సాంకేతికత పేరుతో మోసం వద్దు
ఏపీ ఎన్నికల్లో భారీగా అవకతవకలు
ఫాం–20, 17సీ లెక్కల్లో తేడాలేంటి?
ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది
రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. టెక్నాలజీ పేరుతో వస్తున్న ఈవీఎంల కంటే నమ్మకమైన బ్యాలెట్ పేపర్ విధానాన్నే తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో సోమవారం ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
2024లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అవకతవకలను ఎండగడుతూ, ఎన్నికల సంఘం (ఈసీ) పనితీరుపై ప్రశ్నలవర్షం కురిపించారు. ఎన్నికల సంఘం 2024 మే 25న విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పోలైన ఓట్ల సంఖ్యకు, కౌంటింగ్ తర్వాత ఫాం–20లో చూపించిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోను ఈ తేడాలు స్పష్టంగా కనిపించాయన్నారు. ఈ తప్పులకు బాధ్యులెవరని ప్రశ్నించారు. బాధ్యులపై ఈసీ ఏం చర్యలు తీసుకుందని నిలదీశారు.
అసెంబ్లీకి, లోక్‌సభకు ఓట్లలో తేడా ఎలా?
‘ఒకేసారి జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో.. ఒకే ఓటరు జాబితా, ఒకే పోలింగ్ బూత్ ఉన్నప్పుడు ఫాం–17ఏ (ఓటరు రిజిస్టర్), ఫాం–17సీ (ఓట్ల లెక్క) మధ్య తేడాలు ఎలా వస్తాయి? రాజమహేంద్రవరం, రాయచోటి, యలమంచిలి, కడప, పులివెందుల వంటి అనేక నియోజకవర్గాల్లో ఈ వ్యత్యాసాలు వెలుగుచూశాయి. ఇది కచ్చితంగా ఓట్ల డేటాలో మాయాజాలం లేదా అవకతవకలే. ఎంత ఆధునికమైనా ఈవీఎంలను పూర్తిగా నమ్మలేం. అదే బ్యాలెట్ పేపర్ అయితే పాత పద్ధతే అయినా ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది. ఆడిట్ చేయడానికి వీలులేని ఏ వ్యవస్థా విశ్వసనీయం కాదు.
అందుకే రాబోయే అన్ని ఎన్నికల్లోను ఈవీఎంలను రద్దుచేసి, బ్యాలెట్ పేపర్లను తీసుకురావాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల పారదర్శకత కోసం వైఎస్సార్‌సీపీ తరఫున ఆయన కేంద్రానికి, ఈసీకి పలు సూచనలు చేశారు. ‘పోలింగ్ రోజు సీసీటీవీ ఫుటేజీ, ఫాం–17ఏ, 17సీ వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈవీఎంల వెరిఫికేషన్‌ను కచ్చితంగా అమలు చేయాలి. వందశాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉండాలి..’ అని సూచించారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 40 శాతం ఓటింగ్ షేర్ వచ్చిందని చెప్పారు. కానీ జరిగిన అవకతవకలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


