breaking news
RM
-
అపర చెగూవేరా.. ఆపవేందిరా..
మేం మళ్లీ వస్తే అంటూ కొందరు బెదిరిస్తున్నారు.. బెదిరించేవారికి ఈ సారు భయపడడు.. మేం నిర్ణయం తీసుకుంటే మీకు మళ్లీ ఆ మాటలు రావు.. ఓ సభలో తమను నమ్మి చక్కని పాలన అందిస్తారని ఓట్లేసిన ప్రజల ముందు మన పవన్ సార్ పెట్టిన ముచ్చట్లు.. ఎన్నికల సమయంలో సీట్లు అమ్ముకున్నట్లు తనను విమర్శించారని, యూపీ సీఎం యోగి తరహాలో ట్రీట్మెంట్ ఇస్తే అంతా సెట్ అవుతారు.. కాలుకు కాలు.. కీలుకు కీలు తీస్తే ఆకు రౌడీలు దారికొస్తారు.. సాక్షాత్తు మన పవన్ సార్ పెట్టిన మరో ముచ్చట.అయితే ఇన్నేసి మాటలంటూ.. కాలుకు కాలు కీలుకు కీలు తీస్తామని బెదిరించేవారిని ఏమంటారంటూ ప్రజల్ని ఆలోచనలో పడేసారు. అయినా ఇంత కరుకుగా ఎలా మాట్లాడగలిగారని నోళ్ళు నొక్కుకోవాల్సిన అవసరం లేదు.. సారంటే ఎవరనుకున్నారు.. నట పవరేశ్వరుడు. ఏమాటకామాట.. అతనో విలక్షణ నటుడు. ఏ పాత్రనైనా అవలీలగా చేసే సామర్థ్యం ఆయన సొంతం. తనది కాని పాత్రలోనూ అంతే సహజంగా ఇమిడిపోవడం అతని స్పెషాలిటీ. మొన్నమొన్నటి దాకా స్పాంటేనియస్ గా ఆవేశం వచ్చేది. ఇప్పుడేమో బూతులూ వస్తున్నాయి. అభిమానుల చప్పట్లకు పరవశించని నటుడుండడు కదా.. వీరూ అందుకు మినహాయింపు కానేకాదు. తనే ఓ సైన్యాన్ని కట్టి పార్టీ పెట్టి జన బాహుళ్యంలో చొచ్చుకుపోవాలని గతంలో విఫలయత్నం చేశారు. అయితే ఒక్కోసారి అదృష్టం కూడా దారితప్పుతుంది కదా.. అలా మన సారు గారికి పవర్ రావడంతో పవరేశ్వరుడి అవతారం ఎత్తారు.అసలే వెండితెర హీరో.. ఒంటి చేత్తో లారీలు లేపి ఆవల పడేసిన ధీరోదాత్తం ప్రదర్శించిన వారాయే. ఓట్ల పండగనాడు వారెంత వీరంగం వేశారని.. అబ్బో చూడ్డానికి రెండు కళ్ళు చాలవంటే నమ్మండి. ప్రచారంలో ఆహా ఏం వాగ్దాటి.. ఆ.. ఏవన్నారు చూసి చదివారనా? సర్లేండి పేపర్లు పట్టుకునేవారు.. కళ్ళద్దాల్లోంచి తొంగి చూసి మరీ చదివేవారు.. అది కాదండీ మీరు చూడాల్సింది.. ప్రతి అయిదు నిమిషాలకోసారి పూనకం వచ్చినట్లు ఊగి రేగి చలరేగి పోయేవారు. అస్సలు ఆ కిక్ కోసమే కదా మేం కాళ్ళునొప్పెట్టేలా నిలుచుని మరీ చూసింది. మీరెన్నెన్ని అన్నా ఈసారి మన సారుకు బాగా వర్కవుట్ అయ్యింది. దెబ్బకు పెద్దసీట్లో పడ్డారు.. ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుందనమాట.