పక్కాగా.. వన్యప్రాణుల లెక్క
19 నుంచి జంతు గణనకు సన్నద్ధం
జిల్లాలోని 98 బీట్లలో సర్వేకు సన్నాహాలు
అటవీశాఖ సిబ్బందితో పాటు పాల్గొననున్న విద్యార్థులు
●
జంతువుల లెక్క తేల్చేందుకు అటవీశాఖసిద్ధమైంది. ఈనెల 19 నుంచి 25 వరకు జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతాల్లో గణన కోసం సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం జిల్లాలోని 98 బీట్లలో బీట్‌కు ఇద్దరు చొప్పున 196మంది అవసరం కాగా, ప్రస్తుతం 74 మంది ఉన్నారు. దీంతో ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులను గణనలో భాగస్వామ్యులనుచేయనున్నారు.
– రామాయంపేట(మెదక్)
జిల్లా పరిధిలో 57,627 హెక్టార్లలో అటవీ భూమి విస్తరించి ఉంది. రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన ఈ అటవీ ప్రాంతంలో వేల సంఖ్యలో వన్యప్రాణులు ఉన్నాయి. చిరుతలు, ఎలుగుబంటి, తోడేళ్లు, జింకలు, నక్కలు, రేసు కుక్కలు, కొండ గొర్రెలు, దుప్పులు, నీల్‌గాయిలు, చుక్కల దుప్పులు, సాంబారు, కృష్ణ జింకలు, అడవి పందులు మనుగడ సాగిస్తున్నాయి. కాగా వీటి లెక్కింపులో పాల్గొననున్న ఆశాఖ సిబ్బందితో పాటు విద్యార్థులకు మొదటి విడత శిక్షణ ఇప్పటికే పూర్తయింది. సోమవారం నుంచి నర్సాపూర్‌లో రెండో విడత శిక్షణ ప్రారంభం కానుంది.
98 బీట్లు.. 196 మంది సిబ్బంది
జిల్లాలోని 98 బీట్లలో జంతుగణన ప్రారంభం కానుంది. ఇందుకోసం ఒక్కో బీట్‌లో ఇద్దరు చొప్పున 196 మంది సిబ్బంది అవసరం. ప్రస్తుతం ఈశాఖలో కేవలం 44 మంది బీట్ ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు. వీరితో పాటు కామారెడ్డి అగ్రికల్చర్ బీఎస్సీ, మెదక్ జిల్లాలోని ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులను లెక్కింపు కోసం వినియోగించుకుంటున్నారు. సాధారణంగా అటవీప్రాంతం, అందులో జంతువుల గురించి ఆశాఖ సిబ్బందికే పూర్తి అవగాహన ఉంటుంది. ప్రతి టీంలో అటవీశాఖ సిబ్బంది ఒకరితో పాటు ప్రైవేట్ వ్యక్తిని నియమిస్తున్నారు.
రోజూ నాలుగు కిలోమీటర్లు..
ఎంపిక చేసిన టీంలలో ఇద్దరు చొప్పున సభ్యులు ప్రతి రోజూ నాలుగు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో పర్యటించి జంతు గణన చేపడతారు. ఇందుకు గాను అడవిలో మార్కింగ్, డైరెక్షన్స్, మ్యాపులను అధికారులు ప్రకటించారు. గణన నిర్వహించే బయటి సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. కాగా మొదటి విడతగా 19 నుంచి మూడు రోజుల పాటు మాంసాహార జంతువుల గణన కొనసాగనుంది. ఇందులో కేవలం జంతువుల వివరాలు, పాదముద్రలు సేకరిస్తారు. 23 నుంచి మూడు రోజుల శాఖాహార జంతువుల గణన కొనసాగుతుంది. ఈమేరకు గుర్తించిన వాటి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు.
పర్వతాపూర్ అటవీ ప్రాంతం
జిల్లాలో ఇలా..
అటవీ విస్తీర్ణం 57,627 హెక్టార్లు
రేంజ్‌లు 6
డిప్యూటీ రేంజ్‌లు 8
సెక్షన్లు 21
బీట్లు 126
పకడ్బందీగా నిర్వహిస్తాం
ఈనెల 19 నుంచి జిల్లాలోని 98 బీట్లలో పకడ్బందీగా జంతు గణన చేస్తాం. ఇందుకు గాను తమ సిబ్బందితో పాటు వలంటీర్ల ను నియమించాం. మొదటి మూడు రోజులు మాంసాహార, తర్వాత మూడు రోజులు శాఖాహార జంతువుల గణన కొనసాగుతుంది. ఒక్కో టీంలో ఇద్దరు చొప్పున ప్రక్రియలో పాల్గొంటారు.
– జోజి, జిల్లా అటవీ అధికారి
పక్కాగా.. వన్యప్రాణుల లెక్క
పక్కాగా.. వన్యప్రాణుల లెక్క
పక్కాగా.. వన్యప్రాణుల లెక్క


