సర్పంచ్ బరిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
తాత ఆశయ సాధనకు ఎన్నికల బరిలోకి మనవడు
చిన్నశంకరంపేట(మెదక్): అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షల్లో వేతనం.. అయినా గ్రామాభివృద్ధే ధ్యేయంగా సర్పంచ్ ఎన్నికల బరిలో దిగేందుకు తరలివచ్చాడు మెదక్ జిల్లా(Medak District) చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ కంజర్ల చంద్రశేఖర్. చిన్నశంకరంపేట(Chinna Shankarampeta) సర్పంచ్‌గా తన తాత శంకరప్ప 40 ఏళ్ల పాటు పనిచేసి గ్రామాభివృద్ధిలో భాగస్వామి అయ్యారు. గ్రామంలో ఏ నోట విన్నా శంకరప్ప చేసిన అభి వృద్ధి గురించే చెప్పుకుంటారు.
అదే స్ఫూర్తితో తాను సైతం గ్రామ అభివృద్ధిలో భాగస్వామి కావాలనే లక్ష్యంతో రూ.లక్షల వేతనం అందించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం(Software Engineer) వదిలాడు. ఆరునెలల క్రితం పంచాయతీ నోటిఫికేషన్ వెలువడుతుందనే ప్రభుత్వ ప్రకటనతో.. చంద్రశేఖర్ అమెరికా నుంచి గ్రామానికి చేరుకున్నాడు. మూడు నెలలుగా ప్రజలతో మమేకమై స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా, ముందు వరుసలో నిలిచి గ్రామస్తుల మన్ననలు పొందుతున్నాడు. ఈనెల 30న చిన్నశంకరంపేట సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేందుకు సమాయత్తం అవుతున్నాడు.