సారు సినిమా రెండో భాగం ఇంకా సూపరు తెలుసా? అప్పుడే క్యారెక్టర్.. కాస్ట్యూములు మారిపోతాయి. అదెలా అదెలా అంటారేంటి సార్.. నటులకు ఆమాత్రం క్రియేటివ్ లిబర్టీ ఇవ్వరా ఏంటి? సరే మొన్నటి దాకా చెగువేరా అన్నారు. ఎర్రెర్రని జెండా ఎన్నీయల్లో అని స్టెప్పులేశారు.. గొంతుకు ఎర్ర తువాలు చుట్టుకున్నారు. మాటలో ఎరుపు అరువు తెచ్చుకున్నారు. ఇక ఎన్నికల్లో గట్టెక్కి సీట్లో సెటిలయ్యాక.. అడ్రస్ మారిస్తే ఎలా ఉంటుంది అని తెగ ఆలోచించారు. అదేమంటారు.. మేధోమథనం.. అదే అలా మదనపడీ పడీ.. సివరాఖరికి హిందూధర్మ పరిరక్షణోద్యమం అంటూ కాషాయం చుట్టేసుకుని నుదుటిపై పేద్ద బొట్టు పెట్టేసుకుని బొబ్బలు పెట్టడం మొదలెట్టారు. మొదట్లో కొందరు కంగారు పడిన మాట నిజవే. కానీ వెంటనే సర్దుకుని ఓహో క్యారెక్టర్ ఛేంజా అని సరిపెట్టుకున్నారు. ఎంతైనా వారి వెండితెర ప్రయాణంలో మమేకమైన అబిమానులం కదా ఆమాత్రం అడ్జస్టు చేసుకోలేమా ఏంటి? అని వ్యాఖ్యానించారు కూడా.అయినా సారు ఏ వేషం కట్టినా సరే.. ఆవేశం అస్సలు మిస్ చేయరు అదే బాగా నచ్చే విషయం. అపుడు చెగువేరా అని గర్జించారా.. ఇపుడు నా ధర్మం.. నా హిందుత్వ అంటూ గుండెలవిసేలా దిక్కులు పిక్కుటిల్లేలా ఘోషిస్తున్నారు. ఏదైనా అరుపే కదా మనకు కావల్సింది ఆ సౌండింగే కదా అందుకే పోనీలే పవరేశ్వరా ఈసారి ఇలా కానిచ్చేయ్ అంటూ అభిమానులు పచ్చజెండా బరబరా ఊపేసరికి సారువారు పొంగిపోయారు. అప్పట్నుంచి ఇదే బాపతు. అయినా దేశపెద్ద అండదండ తనకుందని.. ఇరు పెద్దల్ని కలిపిన పిల్లకాల్వలా తనకు ఎప్పటికైనా గుర్తింపు ఉండనే ఉంటుందని వారి గొప్ప నమ్మకం. అందుకే తాజాగా వారు తమదైన శైలిలో ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించారు. ఎందుకంటే అవసరం లేని చోట ప్రశ్నించడం వారి పురాప్రాప్త హక్కు కదా. అధికారంలోకి మళ్ళీ మేమొస్తే అని అన్నారో సహించం కాక సహించం అని గుడ్లురిమారు. బెదిరించే వారికి ఈ సారు అస్సలు భయపడడు.. రాజకీయంగా అనుకుంటే జస్ట్ 48 గంటల్లో అంతా క్లియర్ చేసేస్తాం అని హూంకరించారు. ఇక్కడ అర్థం కానిదేంటంటే...సారుకు కోపం ఎందుకొచ్చింది? ఎదుటి పార్టీవారేదో తమను బెదిరిస్తున్నారని.. సరే మరి మీరు బదులిచ్చిన ధోరణి ఎలా ఉంది? అది కూడా ఫక్తు బెదిరింపు ధోరణే కదా. ఈ మాత్రం దానికి మరీ అంతలేసి బిల్డప్పులు అవసురమా సార్. అసలు ఈపాటికే మీరు మీ పెద్దసారు చేయాల్సిందంతా చేస్తున్నారుగా.. ఇంకా తీగ లాగుడు ఎందుకు?పోనీ అలా అంటే వారేమైనా బెదురుతారా అంటే అదీ జరగదని మీక్కూడా తెలుసు. మరెందుకు పవరేశ్వర్ సార్ ఈ అనవసర రౌద్రు బీభత్స భయానక సమ్మిళిత డైలాగులు. దీనికన్నా కాస్త పాలన బెటర్‌గా చేయండి పదుగురు హ్యాపీగా ఫీలవుతారు. అంతేగానీ...రాక రాక వచ్చిందోచ్ నాకూ పవరూ అంటే ..అదేదో మీరన్నారే క్లియర్ చేస్తామని.. అంత రిస్క్ మీకెందుకు సార్.. మన ప్రజలున్నారుగా.. అయిదేళ్లు ఓపిక పట్టండి వారే క్లియర్ సేల్స్ బోర్డు పెట్టేస్తారు.-ఆర్ఎం -
దేవుడా... అలసిపోయావా?
