వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో పార్టీ నేతలు
చందాలు వసూలు చేసుకోమనడం పొట్టి శ్రీరాములును అవమానించడమే
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి మండిపాటు
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా అమరజీవి వర్ధంతి
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలంతా ఐక్యంగా ఉండాలనే ఆశయంతో ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేసే స్థోమత చంద్రబాబు ప్రభుత్వానికి లేదా అని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ నిలదీశారు. అమరావతి కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పే చంద్రబాబు, ఏడాదిన్నరలో రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని.. కానీ పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు మాత్రం ఆర్యవైశ్యుల నుంచి చందాలు వసూలు చేసుకోమని చెప్పడం సిగ్గుచేటని, అమరజీవిని అవమానించడమేనని మండిపడ్డారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు డీపీఆర్ కోసమే రూ.11 కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి పొట్టి శ్రీరాములు విగ్రహం భారమైపోయిందా అని నిలదీశారు. రామోజీ సంస్మరణ సభల కోసం రూ. కోట్లు ఖర్చు చేయడంలో లేని ఇబ్బంది పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు వచ్చిందా అని మండిపడ్డారు.
ఈ అనైతిక విధానాలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖండించారని తెలిపారు. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించేలా జీవో ఇచ్చి ఐదేళ్లపాటు కొనసాగిస్తే, కూటమి ప్రభుత్వం ఆపేయడం దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు ప్రజలంతా కలిసుండాలన్న పొట్టి శ్రీరాములు ఆశయాలను వైఎస్సార్‌సీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ అమలు చేసి చూపించారని తెలిపారు.
ఈనాడు పొట్టి శ్రీరాములుని చంద్రబాబు అవమానిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ నాయకులు నారాయణ మూర్తి, పుత్తా శివశంకర్‌రెడ్డి, కొండా రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.


