సాక్షి, విజయవాడ: భవానీపురం జోజి నగర్‌లో ఇళ్ల కోల్పోయిన బాధిత కుటుంబాలను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు తమ గోడును ఆయనకు చెప్పుకున్నాయి. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు కూల్చివేతలకు సంబంధించిన ఫొటోలను ఆయనకు చూపించాయి.
‘‘25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. మావన్నీ కూడా పట్టా భూములే. అన్ని అనుమతులున్నాయి. వాటర్, కరెంట్ బిల్లులు కడుతూ వచ్చాం. మా ఇళ్లను అన్యాయంగా కూల్చేశారు. మమ్మల్ని రోడ్డున పడేశారు..’’ అని జగన్ వద్ద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధితులతో.. ‘‘అధైర్య పడొద్దని.. అండగా ఉంటామని.. అన్నివిధాల అవసరమైన సాయం అందిస్తామని’’ అని ఆయన భరోసా ఇచ్చారు.

జగన్ రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలం నెలకొంది. ఆయన్ని చూసేందుకు.. ఫొటోలు తీసేందుకు.. సెల్ఫీలు దిగేందుకు.. కరచలనం చేసేందుకు.. భారీగా జనం తరలివచ్చారు.


ఈ నెల 3వ తేదీన విజయవాడ భవానీపురం జోజి నగర్‌లో 42 ఇళ్లను కూల్చేశారు అధికారులు. తమ ఇళ్లను కోల్పోయి రోడ్డునపడ్డ బాధితులు ప్రభుత్వ పెద్దలకు కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వైఎస్ జగన్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని దృష్టికి తీసుకెళ్లారు. బాధితులు కంటతడి పెట్టగా.. అధైర్యపడొద్దని, అండగా ఉంటానని, అవసరమైన న్యాయ సహయం అందిస్తానని ఆయన వాళ్లకు మాటిచ్చారు. ఈ క్రమంలో.. ఇవాళ స్వయంగా ఆయన జోజినగర్ వెళ్లి బాధితులతో కలిసి కూల్చివేత ప్రాంతాలను పరిశీలించనున్నారు.
ఇదిలా ఉంటే.. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ప్రొద్భలంతోనే కూల్చివేతలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూల్చివేతల సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కోర్టు ఆదేశాలున్నాయని చెబుతూ బలవంతంగా వాళ్లను పక్కకు లాగిపడేసి కూల్చివేతలు జరిపారు. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నామని.. పాతికేళ్లుగా ఏళ్లుగా నివాసముంటున్నామని.. ఇప్పుడు నిర్ధాక్షణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని పలువురు ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు.


