సాక్షి, అమరావతి/భవానీపురం(విజయవాడపశ్చిమ): వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడ జోజినగర్‌లో ఇళ్ల కూల్చివేత బాధితులను ఆయన పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో జోజినగర్‌కు వస్తారు. అక్కడ కూల్చివేసిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడతారు. ఇళ్ల కూల్చివేత బాధితులు ఇప్పటికే వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి తమ ఆవేదనను తెలియజేశారు.
తమ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, కేవలం మూడు గంటలు గడువు ఇవ్వాలని కోరినా పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా ఇళ్లను ఎలా కూల్చివేసిందో వివరించారు. ఆ సమయంలో కూల్చివేసిన ఇళ్లను తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని బాధితులకు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ నేరుగా ఘటనాస్థలానికి వెళ్లి ప్రత్యక్షంగా బాధితులను కలవనున్నారు.
అనంతరం ఆయన తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో జోజినగర్ వద్ద సోమవారం ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, నేతలు వెలంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రుహుల్లా, నగర మేయర్ రాయన
భాగ్యలక్ష్మి ఏర్పాట్లను పరిశీలించారు.