అంతర్యామి అలసితి సొలసితి...అంటూ అన్నమయ్య నీరసంగా ఆపసోపలు పడుతూ పాడారే కానీ...ఇపుడు ఆ దేముడికే అలసట వచ్చిపడుతోంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామికి క్షణం తీరిక దొరకట్లేదు. వేళాపాళ లేకుండా భక్తాదులు వచ్చి వాకిట నిలబడుతుండటంతో వారి ఆలనా పాలనా చూసుకోవాల్సిన పెనుబాధ్యత స్వామి వారి భుజస్కందాలపై ఉంది. అర్ధరాత్రి అపరాత్రి అయినా భక్తులు దర్శనమీయాల్సిందే....మా మొర ఆలకించాల్సిందే అంటూ మొండికేస్తున్నారు. పైగా వడ్డీకాసుల వాడి చెంత ఉత్త చేతులతో ఎలాగూ పోలేరు...పాలకమ్మన్యులు పోనివ్వరు కూడా. పోనీ రాత్రి బాగా పొద్దుపోయాక కాసింత నడుం వాలుద్దామన్నా...కళ్ళు మూసి తెరిచేలోగా సుప్రభాత సేవలు షురూ అయిపోతున్నాయి. అంతలోనే అర్చకులు, భక్తులు కమలాకుచ చూచుక కుంకుమ...అంటూ శ్లోకాలు అందుకుం టున్నారు. స్వామివారు బిక్కమొగం వేసుకుని తన ఇరు దేవేరులను చూస్తూ భక్తులకు విసుగు కనిపించనీయకుండా ప్రసన్నచిత్తులై దర్శనమీవాలి. ఒక్కసారి గమనించండి దేముడికి ఎంత కష్టం వచ్చిందో.అందుకే సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఏంటసలు మీ తీరు...భక్తి సరే...భగవంతుడి మాటేంటి? స్వామి వారిని కనీసం నిద్రకూడా పోనివ్వరా? అనేక దంతం భక్తానాం అంటారా సరే..మరి కోట్లాది మంది భక్తులు నిరంతరం స్వామి చెంత నిలుచునుంటే...దేముడికి కాసింత పర్సనల్ స్పేస్ అక్కర్లేదా? కాసులకు కక్కుర్తిపడి గర్భగుడి తలుపులు వేళలు పాటించకుండా తెరిచేస్తారా? ఇది మీరు దేముడికి చేస్తున్న అపచారం కాదా? అంటూ బృందావన్ లోని బంకీ బిహారీ ఆలయ వ్యవహారంపై మండిపడింది. శక్తి కొద్ది భక్తి అన్నారు కానీ కరెన్సీ కొద్ది భక్తి అనలేదు కదా...మరి డబ్బున్న భక్తుల కోసం ఆ దేముడ్ని ఎందుకండీ ఇబ్బంది పెడతారు అంటూ సుప్రీం సీరియస్ అయ్యింది.బంకీ బిహారీ జీ ఆలయంలో పాలకుల తీరుతెన్ను చూసి మండిపోయిన ఓ భక్తాగ్రేసరుడు సుప్రీం చెంతకు చేరాడు. నాస్వామిని వీళ్ళందరూ రాచి రంపాన పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశాడు. దర్శన వేళలతోపాటు ఆలయ సంప్రదాయాల్లో తెచ్చిన మార్పుల్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేయడంతో ...సుప్రీం స్పందించక తప్పలేదు. ఆలయవేళల్లో మార్పు చేయడంతోపాటు దెహ్రి వంటి పలు ముఖ్యమైన ఆచారాలను బంద్ చేశారని పిటిషనర్ వాపోయారు. పోనీలే కనీసం ఓ భక్తుడైనా నా గురించి ఆలోచిస్తున్నాడని బంకీ బిహారీజీ అమందానంద కందళిత హృదయారవిందులై ఉప్పొంగి పోయుంటారుఈ సమస్య ఒక బంకీ బిహారీజీ...వేంకటేశ్వస్వామీ...సింహాద్రి అప్నన్న సామిలదే కాదు. అసలే మనకు ముప్పది మూడు కోట్ల దేముళ్ళు. కానీ కొందరికే భక్త పరంపర హెచ్చుగా ఉంటుంది. దాన్ని మనం తర్కించలేం. భక్తుని కష్టాలు భగవంతుడికే తెలుసంటారు...మరి భగవంతుడి కష్టాలు భక్తులకు తెలుసా? కనీసం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎంతసేపూ సేవలకు సొమ్ముకట్టామా....కాయకొట్టామా....ముడుపులు వేశామా...కొండవీటి చాంతాడంత కోరికల లిస్ట్ స్వామి ముందుంచామా....ఇదే తప్ప...అరె స్వామివారికి మనవల్ల ఎంత మనస్తాపం కలుగుతుంది...అసలు వారికి విశ్రాంతి దొరుకుతోందా అని ఎప్పుడైనా అనుకున్నామా? ఇదేం చోద్యం దేముడికి రెస్ట్ కూడా ఉంటుందా అని కొందరు ఎగతాళి చేస్తుంటారు...