టెక్సాస్ గవర్నర్ అధికార నివాసభవనంలోవైభవంగా దీపావళి వేడుకలు | Diwali 2025 celebrations in the Governors house at Texas | Sakshi
Sakshi News home page

టెక్సాస్ గవర్నర్ అధికార నివాసభవనంలో వైభవంగా దీపావళి వేడుకలు

Oct 21 2025 9:59 AM | Updated on Oct 21 2025 10:26 AM

Diwali 2025 celebrations in the Governors house at Texas

డాలస్, టెక్సాస్:  టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ , సిసిలీయా అబ్బాట్‌ దంపతులు రాష్ట్రంలోని కొంతమంది ప్రవాస భారతీయనాయకులను ఆహ్వానించి, తమ అధికార నివాసభవనంలో దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు.  గత 11 సంవత్సరాలుగా ప్రతీ ఏడాదీ గవర్నర్ దంపతులు దీపావళి పండుగ జరుపుకోవడం విశేషం. 

గౌరవ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ దంపతులు వివిధరంగాలలో విశేషంగా కృషి చేస్తూ, టెక్సస్ రాష్ట్ర శరవేగ అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలతోపాటు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ వంటకాలతో దీపావళి విందు ఏర్పాట్లు చెయ్యడమేగాక అందరికీ దీపావళి కానుకలిచ్చి సత్కరించారు.

 ప్రముఖ పారిశ్రామికవేత్త అనురాగ్ జైన్ దంపతులు ఈ సంవత్సరపు దీపావళి వేడుక ఏర్పాట్లను సమన్వయపరచారు. గౌరవ కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా డి.సి మంజునాథ్ దంపతులు, టెక్సస్ రాష్ట్ర కార్యదర్శి జేన్ నెల్సన్ లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. టెక్సాస్ రాష్ట్రంలోని వివిధ నగరాలైన డాలస్, హూస్టన్, ఆస్టిన్, శాన్అంటానియో, కార్పస్ క్రిస్టీ, మిడ్ల్యాండ్, ఓడిస్సా మొదలైన నగరాలనుండి 100 మందికి పైగా పాల్గొన్న ప్రవాస భారతీయులలో ప్రవాసాంధ్రులైన డా. ప్రసాద్ తోటకూర, చిన సత్యం వీర్నపు, కుమార్ నందిగం, వెంకట్ ఏరుబండి, వెంకట్ గొట్టిపాటి, సతీష్ మండువ, నీలిమ గోనుగుంట్ల, ఆషా రెడ్డి, సుజిత్ ద్రాక్షారామ్, బంగార్ రెడ్డి, రాజ్ కళ్యాణ్ దుర్గ్ వారి కుటుంబ సభ్యులున్నారు.

భారత అమెరికా దేశాలమధ్య సంభందాల బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ కు ప్రవాసభారతీయులందరి తరపున డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రవాసభారతీయుల ముఖ్యమైన అన్ని ఉత్సవాలకు హాజరయ్యే గవర్నర్ మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డాలస్ లో జరిగిన మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా హాజరైన సంఘటన గుర్తుచేసుకుని గవర్నర్ కు మరోసారి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement