గార్లదిన్నె/అనంతపురం సిటీ: కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇక తనకు పెళ్లి కాదనే బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన భీమన్నగారి చిదంబర కుమారుడు ప్రతాప్(31) వ్యవసాయ పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. తన ఈడు పిల్లలందరూ పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడగా.. తనకు ఇంకా పెళ్లి కాకపోవడంతో కుంగిపోయాడు.
తనకు పెళ్లి చేయాలని ఇంట్లో అడుగుతూ వస్తున్నా... అప్పులు ఎక్కువగా ఉన్నాయని, అవి తీరాక పెళ్లి చేస్తామంటూ కుటుంబ సభ్యులు వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ప్రతాప్ ఆదివారం రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయి గార్లదిన్నె రైల్వేగేట్ సమీపంలో గ్వాలియర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న యశ్వంత్‌పూర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్ నుంచి సమాచారం అందుకున్న రైల్వే ఎస్‌ఐ వెంకటేష్ సోమవారం అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.