మరి ఆ స్లీపింగ్ స్లాటే లేకుంటే...ఉయ్యాల సేవలు...నిద్రపుచ్చే పాటలు ఎలా వచ్చాయండి? అని మరికొందరు లా పాయింటు లేవదీసి మరీ వాదిస్తుంటారు.ఇక తిరుమల వేంకటేశ్వరుడు...వారి భక్తిసామ్రాజ్యం ఎంత సువిస్తారమో....అక్కడ రాజకీయాలు అంతకన్నా విస్తారం. గత వైకుంఠఏకాదశి పుణ్యదినం కోసం ఎందరు భక్తులు టికెట్ల రద్దీలో చితికి ప్రాణాలు వదిలేశారో మనకు తెలుసు కదా. అదే సమయంలో గరికపాటివారి వ్యంగ్య ప్రసంగం తెగ వైరల్ కాలేదూ. అసలు వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యం దక్కుతుంది...ముక్తి ప్రాప్తమవుతుందని అశేష ఆస్తికమహాశయుల ప్రగాఢ నమ్మిక. అయితే శక్తి లేనివారిలో భక్తులుండరా? నీ కొండకు నీవే రప్పించుకో...ఆపదమొక్కలు మాతో ఇప్పించుకో అని ఘంటసాల ఎంత ఆర్డ్రంగా పాడారు. భక్తుడు రావాలా...లేదా తనే ఆతని వద్దకు వెళ్లాలా అని డిసైడ్ చేయాల్సింది భగవంతుడు. కానీ మన సర్కారు మహత్తరంగా...ప్రచారాలు చేసి మీకు మోక్షం దక్కాలన్నా...పున్నెం రావాలన్నా తెల్లారు జాము ఉత్తర దర్శనం తప్పని సరి అది ఈరోజే అంటూ ఊదరగొట్టినందుకే కదా తొక్కిసలాట...మరణాలు సంభవించింది. దీని పై సర్కారు స్పందన ఉండదు....కానీ లడ్డూలో కల్తీ అంటూ రాజకీయం చేయడానికి సిద్ధం. సాక్షాత్తు సుప్రీం కోర్టే సర్కారును నిలదీసి...తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారో లేదో తెలుసుకోకుండా ప్రచారాలు ఎలా చేస్తారు? భక్తుల మనోభావాలు దెబ్బతినవా అంటూ ప్రశ్నించింది. ల్యాబ్ రిపోర్టులో ఉన్న కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఆధారాలు ఏమున్నాయంటూ.. సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. తన మహాప్రసాదం...భక్తులు భక్తితో కళ్లకద్దుకుని స్వీకరించే లడ్డూపైన వివాదలు పుట్టించడం గమనించిన ఆ దేవదేవుడి మనసు ఎంత వ్యాకులత చెంది ఉంటుందో కదా. అయినా ఆలయాల్లో రాజకీయాలేంటి అని స్వామివారు చిరాకుపడ్డా ఇపుడు లాభం లేదు. ఎందుకంటే తిరుమల ఆ దశను దాటిపోయింది. అక్కడ ప్రతీది రాజకీయమే. దర్శనంతో మొదలు లడ్డూ దాకా...భక్తుని మొదలు పాలక మండలి దాకా అంతా రాజకీయమే. ఇంత జరుగుతున్నా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గట్లేదంటే అది స్వామివారి వైభవం...వైభోగం అంతే. ఒక తిరుపతే కాదు దేశంలో ఏ ఆలయమైనా భక్తులతో కిటకిటలాడుతునే ఉంటుంది. ఈ దేశంలో మనుషులతో కిక్కిరిసి కనిపించేవి రెండే రెండు...ఇకటి ఆలయం...రెండోది ఆసుపత్రి.ఏది ఏమైనా సుప్రీం జోక్యంతో అయినా బంకీ బిహారీ జీ ...తిరుపతి వెంకన్నలకు కాసింత ఊరట లభిస్తే అదే పదివేలు.:::ఆర్ఎం -
‘‘బాబుగోరు.. మీరు గుడ్డో గుడ్డూ’’
ఏది ఏమైనా బాబుగోరు మీరన్నా...మీ పాలన అన్నా చెవి కోసుకుంటా. అసలు మీలా పాలించేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? నాకైతే డౌటనుమానమే. గత ఎన్నికల్లో మీరు గొప్ప మనసు చేస్కొని మమ్మల్ని మీతో కలవనివ్వబట్టే కదా ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టా ...సెంటర్ లో మన సర్కారు నిలబెట్టా. మేం కూటమి అంటున్నామే కానీ అదంతా మీ చలవ కాకపోతే మరేందనుకుంటున్నారు. మీరు మాతో జట్టుకట్టబట్టే కదా ఈ పుణ్యం పురుషార్థం మాకు దక్కింది. అయినా బాబుగోరు మీ గొప్పతనం మీకు తెల్వదు... ఆంధ్రప్రదేశ్ ని ఎక్కడికక్కెడికో తీసుకెళ్లి పోతున్నారంటే నిజం నన్ను నమ్మండి..