అభాసుపాలైన దేశంలోకెల్లా బెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌! | From Best to Disgraced: How MP Police Station Lost Faith | Sakshi
Sakshi News home page

అభాసుపాలైన దేశంలోకెల్లా బెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌!

Dec 10 2025 4:23 PM | Updated on Dec 10 2025 5:09 PM

From Best to Disgraced: How MP Police Station Lost Faith

ప్రశంసలతో మొదలైన ప్రయాణం… అవమానంతో ముగిసింది. దేశంలోకెల్లా బెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌గా బిరుదు పొందిన కొద్ది రోజుల్లోనే… ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఇటు కోర్టు ముందు అవమానానికి గురైంది. ఇందుకు కారణం ఆ పీఎస్‌ సిబ్బంది చేసిన నిర్వాకమే.

పోలీస్‌ వ్యవస్థను కుదిపేసిన సంచలన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మల్హర్‌గఢ్‌ పోలీస్‌ స్టేషన్ దేశంలో అత్యుత్తమ పోలీస్‌ స్టేషన్లలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే అమాయకుడైన ఓ స్టూడెంట్‌ను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నంలో కోర్టులో పరువు పొగొట్టుకుంది.

సోహన్ అనే ఇంటర్‌ విద్యార్థిని ఆగస్టు 29న మల్హర్‌గఢ్‌ పోలీసులు డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ చేశారు. అతని నుంచి నిషేధిత మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామంటూ కోర్టులో ప్రవేశపెట్టారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసు నేపథ్యంతో..  కోర్టు అతనికి రిమాండ్‌ విధించింది. ఈ కేసులో నిందితుడి కుటుంబం డిసెంబర్‌ 5వ తేదీన మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇండోర్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. అక్రమ అపహరణ, తప్పుడు అరెస్ట్‌, నకిలీ సాక్ష్యాలు అంటూ.. కొన్ని ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. అందులో..

పోలీసులు చెప్పినట్లు డ్రగ్స్‌ లేదు. చేజింగ్‌ లేదు. ఎలాంటి సీజ్‌లు లేవు. బస్సులో వెళ్తున్న సోహాన్‌ను మఫ్టీలో వచ్చిన పోలీసులు బలవంతంగా బయటకు లాక్కెళ్లిన దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. పైగా ఎఫ్‌ఐఆర్‌లో అతని అరెస్ట్‌కు సంబంధించిన వివరాలతో పొంతన కుదరలేదు. దీంతో.. కోర్టు ఎస్పీని తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

డిసెంబర్‌ 9వ తేదీన మాందసౌర్‌ జిల్లా ఎస్పీ వినోద్‌ కుమార్‌ మీనా కోర్టులో చేతులు కట్టుకుని నిల్చోవాల్సి వచ్చింది. సోహాన్‌ను బస్సులోనే సివిల్‌ డ్రెస్‌లో ఉన్న పీఎస్‌ సిబ్బంది అరెస్ట్‌ చేసినట్లు అంగీకరించారు. ఇదంతా ఓ కానిస్టేబుల్‌ ఆధ్వర్యంలో జరిగిందని.. అరెస్ట్‌ మొదలు ఏదీ ప్రొసీజర్‌ ప్రకారం జరగలేదని కోర్టుకు వివరించారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఆరుగురు సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేసి డిపార్ట్‌మెంటల్‌ ఎంక్వైయిరీకి ఆదేశించినట్లు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ఈ పిటిషన్‌పై ఉత్తర్వులను వాయిదా వేసింది. ఈ కేసు పోలీస్‌ వ్యవస్థలో హాట్‌ టాపిక్‌గా మారింది.

నిరపరాధులను బలవంతంగా తీసుకెళ్లడం.. తర్వాత తప్పుడు కేసులు నమోదు చేయడం.. CCTVలో ఒకటి ఉంటే.. తప్పుడు సాక్ష్యాలతో  మానిఫులేషన్‌ చేయడం.. పోలీసుల కథనం వాస్తవానికి విరుద్ధంగా ఉండడం.. కుటుంబాలు కోర్టులను ఆశ్రయించడం.. కోర్టు ముందు పోలీస్‌ అధికారులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి రావడం.. కోర్టులతో ఆక్షింతలు వేయించుకోవడం.. మధ్యప్రదేశ్‌ ఘటన ఏపీలో జరుగుతున్న అక్రమ అరెస్టుల కేసులను గుర్తు చేస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement