అనంతలో పేట్రేగిన టీడీపీ మూకలు
దౌర్జన్యంగా గుడికి, కమ్యూనిటీ భవనానికి తాళాలు
పాత కమిటీని తొలగించి వారికి వారే కొత్త కమిటీ ఏర్పాటు
అర్చకుడి కుటుంబంపై దుర్భాషలాడుతూ దౌర్జన్యం
పట్టించుకోని పోలీసులు.. పైగా, తప్పుడు కేసు పెడతామని అర్చకుడికి బెదిరింపు
అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద బాధితుడి దీక్ష
శింగనమల/అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలోని శ్రీదుర్గాంజనేయ స్వామి ఆలయానికి, కమ్యూనిటీ భవనానికి టీడీపీ నాయకులు తాళాలు వేశారు. సోమవారం దౌర్జన్యంగా పాత తాళాలను పగలగొట్టి వారు వెంట తెచ్చుకున్నవి వేసుకున్నారు. ఈ ఆలయానికి సంబంధించి రెండునెలల క్రితం టీడీపీ మూకలు అధికారులపై ఒత్తిడి తెచ్చి పాత కమిటీని తొలగించారు. కొత్తగా టీడీపీ నాయకులే కమిటీ వేసుకున్నారు. తరువాత ఆలయ అర్చకుడు సిరి రమణను తొలగించాలని, అక్కడి నుంచి బయటకు పంపించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే అర్చకుడి కుటుంబంపై నానా దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన కొంతమంది సోమవారం ఆలయం వద్దకు చేరుకుని హల్‌చల్ చేశారు. వారి ఆగడాలు శృతిమించడంతో అర్చకుడు రమణ జిల్లా కలెక్టరేటులో గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఆయన తండ్రి ఒక్కరే ఆలయం వద్ద ఉన్నారు. దీంతో టీడీపీ నాయకులు దౌర్జన్యంగా ఆలయానికి, కమ్యూనిటీ భవనానికి సొంత తాళాలు వేసుకున్నారు. అర్చకులు డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు.
కలెక్టరేట్ ఎదుట అర్చకుడి దీక్ష
‘వంశపారంపర్యంగా మా ముత్తాతల కాలం నుంచి దాదాపు 150 ఏళ్లుగా శ్రీదుర్గాంజనేయస్వామి దేవస్థానంలో అర్చకత్వం చేస్తున్నాం. ఇప్పడు కొందరు వ్యక్తులు వచ్చి దేవస్థానం విడిచి వెళ్లాలంటూ దాడులు చేస్తున్నారు. పోలీసులకు, ఎంపీడీఓకి ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు’ అంటూ దేవస్థానం ప్రధాన అర్చకుడు బీఈ సిరి రమణ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఫుట్‌పాత్‌పై కూర్చుని దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దేవాలయానికి ఆదాయం లేకున్నా సొంత ఖర్చుతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 25 ఆవులనూ సొంత ఖర్చు, భక్తుల కానుకలతో పోషిస్తున్నాం. అయినా దేవస్థానం విడిచివెళ్లాలని మాపై కొందరు ఏడాది కాలంగా దౌర్జన్యం చేస్తున్నారు. భౌతిక దాడికి ప్రయతి్నస్తున్నారు. శింగనమల పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. పైగా.. నాపైనే తప్పుడు కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఈ గొడవకు ఐదుగురు వ్యక్తులు కారణం. అందులో ఒక విలేకరి (సాక్షి కాదు), రిటైర్డు తహసీల్దారు కూడా ఉన్నారు. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు కలెక్టరేట్ వద్దనే కూర్చుని నిరాహార దీక్ష చేస్తా’నని ఆయన చెప్పారు.