అసలు మీకున్న విజను...మీకున్న లిజను ఎవరికుంది చెప్పండి? కానీ విజన్ లేని వారికి ఏం తెలిసొస్తుంది చెప్పండి. ఒక్కోసారి వీరంతా ఎందుకొచ్చారా రాజకీయాల్లోకి అనిపించేస్తుందంటే నమ్మండి సుమండీ. అయినా కోటిజన్మల పుణ్యఫలం వల్లే కదా మీ స్నేహం మాకు దక్కింది. మీరాదరి మేమీ దరిని ఉన్నా....చెగువీరాను పూనిన ఆ అద్భుత వ్యక్తే కదా మనల్ని కలిపింది..లేదంటే మేమెంత ఒంటరి పక్షులమైపోయేవాళ్ళమో తలచుకుంటేనే గుండె తరుక్కుపోతుందంటే నమ్మండి సుమండి..అయినా ఎవరెవరో ఏదో అంటుంటారు...మనం అదంతా పట్టించుకోరాదు బాబుగోరు. అలా పట్టించుకుంటే రాజకీయాల్లో ఉండగలమా? అయినా నా చాదస్తం గానీ మీకు ఇవన్నీ కొట్టినపిండేగా. నిజమే అప్పుడెప్పుడో పాత ఎన్నికలప్పుడు మమ్మల్ని మీరు మనసారా దూషించారు. కానీ మీ తిట్లే మాకు దీవెనలని అనుకోలేదూ..అయినా బాబుగోరు మమ్మల్ని మీరు అప్పుడెంత దూషించారో...ఆ క్షణాన కాస్త కోపం వచ్చినా...మళ్ళీ మాతో కలవాలని మీరు పదే పదే కలవరించారు చూడండీ...అదీ మీ గొప్పతనం. మన మధ్య స్నేహబంధం నాగార్జునా సిమెంట్ కన్నా దృఢమైంది. కాకుంటే ఇన్నిసార్లు మీరు ఇన్నేసి మాటలన్నా...మళ్ళీ లటుక్కున వచ్చి మమ్మల్ని అతుక్కుపోయారు చూడండి...అబ్బబ్బా ఏమన్నా పొలిటికల్ విజనా మీది. .ఇక మీ సైనికుని గురించి ఏం చెప్పమంటారు...ఎంతని చెప్పమంటారు? ఇపుడు వారు మాకూ ఆంతరంగికులై పోయారు. అసలు వారిని మీరు బలే తయారు చేశారు బాబుగోరు. ఏ ఇజాలు తెలీకపోయినా...నిజాలు రాకపోయినా పర్వాలేదు పైకి మాత్రం గంభీరంగా ఎస్వీరంగారావులాగా తలూపుకొంటూ తిరుగుతుండాలి. ఆయన అచ్చం అలానే చేస్తున్నారాయే. మమ్మల్ని కలవక ముందు చెగువీరా అన్నారా...ఎర్రెర్రని జెండా ఎన్నీయల్లో... అని పాటలు కూడా పాడేశారా...ఇపుడు చూడండి నుదుటిపై ఇంతేసి బొట్టు పెట్టుకుని , కాషాయం చుట్టుకుని...నా ధర్మం...నేచూస్తా...నే కాస్తా అంటూ ఎర్రజెండా పట్టుకున్నోరిలా రంకెలు వేస్తున్నారు. అసలు మీ ట్రైనింగ్ ఇక్కడే కనిపిస్తోంది. నేను మారాను అని చెప్పకుండానే చేసి చూపిస్తున్నారు. జనాలు ఎలాగూ నమ్మరనుకోండి ...అది మా సిలబస్ కాదు కదా. చూశారా ఇదీ కదా సేవ..సారీ స్నేహధర్మమంటే..గత ఎన్నికల్లో మీతో కలిసి వెళ్ళడం నా పూర్వజన్మ సుకృతం అని అన్నానని బలే ప్రచారంలో పెట్టారు బాబుగోరు. అయినా అన్నామో లేదో ఆ పెరుమాళ్లకే ఎరుక...దాందేముంది లేండి...ఆ ప్రచారం వల్ల మీరు కుషీ అయితే అదే పదివేలు. గిట్టని వారు అది అబద్దమంటారని పీల్ కాకండి బాబుగోరు. మనం మనం బాగుంటే చాలు కదా...ఏదో మీ తృప్తి కోసం అలా అన్నారే అనుకోండి...మరీ అంత ప్రచారంలో పెడితే ఎలా? వదిలేయండి బాబుగోరు...మీ విజన్ కు అది ఆనదు గాక ఆనదు. అదేదో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మెడికల్ కళాశాలలు ప్రైవేటు వద్దంటూ కోటి సంతకాలు చేయిస్తున్నారటగా... నిరసనలు కూడా చేస్తున్నారటగా...జనాలూ వస్తున్నారటగా...ఆ మీరు బెదరుతారా ఏంది? అయినా ప్రైవేటైజేషన్ అంటే మీకు ఎంత ప్రేమో మాకు తెలీదా ఏంటి? మేం కూడా విశాఖ ఉక్కును ఎవరికైనా అప్పగిద్దామనే కదా అనుకుంటున్నది....కానీ గట్టిగా అనరాదు వేరెవరూ వినరాదు...