రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2 శాతం అదే ఏపీలో 8.2 శాతంగా నమోదు
మహిళల నిరుద్యోగ రేటూ ఏపీలోనే అత్యధికంగా 10.1 శాతం
పురుషుల నిరుద్యోగ రేటు 7.2%
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్ర బాబు పాలనలో రాష్ట్రంలో అప్పులతోపాటు నిరుద్యోగ రేటు భారీగా పెరిగిపోతోంది. జాతీయ స్థాయిని మించి ఆంద్రప్రదేశ్‌లో నిరుద్యోగ రేటు అత్యధికంగా ఉందని సోమవారం రాజ్యసభలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2 శాతంగా ఉంది. అదే ఆంద్రప్రదేశ్‌లో జాతీయ స్థాయిని మించి 8.2 శాతం నిరుద్యోగ రేటు ఉంది. జాతీయ స్థాయి సగటు నిరుద్యోగితతో పాటు మిగతా పెద్ద రాష్ట్రాల్లో కన్నా ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా నిరుద్యోగ రేటు ఉంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి చూస్తే మొత్తం ఏపీలో నిరుద్యోగ రేటు 8.2 శాతం ఉండగా పురుషుల్లో 7.2 శాతం, మహిళల్లో 10.1 శాతం నిరుద్యోగ రేటు ఉంది. ఎన్నికల ముందు టీడీపీ కూటమి ఉమ్మడి మేనిఫేస్టోలో చంద్రబాబు అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కలి్పస్తామని, లేదంటే అప్పటి వరకు నెలకు రూ. 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.
అయితే అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా ఆ హామీని అమలు చేయకపోగా నిరుద్యోగ భృతిని నైపుణ్య శిక్షణతో అనుసంధానం చేశానని, ఇక దీన్ని అమలు చేసినట్లేనని మాట మార్చేశారు. అలాగే ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తానని సూపర్ సిక్స్ హామీల్లో చంద్రబాబు చెప్పారు. ఈ హామీని కూడా చంద్రబాబు అటకెక్కించేశారు. ఆడబిడ్డ నిధి పీ–4తో అనుసంధానం చేశానని మహిళలను నిండా మోసం చేశారు. దీంతో రాష్ట్రంలో యువతకు ఉపాధి లభించడం లేదు. దీంతో నిరుద్యోగిత పెరిగిపోతోంది. ఇదే విషయాన్ని రాజ్యసభ సాక్షిగా కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


