పిల్లర్లకే పరిమితం
మెతుకుసీమగా ప్రసిద్ధిగాంచిన మెదక్ పాలకుల నిర్లక్ష్యంతో ఏళ్ల తరబడి వెనుకబాటుకు గురవుతూనే ఉంది. ప్రభుత్వాలు మారినా పట్టణ ముఖచిత్రం మాత్రం మారడం లేదు. జిల్లా కేంద్రం ఏర్పాటుతో ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రజలు పెట్టుకున్న కొండంత ఆశలు అడియాశలయ్యాయి. చిన్నపార్కుకు కూడా నోచుకోలేదంటే మెదక్ పట్టణం ఎంత నిర్లక్ష్యానికి గురైందో ఇట్టే అర్థమవుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా యువకులు, కొత్తవారే కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. కనీసం వీరి హయాంలోనైనా పేరుకు పోయిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందేమోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
– మెదక్ కలెక్టరేట్
మెదక్ పట్టనంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన రైతుబజారును యేళ్ల తరబడి ప్రారంభించకుండా వదిలేశారు. జిల్లా నలుమూలల నుంచి కూరగాయలు తెచ్చిన రైతులు రోడ్లపైనే అవస్థలు పడుతున్నారు. రైతుబజారును ప్రారంభించి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే.. మున్సిపాలిటీకి ఆదాయాన్ని సమకూర్చే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో పాతవారే పాతుకు పోయారు. 40 యేళ్లుగా కొనసాగుతున్న మున్సిపల్ దుకాణాలకు రీ టెండర్లు వేయాలని పలు సంఘాల నాయకులు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశారు. గతంలో ఉన్న కలెక్టర్లు సైతం ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ బల్దియా పాలకవర్గం పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. దీంతో కొంతమంది చేతుల్లోనే పదుల సంఖ్యలో దుకాణాలు ఉండగా, బల్దియా ఆదాయానికి గండి పడుతూనే ఉంది. కొత్త పాలకవర్గంతో మార్పు వస్తుందని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.
సేదతీరేందుకు చోటేది?
జిల్లా కేంద్రం ఏర్పాటుతో సమీకృత కలెక్టరేట్, ఎస్పీతోపాటు పలు శాఖల కార్యాలయాలు నిర్మించారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు నిత్యం అధిక సంఖ్యలో వస్తున్నారు. వివిధ పనులపై వచ్చే వారు సేదదీరేందుకు మంచి పార్కు కూడా లేకుండా పోయింది. ఉన్న పార్కులో కొంతభాగం మిషన్ భగీరథ పైలాన్ నిర్మించారు. మిగతా భాగంలో ప్రైవేట్ వాహనదారులు అడ్డాగా మార్చుకున్నారు.
సుందరీకరణ ఆగమాగం
పట్టణంలోని మల్లం, పిట్లం, గోసముద్రం చెరువుల సుందరీకరణ పనులు చేపట్టారు. మినీ ట్యాంక్‌బండ్‌ల ఏర్పాటుకు గత పాలకులు రూ.కోట్లు ఖర్చుచేసి మధ్యలోనే వదిలేశారు. మల్లం చెరువు కట్ట డంపుయార్డుగా మారింది. ఈ రోడ్డు మీదుగా నర్స్‌ఖేడ్ వెళ్లే ప్రజలు, శ్మశాన వాటికకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు.
యేళ్ల తరబడి పేరుకు పోయిన సమస్యలు
పాలకుల నిర్లక్ష్యంతో పడకేసిన ప్రగతి
కొత్త పాలకవర్గంపైనే కోటి ఆశలు
పట్టణంలోని ఇందిరాపురికాలనీలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వైకుంఠధామాల నిర్మాణాలు పిల్లర్ల స్థాయిలో నిలిచిపోయాయి. రాందాస్ చౌరస్తా నుంచి సర్ధన వెళ్లే రోడ్డు యేళ్ల తరబడి పునరుద్ధరణకు నోచుకోవడం లేదు. నిధులు మంజూరైనట్లు పాలకులు చెబుతున్నా.. రోడ్డు పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. అలాగే రాందాస్ చౌరస్తాలో ఏర్పాటు చేస్తున్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నత్త నడకన సాగుతోంది. దుకాణాల కోసం డబ్బులు చెల్లించిన లబ్ధిదారులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు.