మన సర్కారుకు ఇంకా బోల్డంత టైముంది ఇంకా చేయాల్సింది చాలా చాలా ఉంది...ఇదే కదా బాబుగోరు మీ మనసులో మాట....అరే మా మనసులోనూ ఇదే. కానీయండి అలా ముందుకెళదాం..సివారఖరికి మేము చెప్పొచ్చేదేంటంటే.. ప్రతిపక్షాలు కదా కాస్త ఘాటుగానే వ్యవహరిస్తుంటాయి. కానీ మనం కూడా తక్కువేం కాదుగా అంతకంతకు నాటుగానే ఉంటున్నాం. మీరు మాత్రం తగ్గేదేలా అన్నట్లుండండి. విజన్ అంటూ ఊదరగొట్టండి. అసలు జనాలు మీరు ఏం చెబుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం చేసుకోలేక బిక్కమొగం వేసుకోవాలి. వారు తేరుకునేలోగా మన పుణ్యకాలం ఎలాగూ పూర్తయిపోతుంది. మరి ఆతర్వాతో అంటారా...సినబాబు చూసుకుంటారు లెండి. మన ప్యూచరేంటి అంటారా? నందో రాజో భవిష్యతి అనుకుని గ్లాసు నీళ్లు గటగటా తాగేయడమే. సరే మరి నేనుంటా మీరలాగే ముందుకు వెళ్ళిపోతూనే ఉండండేం.. పొరపాటున కూడా ఆగకండి.::ఆర్ఎం -
ఉగ్రవాదమా.. నీ మతమేంటి?
అలజడులు సృష్టించడం.. పదుగురు అటెన్షన్ రాబట్టుకోవడం.. మనుషుల ప్రాణాలను ఏమాత్రం ఆదలెక్కలేకుండా ఎడాపెడా తీసేయడం.. ఇవే కదా ఉగ్రవాద లక్షణాలు.. లక్ష్యాలు. మరి ఈ ఉగ్రవాదం ఏదో ఒక మతానికి పరిమితం చేయడం ఎంతవరకు సబబు? క్రూరత్వానికి మతమేముంటుంది? విద్వేషానికి, కుట్రలకు, కుతంత్రాలకు మతమంటూ ఉంటుందా? తాజాగా ఆస్ట్రేలియా దేశం సిడ్నీలోని ఓ బీచ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. అయితే వీరిద్దరూ ముస్లిం మతానికి చెందిన వారు కావడంతో విమర్శలు మరింత ఘాటుగా.. నాటుగా ఉంటున్నాయి.బాండీ బీచ్ లో ఆదివారం తుపాకులు గర్జించడంతో ఆస్ట్రేలియా సిడ్నీ ఉలిక్కిపడ్డాయి. బాండీ బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చిన సందర్శకులకు ఆక్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇద్దరు ఉగ్రవాదులు తుపాకులు చేతపట్టుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బాండీ బీచ్ లో సంప్రదాయంగా జరుగుతున్న హనుక వేడుకల్లో పాల్గొన్న జుయిష్ కమ్యూనిటీ ప్రజల్లో ఏమయ్యిందో తెలుసుకునేలోగా 14 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 29 మందికి గాయాలయ్యాయి. ఆనందోత్సాహాలతో కొనసాగుతున్న వేడుక.. రక్తసిక్త రణరంగంగా మారిపోయింది. ఈ ఉగ్రదాడుల్లో తండ్రి కుమారుడు పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు పాకిస్తాన్ నుంచి ఆస్ట్రేలియాకు వలస వచ్చిన వారు...ముస్లిం మతస్తులు కావడంతో...ఆ మతం పై సహజంగానే కొందరు విరుచుకు పడుతున్నారు.అయితే ఇంత ఘోర ఉగ్రచర్యల్ని అడ్డుకుంది కూడా ఓ ముసల్మానే అని మనం గుర్తుంచుకోవాలి. అతనో పండ్ల వ్యాపారి. ఉగ్రవాదులైన తండ్రీ కొడుకులిద్దరూ తుపాకులు పట్టుకుని విచక్షణ రహితంగా కాలుస్తుంటే.. పండ్లవ్యాపారి అహ్మద్ అత్యంత ధైర్యసాహసాలను, మానవత్వాన్ని ప్రదర్శించాడు. వెనకనుంచి వచ్చి వారిలో ఒకరికి వారి గన్ తీసుకుని గురిపెట్టి తరిమేయసాగాడు. కానీ మరో ఉగ్రవాది అతడిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపడంతో అహ్మద్ రక్తగాయాలతో కుప్పకూలిపోయాడు. అహ్మద్ చొరవ ప్రదర్శించకుండా ఉంటే మరికొందరు కచ్చితంగా ప్రాణాలు కోల్పోయేవారే.కాల్పుల ఘటన సమయంలో అక్కడే ఉన్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్...