కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: హోలీ పండుగను పురస్కరించుకుని జిల్లాలో మూడు రోజులు డ్రైడే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నెల 5 తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి మూడు రోజుల పాటు మద్యం షాపులు మూసివేయనున్నట్లు చెప్పారు. పండుగల పవిత్రతను కాపాడేందుకు వైన్ షాపులు, బార్లు పూర్తిగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు.
రైల్వే జీఎంకు ఎంపీ రఘునందన్‌రావు వినతి
మెదక్‌జోన్: మెదక్ లోక్‌సభ పరిధి పెండింగ్‌లో ఉన్నా రైల్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవను కలిసి పెండింగ్ పనులపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. చేగుంట–మెదక్ ప్రధాన రహదారి వద్ద మంజూరైనా రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్‌ఓబీ) నిర్మాణంతో పాటు మెదక్ రైల్వేస్టేషన్‌లో కొనసాగుతున్న అమృత్ పనులపై చర్చించినట్లు చెప్పారు. అలాగే, మెదక్ జిల్లా అక్కన్నపేట్ వద్ద అజంతా, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని జీఎంకు వినతిపత్రం ఇచ్చారు.
ఎంఎల్‌ఆర్ ఆటో పరిశ్రమ వద్ద
చెలరేగిన మంటలు
మనోహరాబాద్(తూప్రాన్): పరిశ్రమ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి తగలబెట్టడంతో మంటలు అంటుకుంటున్నాయి. మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలో గల ఎంఎల్‌ఆర్ ఆటో పరిశ్రమల దగ్గరలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు గడ్డిని తగులబెట్టారు. కాగా మంటలు పరిశ్రమ వద్దకు వ్యాపించాయి. గుర్తించిన పరిశ్రమ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైర్ ఇంజన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు మంటలను ఆర్పి భారీ ప్రమాదాన్ని తప్పించారు. కాగా పరిశ్రమలో స్క్రాప్ ధ్వంసమైందని పరిశ్రమ సిబ్బంది తెలిపారు.
అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్
రామాయంపేట(మెదక్): పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్ పేర్కొన్నారు. వణ్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో విద్యార్థుల ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ముందు తరాలకు మంచి వాతావరణం కల్పించే దిశగా మనం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేసవిలో అటవీప్రాంతంలో మంటలు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు తమకు సహకరించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారిణి గీత పాల్గొన్నారు.
‘ద్వార’ బంధనం
నాచగిరి, విద్యాధరి ఆలయాలు మూసివేత
వర్గల్(గజ్వేల్): చంద్ర గ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం జిల్లాలోని సుప్రసిద్ధమైన నాచగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి, వర్గల్ విద్యాధరి ఆలయాలకు ద్వార బంధనం చేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ, అభిషేకం అనంతరం ఆలయాలలోకి యథావిదిగా భక్తులకు అనుమతి కల్పిస్తారని ఆలయ వేదపండితులు పేర్కొన్నారు.


