అనర్హత షరతు సడలించి మరీ ఐదేళ్లపాటు అడిగినంత రాయితీలు
కర్నూలులో రూ.1,622 కోట్లతో పండ్ల పానీయాల తయారీ యూనిట్ ఏర్పాటు
రూ.601.87 కోట్ల రాయితీలు ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్
ఉద్యోగాల కల్పన కేవలం 1,200 మందికే ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని సడలించి మరీ చంద్రబాబు సర్కారు రిలయన్స్ సంస్థకు జీహుజూర్ అంటోంది. ఆ సంస్థ అడిగినంత మేర ఐదేళ్ల పాటు రాయితీలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇటీవల జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పరిశ్రమలు, వాణిజ్య శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్ కన్సూ్యమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ పానీయాల తయారీ యూనిట్ (కార్బొనేటేడ్ సాఫ్ట్‌డ్రింక్స్, పండ్ల రసాలు–ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్)ను ఏర్పాటుచేయనుంది.
ఇందుకోసం రూ.1,622 కోట్ల పెట్టుబడితో 1,200 మందికి ఉపాధి కల్పించనుంది. అయితే, రిలయన్స్ కన్సూ్యమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ మొత్తం స్థిర మూలధన పెట్టుబడిలో రూ.601.87 కోట్లు టైలర్ మేడ్ రాయితీలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ఐదేళ్ల పాటు ఈ రాయితీలు ఇవ్వడానికి రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ విధానం (2024–29) ప్రకారం అనర్హతగా ఉంది. దీంతో.. ఈ అనర్హత షరతును సడలిస్తూ దీనిని ప్రత్యేక కేసుగా పరిగణించి ఐదేళ్ల వ్యవధిలో మూలధన సబ్సిడీని మంజూరుచేసేందుకు చంద్రబాబు సర్కారు ఆమోదం తెలిపింది. సంస్థ అడిగినంత మేర రూ.601.87 కోట్ల రాయితీ చెల్లించేందుకు అనుమతించింది.
కేపిటల్ సబ్సిడీ కింద రూ.25 కోట్లు, రాష్ట్రంలో తయారుచేసి విక్రయించే ఉత్పత్తులపై ఎస్‌జీఎస్‌టీ కింద నగదు రూపంలో రాష్ట్రానికి వచ్చే 100 శాతాన్ని ఐదేళ్ల పాటు తిరిగి సంస్థకు చెల్లించనున్నారు. ఇలా ఐదేళ్లలో రూ.493.95 కోట్లు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ఐదేళ్ల పాటు విద్యుత్ చార్జీల కింద రూ.40.86 కోట్లను.. ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు కింద ఐదేళ్ల పాటు రూ.40.86 కోట్లను రాయితీ రూపంలో ఇస్తారు. అలాగే, స్టాంప్ డ్యూటీ, బదిలీ సుంకం, భూ మార్పిడి ఛార్జీల రూపంలో రూ.1.20 కోట్లు తిరిగి చెల్లిస్తారు. ఇంధన శాఖ, రెవెన్యూ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ సీఈఓ, ఏపీఈడీబీ సీఈఓ, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని, నిర్దేశించిన సమయంలో వివిధ అనుమతులు పొందేందుకు వీలు కల్పించాల్సిందిగా ఉత్తర్వుల్లో సూచించారు.
బడా సంస్థకు ఇంతగా రాయితీలా?..
ఇదిలా ఉంటే.. అత్యధిక ధనిక సంస్థ అయిన రిలయన్స్‌కు ఇలా అడిగినంత మేర రాయితీలు ఇవ్వడంపట్ల అధికార వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. ఒక పక్క చిన్నచిన్న పారిశ్రామికవేత్తలకు రాయితీ బకాయిలు ఇవ్వకుండా మరోపక్క బడా సంస్థలు అడిగినంత మేర పాలసీలను సడలించి మరీ రాయితీలు ఇవ్వడాన్ని అధికారులు తప్పుపడుతున్నారు. కేవలం 1,200 మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్న నేపథ్యంలో ఖజానా నుంచి ఏకంగా రూ.601.87 కోట్లు రాయితీలు ఇవ్వడాన్ని వారు తప్పుపడుతున్నారు.