కామెంటేటర్ మైకేల్ వాన్ అహ్మద్ చూపిన చొరవ తెగింపును ప్రశంసించాడు. ఘటన సమయంలో బాండీ బీచ్ కు దగ్గర్లో ఉన్న ఓ రెస్టారెంట్లో వాన్ తన కుటుంబంతో ఉన్నాడు. ఫోన్లో మాటాడ్డానికి బైటికి వెళ్లిన సమయంలో ఈ కాల్పుల శబ్దం వినిపించినట్లు వివరించాడు. అహ్మద్ చూపిన మానవీయ దైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అహ్మద్ నిజమైన హీరో అని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.పెహల్గాం దాడిలో పాల్గొంది ముస్లింలే కావచ్చు. వారు బాధితుల్ని మతం అడిగి మరీ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చు. అలాగే మన దేశంలో చాలా వరకు ఉగ్రదాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదుల మతం ముస్లిం మతమే కావచ్చు. అయినంత మాత్రాన అందరినీ అదే గాటన కట్టేయడం సరికాదని కొందరి అభిప్రాయం. ఉగ్రవాదమనేది మనిషిలోని అతిరేక లక్షణమే గానీ మతం విధానం కానేకాదు.ఇప్పుడు చెప్పండి.. విచక్షణారహితంగా ఉగ్రరూపంతో కాల్పులు జరిపిన తండ్రీ కొడుకులు ముస్లిం మతానికి చెందిన వారు. అలాగే ధైర్య సాహసాలతో మానవీయతతో ప్రజల్ని ఆ కాల్పుల నుంచి కాపాడిన వ్యక్తి ముస్లిం మతానికి చెందిన వాడే. మరి ముస్లింలందరూ ఉగ్రవాదులే అన్న కొందరి వితండ వాదన నిజమైతే ...పండ్ల వ్యాపారి అహ్మద్ కు ఎదుర్కోవాల్సిన పనేం ఉంది. తను కూడా ఉగ్రవాదుల చర్యల్ని సమర్థించవచ్చు కదా అంటున్నారు సెక్యూలరిస్టులు. ముస్లింలలో కొంతమంది ఉగ్రవాదులుండవచ్చేమో గానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే అనడం అర్థరహితం. అసలు ఉగ్రవాదానికి ముస్లిం మతమెందుకు ఉంటుంది? అది కొందరు పనిగట్టుకుని అద్దిన రంగు మాత్రమే.- ఆర్ఎం. -
ఇంక్రిమెంటేగా...ఇచ్చేస్తే పోలా...
వడ్డించేటోళ్ళు మనోళ్ళయితే ఆ కిక్కే వేరప్పా...డిపార్ట్ మెంట్ ఏదైనా...ఫికరే లేదు. మన బాస్ కు మనం కాకా కొడితే చాలు. బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనే సూత్రాన్ని గట్టిగా పాటిస్తే...జీతం అదంతటదే పెరుగుతుంది. తెలివితేటలు, శ్రద్ధ, నిబద్ధత...ఇవన్నీ తుప్పాస్... పెద్ద సార్ ను జాగ్రత్తగా చూసుకుని వారి కనుసన్నల్లో పడుంటే చాలు. అందుకే అక్కడి ఉద్యోగుల్లో కొందరికి ఎడాపెడా ఇంక్రిమెంట్లు వచ్చి పడుతున్నాయి. కారణం బాస్ భజనే. ఇదెక్కడో కాదండోయ్ సాక్షాత్తు న్యాయవ్యవస్థలోనే. అందరికీ శకునాలు చెప్పే బల్లి తానే కుడితిలో పడ్డట్టు...ఊరందరికీ న్యాయం చేసే పెద్దమనుషులు తమ కింది ఉద్యోగులకు మాత్రం తమను తోచినట్టుగా....తమకు నచ్చినట్టుగా ఇంక్రిమెంట్లు ఇస్తుండటంతో అందరూ ముక్కున వేలేసేకుని...ఔరా ఇలా కూడా చేస్తున్నారా అనుకుంటూ సన్నాయినొక్కుల నొక్కుతున్నారు.సాదారణంగా ఓ కంపెనీలో... ప్రైవేటయినా...ప్రభుత్వం అయినా...పనిచేసే ఉద్యోగికి ప్రమోషన్ రావాలన్నా...కనీసం ఇంక్రిమెంట్ పడాలన్నా...సదరు ఉద్యోగి తలప్రాణం తోకకొస్తుంటుంది. ఎంత పనిచేసినా...ఎంత కష్టపడినా...బాస్ గుడ్ లుక్స్ లో లేకుంటే ఆ ఉద్యోగికి ప్రమోషన్, ఇంక్రిమెంట్ల మాట అటుంచి ఉద్యోగం నిలబట్టుకోవడమే కష్టంగా మారిపోతుంటుంది. ఇంక్రిమెంట్లు ఎండమావుల్లా ఊరిస్తుంటాయే కానీ జీతంలో వచ్చి చేరవు. ఏడాదంతా కష్టపడి గొడ్డులా పనిచేస్తే...