దూది రైతు దుఃఖం | - | Sakshi
Sakshi News home page

దూది రైతు దుఃఖం

Mar 4 2026 8:58 AM | Updated on Mar 4 2026 8:58 AM

తగ్గిన దిగుబడి.. పెరిగిన పెట్టుబడి 2025–26లో 1.18 లక్షల ఎకరాల్లో సాగు అధిక వర్షాలతో రాలిన పూత.. మురిగిన కాయ తీవ్రంగా నష్టపోయిన రైతులు

సాక్షి, సిద్దిపేట: పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు దిగుబడి తగ్గి.. మరోవైపు మద్దతు ధర దక్కక.. సీసీఐ నిబంధనలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అధిక వర్షాలతో కొంత పత్తి నల్లబారినా, తేమ ఎక్కువ ఉంటే సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించారు. జిల్లాలో ఇప్పటివరకు 81,321 మెట్రిక్‌ టన్నుల పత్తి మాత్రమే విక్రయించారు.

ఎకరాకు ఆరేడు క్వింటాళ్లే దిగుబడి

2025–26లో వానకాలంలో 1,18,785 ఎకరాల్లో పత్తి సాగైంది. అధికారుల అంచనా ప్రకారం ఎకరానికి 10 క్వింటాళ్ల చొప్పున లెక్కించినా 1.18 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా పత్తి రావాలి. అలాంటిది ఎకరానికి దాదాపు 6 నుంచి 7 క్వింటాళ్లే దిగుబడి వచ్చినట్లు పత్తి విక్రయాలను బట్టి తెలుస్తోంది. అధిక వర్షాలతో పత్తి రైతు నష్టపోయారు. పత్తి ఏరే సమయంలో ఎండ ఎక్కువ ఉండాలి. మబ్బులు పట్టడంతో పత్తికాయలు పగలలేదు, కొన్ని చోట్ల పత్తికాయలు చెట్ల మీదనే కుళ్లిపోయాయి. పత్తికాయల్లో తేమ శాతం పెరగడంతో నల్లబారి మొలకలు సైతం వచ్చాయి. పత్తి తగ్గడమే కాకుండా నాణ్యత సైతం దెబ్బతింది.

రెండేళ్ల కంటే తగ్గిన దిగుబడి

ఇటీవల సీసీఐ కొనుగోళ్లు ముగిశాయి. 57,949 మంది రైతుల నుంచి 74,146 మెట్రిక్‌ టన్నుల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110 చాలామంది రైతులకు దక్కలేదు. నాణ్యత లేదని క్వింటాలుకు రూ.100 తగ్గించారు. తేమ ఉందని, నాణ్యత లేదని సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్‌కు 7,175 మెట్రిక్‌ టన్నులు విక్రయించారు. తేమ పేరుతో, కొంత నల్లబారండంతో సీసీఐ కొనుగోళ్లు చేయలేదు. దీంతో రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించారు. గతేడాది కంటే 40వేల మెట్రిక్‌ టన్నుల పత్తి కొనుగోళ్లు తగ్గాయి.

సంవత్సరం సీసీఐ ప్రైవేట్‌ మొత్తం

(మెట్రిక్‌ టన్నుల్లో)

2023–24 74,588 26,199 1,00,787

2024–25 1,05,736 15,038 1,20,774

2025–26 74,146 7,175 81,321

నట్టేట ముంచిన పత్తి పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement