అలజడులు సృష్టించడం.. పదుగురు అటెన్షన్ రాబట్టుకోవడం.. మనుషుల ప్రాణాలను ఏమాత్రం ఆదలెక్కలేకుండా ఎడాపెడా తీసేయడం.. ఇవే కదా ఉగ్రవాద లక్షణాలు.. లక్ష్యాలు. మరి ఈ ఉగ్రవాదం ఏదో ఒక మతానికి పరిమితం చేయడం ఎంతవరకు సబబు? క్రూరత్వానికి మతమేముంటుంది? విద్వేషానికి, కుట్రలకు, కుతంత్రాలకు మతమంటూ ఉంటుందా? తాజాగా ఆస్ట్రేలియా దేశం సిడ్నీలోని ఓ బీచ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. అయితే వీరిద్దరూ ముస్లిం మతానికి చెందిన వారు కావడంతో విమర్శలు మరింత ఘాటుగా.. నాటుగా ఉంటున్నాయి.
బాండీ బీచ్ లో ఆదివారం తుపాకులు గర్జించడంతో ఆస్ట్రేలియా సిడ్నీ ఉలిక్కిపడ్డాయి. బాండీ బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చిన సందర్శకులకు ఆక్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇద్దరు ఉగ్రవాదులు తుపాకులు చేతపట్టుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బాండీ బీచ్ లో సంప్రదాయంగా జరుగుతున్న హనుక వేడుకల్లో పాల్గొన్న జుయిష్ కమ్యూనిటీ ప్రజల్లో ఏమయ్యిందో తెలుసుకునేలోగా 14 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 29 మందికి గాయాలయ్యాయి. ఆనందోత్సాహాలతో కొనసాగుతున్న వేడుక.. రక్తసిక్త రణరంగంగా మారిపోయింది. ఈ ఉగ్రదాడుల్లో తండ్రి కుమారుడు పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు పాకిస్తాన్ నుంచి ఆస్ట్రేలియాకు వలస వచ్చిన వారు...ముస్లిం మతస్తులు కావడంతో...ఆ మతం పై సహజంగానే కొందరు విరుచుకు పడుతున్నారు.
అయితే ఇంత ఘోర ఉగ్రచర్యల్ని అడ్డుకుంది కూడా ఓ ముసల్మానే అని మనం గుర్తుంచుకోవాలి. అతనో పండ్ల వ్యాపారి. ఉగ్రవాదులైన తండ్రీ కొడుకులిద్దరూ తుపాకులు పట్టుకుని విచక్షణ రహితంగా కాలుస్తుంటే.. పండ్లవ్యాపారి అహ్మద్ అత్యంత ధైర్యసాహసాలను, మానవత్వాన్ని ప్రదర్శించాడు. వెనకనుంచి వచ్చి వారిలో ఒకరికి వారి గన్ తీసుకుని గురిపెట్టి తరిమేయసాగాడు. కానీ మరో ఉగ్రవాది అతడిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపడంతో అహ్మద్ రక్తగాయాలతో కుప్పకూలిపోయాడు. అహ్మద్ చొరవ ప్రదర్శించకుండా ఉంటే మరికొందరు కచ్చితంగా ప్రాణాలు కోల్పోయేవారే.
కాల్పుల ఘటన సమయంలో అక్కడే ఉన్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్...కామెంటేటర్ మైకేల్ వాన్ అహ్మద్ చూపిన చొరవ తెగింపును ప్రశంసించాడు. ఘటన సమయంలో బాండీ బీచ్ కు దగ్గర్లో ఉన్న ఓ రెస్టారెంట్‌లో వాన్ తన కుటుంబంతో ఉన్నాడు. ఫోన్లో మాటాడ్డానికి బైటికి వెళ్లిన సమయంలో ఈ కాల్పుల శబ్దం వినిపించినట్లు వివరించాడు. అహ్మద్ చూపిన మానవీయ దైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అహ్మద్ నిజమైన హీరో అని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.
పెహల్గాం దాడిలో పాల్గొంది ముస్లింలే కావచ్చు. వారు బాధితుల్ని మతం అడిగి మరీ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చు. అలాగే మన దేశంలో చాలా వరకు ఉగ్రదాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదుల మతం ముస్లిం మతమే కావచ్చు. అయినంత మాత్రాన అందరినీ అదే గాటన కట్టేయడం సరికాదని కొందరి అభిప్రాయం. ఉగ్రవాదమనేది మనిషిలోని అతిరేక లక్షణమే గానీ మతం విధానం కానేకాదు.
ఇప్పుడు చెప్పండి.. విచక్షణారహితంగా ఉగ్రరూపంతో కాల్పులు జరిపిన తండ్రీ కొడుకులు ముస్లిం మతానికి చెందిన వారు. అలాగే ధైర్య సాహసాలతో మానవీయతతో ప్రజల్ని ఆ కాల్పుల నుంచి కాపాడిన వ్యక్తి ముస్లిం మతానికి చెందిన వాడే. మరి ముస్లింలందరూ ఉగ్రవాదులే అన్న కొందరి వితండ వాదన నిజమైతే ...పండ్ల వ్యాపారి అహ్మద్ కు ఎదుర్కోవాల్సిన పనేం ఉంది. తను కూడా ఉగ్రవాదుల చర్యల్ని సమర్థించవచ్చు కదా అంటున్నారు సెక్యూలరిస్టులు. ముస్లింలలో కొంతమంది ఉగ్రవాదులుండవచ్చేమో గానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే అనడం అర్థరహితం. అసలు ఉగ్రవాదానికి ముస్లిం మతమెందుకు ఉంటుంది? అది కొందరు పనిగట్టుకుని అద్దిన రంగు మాత్రమే.
- ఆర్‌ఎం.