చివర్లో వచ్చే ఇంక్రిమెంట్ కోసం బిక్కమొగం వేసుకుని ఎదురు చూస్తుంటే... పదో పరకో మొహాన కొట్టే కంపెనీలు ఎన్ని లేవు. అలాగని ఆ ఉద్యోగాన్ని వదిలేసుకునే ధైర్యం చేయలేరు. ఇదేం గానుగెద్దులాంటి జీవితంరా బాబు. ఖర్చులు కొండవీటి చాంతాడంత...జీతం మాత్రం గొర్రబెత్తడంత అని నిట్టూర్చుకోవడం మినహా చేయగలిగేదేం ఉండదు.ఎవరికి ఏ అన్యాయం జరిగినా కోర్టు తలుపులు తట్టుతుంటాం. మనకు న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం...గౌరవం. ఎవరు అన్యాయం చేసినా అక్కడ న్యాయం దొరికే దొరుకుతుందని ఆనుకుంటుంటాం. అంతటి ప్రతిష్టాత్మకమైన సర్వోన్నత న్యాయస్థానంలోని ఉద్యోగం చేసేవారిలో కొందరికి అత్యధికంగా ఇంక్రిమెంట్లు దక్కుతున్నాయి. ఎంతటి ప్రతిభావంతుడికైనా ఏడాదికి ఒక ఇంక్రిమెంట్ న్యాయం ధర్మం. కానీ ఇక్కడ మాత్రం కొందరికి ఇబ్బడి ముబ్బడిగా ఇంక్రిమెంట్లు వచ్చేస్తున్నాయి. పోనీ వారు చేస్తున్న పనికి గుర్తింపా అంటే అదేం కాదు...బాస్ ను మెప్పించినందుకే ఈ నజరానాలు అని తెలుస్తోంది.సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తులు వారు తమ పదవీ కాలం ముగిసే సమయాన...వ్యవధి ఎంత తక్కువ కాలం అయినా సరే... రిటైర్ అయ్యేటైములో తమకు నచ్చిన వారికి...తమను మెప్పించిన వారికి ఇంక్రిమెంట్లు అప్పనంగా ఇచ్చేస్తున్నారు. ఏడాదికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు ఇవ్వడానికి ప్రధాన న్యాయమూర్తులు కొందరు వెనకాడటం లేదు. ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు వారికి అధికారం ఉందన్న ఏకైక కారణంతో తమ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారనేది విమర్శ. ఉద్యోగులకు వృత్తిగత నైపుణ్యం లేకున్నా...ఏడాదికి రెండు మూడు ఇంక్రిమెంట్లు ఉదారంగా ఇస్తున్నారు. ఇలా లబ్ది పొందన వారిలో సీజేఐ పర్సనల్ సిబ్బందే అధికం.ఈ అవ్యవహారాన్ని గత నాలుగైదేళ్లుగా గమనిస్తే...ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 2000మంది ఉద్యోగులకు ఒక ఏడాదలో పలుసార్లు ఇంక్రిమెంట్లు లభించాయి. ప్రధాన న్యాయమూర్తి కనుసన్నల్లో మెదిలిన కొందరు సిబ్బందికి ఆరుసార్లు ఇంక్రిమెంట్లు పడ్డాయంటే...పరస్థితి ఎంత దారుణంగా తయారైందో తెలుస్తోంది. సాధారణ పరిస్థితిలో లభించే ఇంక్రిమెంట్ల కంటే 150 శాతం అధికంగా లభించడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఇలా అవ్యవస్థగా సాగిన అవ్యవహారం గురించి చర్చించేందుకు మాజీ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ న్యాయమూర్తులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా చాలా మంది న్యాయమూర్తులు కోర్టు ఎవరి సామ్రాజ్యమో కాదని... ప్రధాన న్యాయమూర్తులు ఇక్కడ రాజులు కారని, వారి ఇష్టారీతిగా ఏదో అగ్రహారాలు రాసిచ్చినట్లు ఇంక్రిమెంట్లు ఇవ్వడం సరికాదని భావించారు. సుదీర్ఘ చర్చానంతరం ఇలా ఇష్టారీతిగా ఇంక్రిమెంట్లు ఇచ్చే విధానాన్ని బంద్ చేయాలని ఫుల్ కోర్టు నిర్ణయించింది అలాగే కొందరు ఉద్యోగులకు అర్తరహితంగా ఇచ్చిన ఇంక్రిమెంట్లను ఉపసంహరించుకోవాలని కోర్టు భావిస్తోంది. పొరపొటు తెలుసుకుని సరిచేయడం సరే...అసలు సర్వోన్నత న్యాయస్థానంలో కొందరు ప్రధాన న్యాయమూర్తులు ఈ వ్యవహార శైలి ఏంటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -ఆరెం.


