గుడికెళ్లినా, ఆసుపత్రికెళ్లినా అవే దృశ్యాలు మనల్ని వెక్కిరిస్తుంటాయి. ఆఖరికి రోడ్డుమీద నడిచివెడుతున్నా కూడా చిక్కాకు పుట్టించే పరిస్థితి. ఏ మూల నుంచి ఎవడు పుసుక్కున ఉమ్ముతాడో తెలియదు. ఏ సిగ్నల్ దగ్గర ఆగినా ఇవే దృశ్యాలు.. కొండొకచో పోలీస్ స్టేషన్ల దగ్గర్ల కూడా ఇదే పరిస్థితి. ఇదంతా దేని గురించో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. పాన్ పరాగ్, గుట్కా, ఖైనీ తిని అసహ్యంగా ఉమ్ముతూ పరిసర ప్రాంతాలను, రోడ్లను అత్యంత చెత్తగా తయారు చేస్తున్న వైనం గురించే. వీటిని ఇబ్బడి ముబ్బడిగా సేవిస్తున్న వారి సంఖ్య రోజూ రోజుకు పెరుగుతోంది. ఇవి తినడం ఆరోగ్యానికి హానికరం. ఈ అలవాటు మితిమీరితే వివిధ రకాల కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడటం ఖాయం. దీనికి సంబంధించిన అనేక హెచ్చరికలు చేస్తున్నా.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నా వీటిని వాడేవారి నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఏ సినిమా హాలుకెళ్లినా దీనికి సంబంధించిన యాడ్ ప్లే అవుతుంది. అయినా ఉత్తరభారతంలోని అనేక నగరాలతో పాటు, హైదరాబాద్ నగరంలో గుట్కా తిని ఉమ్మేసేవాళ్ల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. తాజాగా జరిగిన ఒక సంఘటన గురించి తెలిస్తే షాకవ్వక మానరు.
తాజాగా ఇంగ్లాండ్ లోని లింకన్ షైర్ లో జరిగిన ఘటన గురించి తెలుసుకుంటే.. మన దేశంలో చట్టాల అమలు తీరుపై ఆశ్చర్యం కలగమానదు. లింకన్ షైర్ కు చెందిన, ఆస్తమా, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న రాయ్ మార్ష్ (86) వైద్యుడి సలహా మేరకు వాకింగ్‌కు వెళ్లాడు. పార్క్‌లో నడుస్తుండగా ఎండిన ఆకు ఒకటి గాలికి ఎగిరొచ్చి వృద్ధుడి నోట్లో పడింది. చాలా యధాలాపంగా వెంటనే ఆయన దాని ఉమ్మేశారు. అదే ఆయనకు భారీ షాక్ ఇచ్చింది. ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు షైర్‌కు ఏకంగా రూ.30 వేల ( 250 పౌండ్ల ) జరిమానా విధించారు.
చట్ట ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం నేరమని, జరిమానా కట్టాలని ఒత్తిడి చేశారు. మార్ష్ వివరణ ఇచ్చినా ససేమిరా అన్నారు. ఉద్దేశపూర్వకంగాఅలా చేయలేదని పొరబాటు జరిగిందని, అంతమొత్తం కట్టలేనని లబోదిబో మనడంతో కనికరించిన అధికారులు జరిమానాను 150 పౌండ్ల (సుమారు రూ.18 వేలు) తగ్గించారు. ఈ విషయాన్ని మార్ష్ కుమార్తె సోషల్ మీడియాలో షేర్ చేశారు.అధికారుల తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
అయినప్పటికీ ఇలాంటి కఠినచట్టాలు, అమలు మన దేశంలో అమలైతే ఎంతమంది ఎన్ని వేల రూపాయలు జరిమానా కట్టాల్సి ఉంటుందో ఒక్కసారి ఆలోచించింది. చట్టాలు, అమలు కంటే సమాజ హితంకోసం ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడం చాలా అవసరం. లేదంటే ఇంగ్లాండ్‌లొ వృద్ధుడికి ఎదురైన పరిస్థితే మనకు వస్తే? ఆలోచించండి.
కాగా భారతదేశంలో పొగాకు ఉత్పత్తులపై కఠిన నియమ నిబంధలు, కొన్ని రాష్ట్రాల్లో వీటి విక్రయాలపై షేధం ఉన్నప్పటికీ పూర్తిగా అడ్డుకట్ట పడటం లేదు పొగాకు, సున్నం, వక్క, తామలపాకు, మసాలా దినుసులు, చక్కెరతోపాటు సుగంధ రసాయనాలతో గుట్కాలు, ఖైనీలు తయారవుతాయి. వాణిజ్య ఉత్పత్తులైన రజనీగందా, పాన్‌పరాగ్‌లో షెల్ఫ్ లైఫ్ పెంచడానికి సోడియం బెంజోయేట్ లాంటివాటినీ ఉపయోగిస్తారు. ఇవి రుచి, మత్తును కలిగిస్తాయి. అంతిమంగా వారిని మరణం అంచుకునెట్టేస్తాయి. మోటారు ఫీల్డ్‌లో ఉన్నవారు ప్రధానంగా వీటికి బానిసలవుతున్నారు. ప్యాన్‌లు సహా దీర్ఘకాల వినియోగం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇండియాలోదాదాపు 20-25శాతం జనాభా తినే పొగాకు ఉత్పత్తులకు బానిసలేనని అంచనా. నికోటిన్‌తోపాటు ఆరెకోలిన్ వంటి రసాయనాలు ఈ ఉత్పత్తులను అత్యంత వ్యసనకరంగా మారుస్తాయి. ఎక్కడ బడితే అక్కడ ఉమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. వీటన్నింటి కంటే ముఖ్యంగా ఈ ఉత్పత్తుల గురించి అవగాహన కలిగి ఉండటం ఆరోగ్యకర జీవనశైలిని అవలంబించడం చాలా ముఖ్యం. ఏమంటారు?


