రాష్ట్రస్థాయి గణిత సెమినార్‌లో జిల్లా ఉపాధ్యాయులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి గణిత సెమినార్‌లో జిల్లా ఉపాధ్యాయులు

Feb 20 2026 6:44 AM | Updated on Feb 20 2026 6:44 AM

రాష్ట్రస్థాయి గణిత సెమినార్‌లో  జిల్లా ఉపాధ్యాయులు

రాష్ట్రస్థాయి గణిత సెమినార్‌లో జిల్లా ఉపాధ్యాయులు

రాష్ట్రస్థాయి గణిత సెమినార్‌లో జిల్లా ఉపాధ్యాయులు నేటి నుంచి అశోక్‌నగర్‌ రైల్వేగేట్‌ మూసివేత జుక్కల్‌, దెగ్లూర్‌కు ఎక్స్‌ప్రెస్‌ బస్సులు నేడు పాల్వంచకు మంత్రి తుమ్మల రాక వైద్య పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి టౌన్‌: రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మ్యాథ్స్‌ సెమినార్‌లో కామారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు ప్రతిభ చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 సెమినార్‌ పేపర్లు ఎంపిక కాగా, అందులో జిల్లా నుంచి నలుగురు ఉపాధ్యాయులు ఎంపికై నట్లు జిల్లా సైన్స్‌ అధికారి సిద్దిరాంరెడ్డి తెలిపారు. రామకృష్ణ (చిన్న మల్లారెడ్డి), రాజు (భిక్కనూర్‌), స్వర్ణలత (పాల్వంచ), బాలగంగాధర్‌ (గర్గుల్‌) ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు గణిత బోధనలో నూతన పద్ధతులను ప్రదర్శించినందుకు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రమేశ్‌ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను డీఈవో రాజు, జిల్లా సైన్స్‌ అధికారి అభినందించారు.

కామారెడ్డి అర్బన్‌ : కామారెడ్డి అశోక్‌నగర్‌ రైల్వేగేట్‌ (209 ఏ)ను నేటి నుంచి మూడు రోజుల పాటు మూసివేయనున్నట్లు రైల్వే సెక్షన్‌ ఇంజనీర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గేట్‌ వద్ద తారురోడ్డు మరమ్మతులు, ఇతర అత్యవసర గేటు పనులు చేపడుతున్నామన్నారు. శుక్రవారం ఉదయం 6గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6గంటల వరకు పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కారణంగా మూడు రోజుల పాటు గేటును మూసివేయనున్నట్టు తెలిపారు. ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల గుండా వెళ్లాలని సూచించారు.

కామారెడ్డి టౌన్‌: ప్రయాణికుల సౌకర్యార్థం కామారెడ్డి బస్సు డిపో నుంచి కొత్తగా జుక్కల్‌, దెగ్లూర్‌కు ఎక్స్‌ప్రెస్‌ బస్సు సర్వీసులను ప్రారంభించినట్లు డిపో మేనేజర్‌ దినేష్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జుక్కల్‌కు కామారెడ్డి నుంచి ఉదయం 6:30, మధ్యాహ్నం 3:00 గంటలకు బస్సులు బయలుదేరుతాయని, జుక్కల్‌ నుంచి ఉదయం 9:10, సాయంత్రం 5:45 గంటలకు కామారెడ్డికి చేరుకుంటాయన్నారు. దెగ్లూర్‌ రూట్‌కు కామారెడ్డి నుంచి ఉదయం 11:00, సాయంత్రం 6:00 గంటలకు, తిరిగి దెగ్లూర్‌ నుంచి మధ్యాహ్నం 2:30, ఉదయం 6:00 గంటలకు తిరుగు ప్రయాణం అవుతాయన్నారు. అలాగే బీబీపేట మండలం మల్కాపూర్‌ గ్రామానికి కామారెడ్డి నుంచి రాత్రి 8:00 గంటలకు దోమకొండ మీదుగా బస్సు నడపబడుతుందన్నారు. మరుసటి రోజు ఉదయం 5:30 గంటలకు మల్కాపూర్‌ నుంచి దోమకొండ, రామాయంపేట మీదుగా జేబీఎస్‌కు ఈ ఎక్స్‌ప్రెస్‌ బస్సు వెళ్తుందని వివరించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ బస్సు సర్వీసులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు.

మాచారెడ్డి: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఈ నెల 20న పాల్వంచ మండల కేంద్రానికి రానున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు పాల్వంచ మర్రి వద్ద ఆయిల్‌పామ్‌ పంటను ఆయన పరిశీలించనున్నట్టు కామారెడ్డి పట్టు పరిశ్రమ అధికారిణి సంతోషి ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం రైతులతో సమావేశం కానున్నట్టు ఆమె వివరించారు.

కామారెడ్డి టౌన్‌: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఖాళీగా ఉన్న ఏడు వైద్యుల పోస్టులను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు, అందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త విజయభాస్కర్‌ ఒక ప్రకటలో తెలిపారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, మద్నూర్‌, పిట్లం ఆస్పత్రుల్లో గైనకాలజీ విభాగంలో 4 పోస్టులు, అనస్థీ షియా ఒక పోస్టు, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ 2 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 20 నుంచి 25 వరకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల మధ్య దరఖాస్తులను కలెక్టరేట్‌లోని డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయంలో అందజేయాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 26న సాయంత్రం 4:00 గంటలకు కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement