సాక్షి, విజయవాడ: దొడ్డిదారిన తనపై నమోదైన ఫైబర్‌నెట్ కుంభకోణం కేసును క్లోజ్ చేసుకునేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ప్రయత్నానికి వైఎస్సార్‌సీపీ నేత, ఫైబర్‌నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి రూపంలో ట్విస్ట్ ఎదురైంది. తాజాగా గౌతమ్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను విచారించిన విజయవాడ ఏసీబీ కోర్టు.. ఉత్తర్వులను రెండ్రోజుల పాటు వాయిదా వేసింది.
2023లో ఫైబర్ నెట్ టెండర్ల కేటాయింపులో సుమారు రూ.300 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఏపీ సీడీఐ కేసు నమోదు చేసింది. బ్లాక్ లిస్టులో ఉన్న 'టెర్రా సాఫ్ట్' అనే సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఈ కేసులో ఆనాటి మాజీ సీఎం చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చింది. విచారణలో భాగంగా కొందరిని అరెస్ట్ చేయడంతో పాటు, ఆస్తుల అటాచ్‌మెంట్‌కు కూడా సిద్ధమైంది.
అయితే.. అదే సీడీఐ ఇప్పుడు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడికి ఏ పాపం తెలియదని.. ఈ కేసు క్లోజ్ చేయమని పిటిషన్ దాఖలు చేసింది. ఎలాంటి ఆధారాలు లభించలేదని, అందుకే కేసును మూసివేస్తున్నట్లు సీఐడీ, సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు నివేదిక సమర్పించారు. మాజీ ఎండీలు సైతం ఇందుకు అంగీకారం తెలిపారు. అయితే.. ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది.
తన ఫిర్యాదుతో ప్రారంభమైన కేసును, తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, తన వాదనలు వినకుండా ఎలా మూసివేస్తారని పూనూరు గౌతమ్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ కేసును క్లోజ్ చేయొద్దంటూ ప్రొటెస్ట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌లో ఇవాళ గౌతమ్ తరఫున పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు.
సీఐడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు గతంలో దర్యాప్తు సంస్థ పేర్కొన్న అభియోగాలను, వివరాలను.. ఇప్పుడు అధికారం ఉండడంతో కేసును మూసేయించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పొన్నవోలు. వాదనలు విన్న విజయవాడ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్ ఆర్డర్స్‌ను 11వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. కోర్టు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


