సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఉద్యమానికి అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రజలకు కృతజ్ఞతలు
ప్రజారోగ్య వ్యవస్థను, వైద్య విద్యను దోచుకునే ఈ పట్టపగలు దోపిడీకి వెంటనే తెరపడాలని ఆకాంక్షిస్తూ ‘ఎక్స్’లో పోస్టు
‘సేవ్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అంటూ హ్యాష్ ట్యాగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ప్రారంభించిన కోటి సంతకాల ఉద్యమం అత్యంత విజయమైందని.. చారిత్రాత్మకంగా నిలిచిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన భారీ ర్యాలీలు, అందులో ప్రజల సంతకాల ప్రదర్శన ఇవన్నీ చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనను, విధానాలను ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా చాటుతున్నాయన్నారు.
ఈ ఉద్యమానికి అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ‘సేవ్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. అందులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..
పౌరులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు..
‘‘ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ప్రారంభించిన కోటి సంతకాల ఉద్యమం కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదు. చంద్రబాబునాయుడి ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు. ప్రజాప్రయోజనాలను పణంగా పెడుతూ, వారికి ద్రోహం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ, కోటిమందికి పైగా పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని సంతకాలు చేశారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా అందుబాటులో ఉన్న వైద్య విద్యను, ప్రజారోగ్య వ్యవస్థను నాశనం చేస్తారనే ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణగా నిలిచింది. సేకరించిన కోటి సంతకాల పత్రాలు ప్రస్తుతం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుతున్నాయి. అక్కడినుంచి డిసెంబర్ 18న గౌరవ గవర్నర్‌కు సమర్పిస్తాం. తద్వారా ప్రజల గొంతు రాష్ట్రంలోని అత్యున్నత రాజ్యాంగ అధికారికి చేరి, అనంతరం అది న్యాయస్థానాల తలుపులు తడుతుంది.
అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు
ఈ ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి వైఎస్సార్‌సీపీ నాయకుడు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి పౌరుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉద్యమంలో మీ భాగస్వామ్యం ద్వారా ప్రజల ఆస్తులను ప్రైవేట్‌కు అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది. ఈ ఉద్యమం ద్వారా చంద్రబాబు పాలనపై ప్రజలు తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను అమ్మేయాలన్న ఆయన యత్నాన్ని, నిర్ణయాలను, ఆయన పాలనను కోటి మంది ప్రజలు తిరస్కరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తీసుకున్న ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని చంద్రబాబు తక్షణమే వెనక్కి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నా. ప్రజారోగ్య వ్యవస్థను, అందుబాటులో ఉన్న వైద్య విద్యను దోచుకునే ఈ పట్టపగలు దోపిడీకి వెంటనే తెరపడాలి’’.


