికల్లో రెండు, మూడు కొత్త ముఖాలు కనిపిస్తుంటాయి. యువతను వెంటేసుకుని గ్రామాలను చుట్టేస్తుంటారు. ప్రధాన పార్టీల నుంచి పాత వారితో పాటు కొత్తవారూ టికెట్లు ఆశించి ప్రయత్నాలు చేస్తారు. పార్టీ టికెట్టు వస్తే సరి.. లేదంటే తిరుగుబాటు జెండా ఎగరేయడానికీ వెనకాడరు. లేదంటే బిచాణా ఎత్తేస్తుంటారు. ప్రస్తుతం ఒక్కో పార్టీలో ఇద్దరు, ముగ్గురు టికెట్టు ఆశిస్తూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. సేవా కార్యక్రమాలతో కొందరు, ప్రజా సమస్యలే ఎజెండాగా ఇంకొందరు తిరుగుతున్నారు. నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డితో పాటు వివిధ పార్టీల నేతలు బాణాల లక్ష్మారెడ్డి, వడ్డెపల్లి సుభాష్‌రెడ్డి, కలకుంట్ల మదన్‌మోహన్‌రావ్, నిజ్జెన రమేశ్, జమునా రాథోడ్, కృష్ణారెడ్డిలతో పాటు మరికొందరు ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్‌లో పోటాపోటీ.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమై న క్యాడర్ ఉంది. 2018 లో కాంగ్రెస్ అభ్యర్థిగా సు రేందర్ విజయం సాధించారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం పీసీసీ ప్రధాన కార్యదర్శి వడ్డెపల్లి సు భాష్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మదన్మోహన్రావు టికెట్టు కోసం పోటీపడుతున్నారు. ఇరువురూ ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. అలాగే పోటీపడి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీ టికెట్టు కోసం ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్ కొంత కాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు. బీజేపీలో ముగ్గురు.. బీజేపీ నుంచి పోటీ చేయడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. రెండేళ్ల క్రితం కమలం గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అనుచరులున్నారు. అయితే ఇటీవల తన అనుచరులు కొందరు ఇతర పార్టీల్లో చేరారు. కాగా రవీందర్‌రెడ్డి కూడా బీజేపీలో ఇమడలేకపోతున్నారని, కాంగ్రెస్ గూటికి వెళతారని ప్రచారం జరుగుతోంది. ఆయన ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి గైర్హాజరవడం, పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనకపోవడం దీనికి బలం చేకూరుస్తోంది. ఒకవేళ ఆయన బీజేపీలో కొనసాగితే ఆ పార్టీ టికెట్టు రేసులో ముందుంటారు. ఎల్లారెడ్డి టికెట్టును బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి కూడా ఆశిస్తున్నారు. ఆయన గత ఎన్నికలలో పోటీ చేశారు. నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తున్నారు. మరోనేత పైలా కృష్ణారెడ్డి కూడా ఎన్నికల బరిలో నిలవడానికి ఉత్సాహం చూపుతున్నారు. తెలంగాణ జన సమితి నుంచి... ఓయూ జేఏసీ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న విద్యార్థి నాయకుడు నిజ్జెన రమేశ్ ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి తెలంగాణ జన సమితి అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి పలు కార్యక్రమాలు చేపట్టారు. వడగళ్లతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించడంతో పాటు వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి నివేదిక అందించారు. అధికార పార్టీలో సిట్టింగ్‌కే అవకాశం? జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎ.సంపత్‌గౌడ్ ఎల్లారెడ్డి నుంచి ఎన్నికల బరిలో దిగుతానంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సంపత్‌గౌడ్ కొంత కాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేయాలని ఆయన పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే స్వతంత్రంగా బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరిన జమునా రాథోడ్ ఆ పార్టీ నుంచి పోటీలో ఉంటారని భావిస్తున్నారు. మరికొందరి పేర్లు సైతం ప్రచారంలో ఉన్నాయి. ఇలా ఆయా పార్టీల టికెట్టు ఆశిస్తున్న పలువురు నేతలు నిత్యం ప్రజల మధ్య ఉంటుండడంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సందడి కనిపిస్తోంది. బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కే తిరిగి టికెట్టు వస్తుందని భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన సురేందర్.. నియోజకవర్గం మీద పట్టు సాధించారు. నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా ప్రజల్ని ఇబ్బందులు పెట్టిన గతుకుల రోడ్లు సురేందర్ హయంలో చాలావరకు బాగయ్యా యి. ఆయన అన్ని మండలాల్లో పర్యటిస్తూ అందరితో సన్నిహిత సంబంధాలు నెరపుతున్నా రు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవితలతో సురేందర్ సన్నిహిత సంబంధాలు పెట్టుకుని నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ నిధులు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. పలువురు ద్వితీయ శ్రేణి నేతలూ టికెట్టు ఆశిస్తున్నా.. ఆ పార్టీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి.


