అక్రమ నిర్మాణాల కూల్చివేత
దోమకొండ: హైకోర్టు ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట ప్రభుత్వ పాఠశాల స్థలంలో నిర్మించిన దుకాణ సముదాయాన్ని జిల్లా అధికార యంత్రాంగం గురువారం కూల్చివేసింది. వివరాలు ఇలా ఉ న్నాయి. 1968లో ముత్యంపేట ప్రభుత్వ పాఠ శాల కోసం కాటిపల్లి వెంకట్రామిరెడ్డి, మెరుగు అంజయ్య 638/ఏ/1, 638/ఏ/2, 638/ఏఏ సర్వే నెంబర్లలోని 2 ఎకరాల 11 గుంటల భూ మిని విరాళంగా ఇచ్చారు. అయితే, గతంలో ఉప సర్పంచ్‌గా పనిచేసిన ముత్తగారి శిరీష్‌గౌడ్ అనే వ్యక్తి ఎరుకల పార్వతి పేరిట 400 గజాల తో రెండు డాక్యుమెంట్లు, మహ్మద్ జావీద్ పేరి ట 200 గజాలతో ఒక డాక్యుమెంట్, మంద ఆంజనేయులు పేరిట 400 గజాలతో రెండు డాక్యుమెంట్లు, మంద నర్సారెడ్డి పేరిట 600 గజాలతో మూడు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. తర్వాత వీళ్ల వద్ద నుంచి తన భార్య రో జా సదరు స్థలాలను కొనుగోలు చేసినట్లు సేల్ డీడ్ తయారు చేశాడు. 2020 ఆగస్టు 25న, 2022 జూన్ 29న విడతలవారీగా 1–3/ఏ1, 1–3/ఏ2, 1–3/ఏ3, 1–3/ఏ4, 1–4/ఏ5 నెంబర్లతో అప్పటి పంచాయతీ కార్యదర్శి రాజ్‌కుమార్‌తో కలిసి ఇంటి నెంబర్లు సృష్టించాడు. ఆ తర్వాత నకిలీ ఓనర్‌షిప్ సర్టిఫికెట్లతో 6 నెలల్లో నే 12 లింక్ డాక్యుమెంట్లు సృష్టించి 2023లో 16 మడిగెలతో దుకాణ సముదాయాన్ని నిర్మించాడు. అక్రమాలను గుర్తించిన మాజీ ఎంపీటీ సీ కె.వెంకటలక్ష్మి, మాజీ ఉప సర్పంచ్ కుర్ర అంజయ్య హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యా జ్యం దాఖలు చేశారు. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన హైకోర్టు గత డిసెంబర్ 18వ తేదీన తీర్పు వెలువరించింది. అప్పీలుకు 8 వారాల గడువు ఇచ్చింది. ఈ నెల 18వ తేదీతో గడువు పూర్తయ్యింది. అక్రమాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అపరేష్‌కుమార్, మొహియుద్దీన్‌ల బెంచ్ తీర్పును వెలువరించింది. పిల్ దాఖలు చేసినవారి తరఫున హైకోర్టు సీనియర్ న్యాయవాది కాటిపల్లి మహేందర్‌రెడ్డి, సరళా మహేందర్‌రెడ్డి, రవి మహేందర్‌రెడ్డి వాదనలు చేశారు.
హైకోర్టు తీర్పు అమలు చేసేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ సుధాకర్, డీఎల్‌పీవో శ్రీనివాస్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎస్సై ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి అంజయ్య గురువారం ముత్యంపేటకు చేరుకున్నారు. నిర్మాణాన్ని కూలగొట్టే విషయంలో చాలా సమయం తాత్సారం చేశారు. మరో నాలుగు వారాల సమయం ఉందని చెప్పారు. దీంతో గ్రామస్తులు కూల్చివేయాల్సిందేనని భీష్మించడంతో కూల్చివేత మొదలుపెట్టారు. మరికొద్దిసేపటికి శాంతిభద్రతల సమస్య వస్తోందంటూ కూల్చివేత నిలిపేశారు. హైకోర్టు తీర్పును కచ్చితంగా అమలు చేయాల్సిందేనని కలెక్టర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో కూల్చివేత ప్రక్రియను పూర్తిచేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆశబోయిన అక్షర, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
ముత్యంపేట ప్రభుత్వ బడి స్థలంలోని
దుకాణాల సముదాయం తొలగింపు
హైకోర్టు తీర్పును అమలు చేసిన
జిల్లా యంత్రాంగం


