కోటికి పైగా సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాలలో భారీ ర్యాలీలు
పోలీసు ఆంక్షలు, నిర్బంధాలను లెక్క చేయకుండా వెల్లువెత్తిన జనవాహిని
కదం తొక్కిన విద్యార్థులు, యువత, మహిళలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు
175 నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాల ర్యాలీలకు స్వచ్ఛందంగా తరలివచ్చిన జనం
కొత్త మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని సర్వత్రా డిమాండ్
17 మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు ధారాదత్తం చేయడంపై నిలదీత
వైఎస్ జగన్ పిలుపు మేరకు రచ్చబండ–కోటి సంతకాల సేకరణకు అపూర్వ స్పందన
జిల్లా కేంద్రాల నుంచి భారీ ర్యాలీల నడుమ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతకాల ప్రతులు తరలింపు
ఈ నెల 18న వైఎస్ జగన్ నేతృత్వంలో సంతకాల ప్రతులు గవర్నర్‌కు అందజేత
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం మహోద్యమంగా మారి ఉవ్వెత్తున ఎగసిపడింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో చేపట్టిన రచ్చబండ కోటి సంత కాల సేకరణ కార్యక్ర మానికి భారీ స్పందన లభించింది.
మారు మూల గిరిజన గూడేల నుంచి జిల్లా కేంద్రాల దాకా సర్వత్రా కోటి సంతకాల సేకరణకు ప్రజా మద్దతు లభించింది. అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొని తమ అభీష్టాన్ని సంతకాల రూపంలో చంద్రబాబు సర్కారుకు చాటి చెప్పారు. జిల్లా కేంద్రాల నుంచి భారీ ర్యాలీల నడుమ వాహనాల్లో సోమవారం తాడేపల్లి లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి సంతకాల ప్రతులను తరలించారు.
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, విజయవాడ, నెట్‌వర్క్: వైఎస్ జగన్ కృషితో సాకారమైన ప్రభుత్వ వైద్య కళాశాలలను పప్పుబెల్లాల మాదిరిగా చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంపై కోట్ల గొంతులు కన్నెర్ర చేశాయి. పేదలకు చేరువలో ఉచితంగా సూపర్ స్పెషాల్టీ వైద్యం, మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలలను చిదిమేశారని ర్యాలీల్లో కదం తొక్కాయి. ప్రభుత్వ భూమి.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు..ప్రభుత్వ ఆస్పత్రులు.. ప్రయోజనం పొందేది మాత్రం ప్రైవేట్ వ్యక్తులా..? అంటూ చంద్రబాబు సర్కారు దుర్మార్గ విధానాలను ఊరూరా ప్రజలు నిలదీశారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణలో శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. విద్యాసంస్థల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. మారుమూల ప్రాంతాల నుంచి ప్రతి గ్రామంలోనూ విద్యార్థులు, యువత, మహిళలు, మేధావులు, విద్యావేత్తలు, సామాజిక ఉద్యమకారులు ఇందులో పాలు పంచుకుని చంద్రబాబు సర్కారు ప్రజా కంటక విధానాలను తీవ్రంగా నిరసించారు.
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఈ సర్కారుకు బుద్ధి చెప్పేందుకు ఎలాంటి ఉద్యమాలకైనా వెనుకాడబోమని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడటమే కాకుండా బోధనాస్పత్రులను సైతం ధారాదత్తం చేయడం దుర్మార్గమని కోట్ల గళాలు మండిపడ్డాయి. ఆయా ఆస్పత్రుల్లో పని చేసే వైద్యులు, సిబ్బంది వేతనాలను సైతం ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తామని చంద్రబాబు సర్కారు ప్రకటించడం దోపిడీకి పరాకాష్ట అంటూ సర్వత్రా ఆగ్రహం పెల్లుబికింది.
రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఊరూరా నినదించారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలలకు పైగా సాగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చంద్రబాబు సర్కారు కక్షపూరిత విధానాలపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహాన్ని చాటి చెబుతోందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ కృషితో సాకారమైన ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్‌కు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా ప్రజల సంతకాలను సేకరించిన విషయం తెలిసిందే.
ఇంటింటా, ఊరూరా వైఎస్సార్‌సీపీ నాయకులు పర్యటించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ సంతకాల ద్వారా ప్రజల మద్దతు సేకరించారు. ఈ సంతకాల ప్రతులతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించి వాటిని వాహనాల్లో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, బాపట్ల తదితర జిల్లాలకు చెందిన కోటి సంతకాల వాహనాలకు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి స్వాగతం పలికారు.
పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరిన కోటి ప్రతులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 18వతేదీన గవర్నర్‌ను కలిసి నివేదించి ప్రజా స్పందనను వివరించనున్నారు. కోటి సంతకాల ప్రతుల వాహనాలతో ఎక్కడికక్కడ జరిగిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు, మేధావులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని చంద్రబాబు సర్కారు నిరంకుశ విధానాలపై కన్నెర్ర చేశారు. పోలీసు ఆంక్షలు, చెక్‌పోస్టులు, నిర్బంధాలను లెక్కచేయకుండా ర్యాలీలకు పోటెత్తారు.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే.. మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.8,480 కోట్లతో ఒకేసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలోనే ఏడు కాలేజీలు సిద్ధం కాగా, ఐదు కళాశాలల్లో తరగతులు కూడా మొదలయ్యాయని.. పులివెందుల కాలేజీకి ఎంఎన్‌సీ సీట్లను కేటాయించినా చంద్రబాబు ప్రభుత్వం తమకు వద్దంటూ అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. సర్వం సిద్ధంగా ఉన్న కాలేజీలను ఈ ప్రభుత్వం ప్రైవేట్‌కు అప్పనంగా కట్టబెడుతోందని.. అది చాలదన్నట్లుగా నర్సింగ్ కాలేజీలను కూడా నడుపుకోవచ్చని పచ్చజెండా ఊపడంపై సర్వత్రా జనాగ్రహం వ్యక్తమైంది.
మెడి‘కిల్’బాబుపై కోటిగళాల గర్జన
ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. గడిచిన 19 నెలల్లో రూ.2.68 లక్షల కోట్లు అప్పుచేసిన చంద్రబాబు, రూ.5వేల కోట్లతో మెడికల్ కాలేజీలు ఎందుకు నిరి్మంచడం లేదు? సంపద సృష్టి ఏమైంది? రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదు? మాజీ సీఎం వైఎస్ జగన్ మాటగా చెబుతున్నా.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. – బొత్స సత్యనారాయణ, శాసనమండలి విపక్షనేత
దోచుకోవడం.. దాచుకోవడమే బాబు నైజం
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు పప్పుబెల్లాల్లా పంచిపెట్టి తద్వారా రూ. వేల కోట్లు దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకుంటారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధిని చంద్రబాబు ఏనాడూ ఆకాంక్షించరు. అందుకే మా నాయకుడు వైఎస్ జగన్ పేదల కోసం నిర్మించిన 17 మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేసి రూ. వేల కోట్లు దండుకోవాలని చూస్తున్నాడు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్


