బాబు సర్కారు కల్పించిన ఆటంకాలను దాటుతూ ముందుకు
కోటి సంతకాల ర్యాలీలను విజయవంతం చేసిన ప్రజలు
పోలీసుల నోటీసులు, అక్రమ కేసులు సైతం బేఖాతరు
నిర్బంధాన్ని ఛేదిస్తూ ర్యాలీల్లో ముందుకు కదిలిన వైనం
సాక్షి, అమరావతి : ర్యాలీల్లో పాల్గొనకుండా ఆంక్షలు.. చెక్‌పోస్టులతో అడ్డగింతలు.. పోలీసులకు ఆదేశాలు.. భగ్నం చేసేందుకు పన్నాగాలు..! ఇదీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు చేసిన కోటి సంతకాలతో సోమవారం వైఎస్సార్‌సీపీ నాయకత్వం, శ్రేణులు నిర్వహించిన ర్యాలీలను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన కుట్రలు. కానీ, ప్రజలు వీటిన్నిటినీ దాటుకుంటూ ర్యాలీల్లో అశేషంగా పాల్గొన్నారు. కిలోమీటర్ల కొద్దీ దండుకట్టి సర్కారు దుర్మార్గంపై దడపుట్టించారు. నిర్బంధాలను ఛేదిస్తూ, అడ్డంకులను దాటుకుంటూ విజయవంతం చేశారు.

వైఎస్సార్‌సీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో పాటు ర్యాలీలకు యువత, ఉద్యోగులు, మేధావులు సహా అన్ని రంగాల నిపుణులు స్వచ్ఛందంగా ముందుకురావడంతో చంద్రబాబు ప్రభుత్వానికి కంటగింపైంది. దీంతో ఎలాగైనా భగ్నం చేయాలని కుట్రలు పన్నింది. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్‌సీపీ ర్యాలీలను నిలువరించాలని జిల్లా ఎస్పీ... సీఐ, ఎస్‌ఐలకు గట్టిగా చెప్పారు. దీంతో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు.

⇒ ఇచ్ఛాపురంలో జడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ, పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మండపామ్ టోల్ గేట్ వద్ద మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సమన్వయకర్త పేరాడ తిలక్‌లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టోల్ గేట్ నుంచి నిరసన ర్యాలీ తీశారు.
⇒ వేలాదిమందితో ఆమదాలవలసలో సమన్వయకర్త చింతాడ రవికుమార్ నిర్వహించిన ర్యాలీని పోలీసులు మూడుచోట్ల అడ్డుకున్నారు.
⇒ శ్రీకాకుళం అరసవల్లి జంక్షన్‌లో నరసన్నపేట నాయకులతో వస్తున్న ధర్మాన కృష్ణ చైతన్యను పోలీసులు అడ్డుకున్నారు.
⇒ విజయనగరం జిల్లా కేంద్రంలో ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు నిర్బంధం విధించినా ప్రజలు లెక్కచేయలేదు.
⇒ ఏలూరులో నాలుగు కిలోమీటర్ల మేర ర్యాలీ చేసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. కానీ, పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో దూరాన్ని కుదించారు.
⇒ కర్నూలులో పోలీసులు ఏకంగా నోటీసులు జారీచేసి అడ్డుకోవాలని చూశారు. కానీ, వీటిని లెక్కచేయకుండా ర్యాలీల్లో ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా
పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ముక్కోటి గొంతుకలతో వ్యతిరేకించారు. ర్యాలీలతో కదంతొక్కారు.


