కమలం వైపు ప్రొఫెసర్‌ చూపు! | - | Sakshi
Sakshi News home page

కమలం వైపు ప్రొఫెసర్‌ చూపు!

Jul 27 2023 7:52 AM | Updated on Jul 28 2023 3:29 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో రాంసింగ్‌(ఫైల్‌) - Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో రాంసింగ్‌(ఫైల్‌)

సాక్షి, కామారెడ్డి: గాంధారి మండలం రాంలక్ష్మణ్‌పల్లికి చెందిన ప్రముఖ సర్జన్‌, ప్రొఫెసర్‌ కే.రాంసింగ్‌ కమలం పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో సమావేశమయ్యా రు. దీంతో ఆయన ఎల్లారెడ్డి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది.

సాధారణ గిరిజన కుటుంబంలో జన్మించి న రాంసింగ్‌ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగారు. మంచి సర్జన్‌గా పేరు గడించారు. ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఇటీవలే కామారెడ్డి మెడికల్‌ కాలేజీకి బదిలీపై వచ్చారు. జనరల్‌ సర్జన్‌గా ఆయనకు మంచి పేరుంది. ఆయన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లిన వారికి సహాయం అందిస్తుంటారు. నియోజకవర్గం అంతటా విస్తృత పరిచయాలు ఉన్న డాక్టర్‌ కే.రాంసింగ్‌పై ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఒత్తిడి ఉంది.

ఈ నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇందులో విద్యావంతుల సంఖ్యా అధికమే.. నియోజకవర్గంలో ఇరవై శాతానికిపైగా గిరిజనులు ఉంటారని అంచనా. ఇక్కడ ఇప్పటివరకు గిరిజనులెవరూ ఎమ్మెల్యేగా ఎన్నికవలేదు. గతంలో జమునా రాథోడ్‌ పీఆర్‌పీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆమె గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఇటీవల వైఎస్సార్‌టీపీలో చేరారు. డాక్టర్‌ రాంసింగ్‌ స్థానికుడు కావడం, స్థానికంగా విస్తృత పరిచయాలు ఉండడంతో ఎన్నికల బరిలో నిలవాలని ఆయనకు చాలామంది సూచిస్తున్నారు.

ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని డాక్టర్‌ రాంసింగ్‌ కలిశారు. గిరిజన సమస్యల మీద ప్రముఖులతో బీజేపీ అధ్యక్షుడు చర్చించగా.. ఆ సమావేశానికి రాంసింగ్‌కు ఆహ్వానం అందింది. మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌, బీజేపీ నేత హుస్సేన్‌ నాయక్‌ తదితరులతో కలిసి ఆయన సమావేశంలో పాల్గొన్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో గిరిజనుల స్థితిగతులపై సమావేశంలో చర్చించినట్టు సమాచారం.

సామాజిక మాధ్యమాలలో..

జనరల్‌ సర్జన్‌గా మంచి గుర్తింపు ఉన్న ప్రొఫెసర్‌ రాంసింగ్‌ ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన ఎల్లారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారన్న ప్రచారం జరుగుతోంది.

మారనున్న రాజకీయ సమీకరణాలు..

డాక్టర్‌ రాంసింగ్‌ బీజేపీలో చేరితే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతాయని భావిస్తున్నారు. గిరిజనులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో వారు గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశాలున్నా యి. అదే సామాజికవర్గానికి చెందిన రాంసింగ్‌ పోటీ చేస్తే రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతాయని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement