న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకల సమావేశాల్లో భాగంగా ఈరోజు(సోమవారం, డిసంబర్ 15వ తేదీ) లోక్‌సభలో కేంద్రం రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు, మరొకటి ది రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లు. ఈ రెండు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. అయితే వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లును జేపీసీ(జాయింట్ పార్లమెంటరీ కమిటీ) పంపే అవకాశం ఉంది.
వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు అంటే..
ఉన్నత విద్య నియంత్రణను పూర్తిగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఈ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది.యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ వంటి సంస్థలను రద్దు చేసి వాటి స్థానంలో ఒకే గొడుగు కింద వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ (VBSA) అనే కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
12 మంది సభ్యులతో కూడిన వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ అనే అత్యున్నత కమిషన్ ఏర్పాటుచేసి, ఉన్నత విద్యా విధానాలు, ప్రమాణాలు, నాణ్యత నియంత్రణను ఈ కమిషన్ పర్యవేక్షిస్తుంది. దీని ద్వారా కేంద్రానకి అధిక అధికారాలుంటాయి. దీని ఫలితంగా ఉన్నత విద్య నియమ నిబంధనలు అనేవి కేంద్రం నియంత్రణలోకి వస్తాయి. ముందుగా ప్రతిపాదించిన భారత ఉన్నత విద్యా కమిషన్( Higher Education Commission of India బిల్లును ఇప్పుడు వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లుగా మార్చారు.
ప్రయోజనాలు
సమగ్ర నియంత్రణగా అమలు చేయడానికి వీలవుతుంది. అన్ని ఉన్నత విద్యా సంస్థలకు ఒకే విధమైన ప్రమాణాలు.
విభిన్న సంస్థల మధ్య గందరగోళం తగ్గుతుంది.
ఒకే కమిషన్ ద్వారా విద్యా ప్రమాణాలు కఠినంగా అమలు చేయవచ్చు.
ది రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లు
పాత చట్టాలను రద్దు చేయడం లేదా వాటిలో మార్పులు చేయడం కోసం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లు. ఇది కొత్త చట్టాలను తీసుకురావడానికి లేదా పాత చట్టాల్లోని అనవసరమైన, పాతబడ్డ నిబంధనలను తొలగించడానికి ఉపయోగిస్తారు
ఇప్పటికే ఉన్న చట్టాల్లో మార్పులు చేయడం. ఉదాహరణకు, ఒక చట్టంలోని సెక్షన్‌లో పదాలను మార్చడం, కొత్త నిబంధనలను చేర్చడం, లేదా పాత నిబంధనలను సవరించడం జరుగుతంది. దీని ద్వారా చట్ట వ్యవస్థను సులభతరం చేయడం జరుగుతుంది.
రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ
మరొకవైపు రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ జరుగుతుంది. ఈ చర్చల్లో వైఎస్సార్‌సీపీ తరుఫున ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఏపీ ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘం విచారణ జరపాలని ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ అక్రమాలకు బాధ్యులెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లలో అనేక తేడాలున్నాయన్నారు. సీసీటీవీ ఫుటేజ అందుబాటులో ఉంచాలన్నారు. ఈవీఎంలను నమ్మలేని పరిస్థితి వచ్చిందని, పేపర్ బ్యాలెట్‌పై అందరికీ నమ్మకం ఉందన్నారు వైవీ సుబ్బారెడ్డి.


