మేం మళ్లీ వస్తే అంటూ కొందరు బెదిరిస్తున్నారు.. బెదిరించేవారికి ఈ సారు భయపడడు.. మేం నిర్ణయం తీసుకుంటే మీకు మళ్లీ ఆ మాటలు రావు.. ఓ సభలో తమను నమ్మి చక్కని పాలన అందిస్తారని ఓట్లేసిన ప్రజల ముందు మన పవన్ సార్ పెట్టిన ముచ్చట్లు.. ఎన్నికల సమయంలో సీట్లు అమ్ముకున్నట్లు తనను విమర్శించారని, యూపీ సీఎం యోగి తరహాలో ట్రీట్మెంట్ ఇస్తే అంతా సెట్ అవుతారు.. కాలుకు కాలు.. కీలుకు కీలు తీస్తే ఆకు రౌడీలు దారికొస్తారు.. సాక్షాత్తు మన పవన్ సార్ పెట్టిన మరో ముచ్చట.
అయితే ఇన్నేసి మాటలంటూ.. కాలుకు కాలు కీలుకు కీలు తీస్తామని బెదిరించేవారిని ఏమంటారంటూ ప్రజల్ని ఆలోచనలో పడేసారు. అయినా ఇంత కరుకుగా ఎలా మాట్లాడగలిగారని నోళ్ళు నొక్కుకోవాల్సిన అవసరం లేదు.. సారంటే ఎవరనుకున్నారు.. నట పవరేశ్వరుడు. ఏమాటకామాట.. అతనో విలక్షణ నటుడు. ఏ పాత్రనైనా అవలీలగా చేసే సామర్థ్యం ఆయన సొంతం. తనది కాని పాత్రలోనూ అంతే సహజంగా ఇమిడిపోవడం అతని స్పెషాలిటీ. మొన్నమొన్నటి దాకా స్పాంటేనియస్ గా ఆవేశం వచ్చేది. ఇప్పుడేమో బూతులూ వస్తున్నాయి. అభిమానుల చప్పట్లకు పరవశించని నటుడుండడు కదా.. వీరూ అందుకు మినహాయింపు కానేకాదు. తనే ఓ సైన్యాన్ని కట్టి పార్టీ పెట్టి జన బాహుళ్యంలో చొచ్చుకుపోవాలని గతంలో విఫలయత్నం చేశారు. అయితే ఒక్కోసారి అదృష్టం కూడా దారితప్పుతుంది కదా.. అలా మన సారు గారికి పవర్ రావడంతో పవరేశ్వరుడి అవతారం ఎత్తారు.
అసలే వెండితెర హీరో.. ఒంటి చేత్తో లారీలు లేపి ఆవల పడేసిన ధీరోదాత్తం ప్రదర్శించిన వారాయే. ఓట్ల పండగనాడు వారెంత వీరంగం వేశారని.. అబ్బో చూడ్డానికి రెండు కళ్ళు చాలవంటే నమ్మండి. ప్రచారంలో ఆహా ఏం వాగ్దాటి.. ఆ.. ఏవన్నారు చూసి చదివారనా? సర్లేండి పేపర్లు పట్టుకునేవారు.. కళ్ళద్దాల్లోంచి తొంగి చూసి మరీ చదివేవారు.. అది కాదండీ మీరు చూడాల్సింది.. ప్రతి అయిదు నిమిషాలకోసారి పూనకం వచ్చినట్లు ఊగి రేగి చలరేగి పోయేవారు. అస్సలు ఆ కిక్ కోసమే కదా మేం కాళ్ళునొప్పెట్టేలా నిలుచుని మరీ చూసింది. మీరెన్నెన్ని అన్నా ఈసారి మన సారుకు బాగా వర్కవుట్ అయ్యింది. దెబ్బకు పెద్దసీట్లో పడ్డారు.. ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుందనమాట.
సారు సినిమా రెండో భాగం ఇంకా సూపరు తెలుసా? అప్పుడే క్యారెక్టర్.. కాస్ట్యూములు మారిపోతాయి. అదెలా అదెలా అంటారేంటి సార్.. నటులకు ఆమాత్రం క్రియేటివ్ లిబర్టీ ఇవ్వరా ఏంటి? సరే మొన్నటి దాకా చెగువేరా అన్నారు. ఎర్రెర్రని జెండా ఎన్నీయల్లో అని స్టెప్పులేశారు.. గొంతుకు ఎర్ర తువాలు చుట్టుకున్నారు. మాటలో ఎరుపు అరువు తెచ్చుకున్నారు. ఇక ఎన్నికల్లో గట్టెక్కి సీట్లో సెటిలయ్యాక.. అడ్రస్ మారిస్తే ఎలా ఉంటుంది అని తెగ ఆలోచించారు. అదేమంటారు.. మేధోమథనం.. అదే అలా మదనపడీ పడీ.. సివరాఖరికి హిందూధర్మ పరిరక్షణోద్యమం అంటూ కాషాయం చుట్టేసుకుని నుదుటిపై పేద్ద బొట్టు పెట్టేసుకుని బొబ్బలు పెట్టడం మొదలెట్టారు. మొదట్లో కొందరు కంగారు పడిన మాట నిజవే. కానీ వెంటనే సర్దుకుని ఓహో క్యారెక్టర్ ఛేంజా అని సరిపెట్టుకున్నారు. ఎంతైనా వారి వెండితెర ప్రయాణంలో మమేకమైన అబిమానులం కదా ఆమాత్రం అడ్జస్టు చేసుకోలేమా ఏంటి? అని వ్యాఖ్యానించారు కూడా.
అయినా సారు ఏ వేషం కట్టినా సరే.. ఆవేశం అస్సలు మిస్ చేయరు అదే బాగా నచ్చే విషయం. అపుడు చెగువేరా అని గర్జించారా.. ఇపుడు నా ధర్మం.. నా హిందుత్వ అంటూ గుండెలవిసేలా దిక్కులు పిక్కుటిల్లేలా ఘోషిస్తున్నారు. ఏదైనా అరుపే కదా మనకు కావల్సింది ఆ సౌండింగే కదా అందుకే పోనీలే పవరేశ్వరా ఈసారి ఇలా కానిచ్చేయ్ అంటూ అభిమానులు పచ్చజెండా బరబరా ఊపేసరికి సారువారు పొంగిపోయారు. అప్పట్నుంచి ఇదే బాపతు. అయినా దేశపెద్ద అండదండ తనకుందని.. ఇరు పెద్దల్ని కలిపిన పిల్లకాల్వలా తనకు ఎప్పటికైనా గుర్తింపు ఉండనే ఉంటుందని వారి గొప్ప నమ్మకం. అందుకే తాజాగా వారు తమదైన శైలిలో ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించారు. ఎందుకంటే అవసరం లేని చోట ప్రశ్నించడం వారి పురాప్రాప్త హక్కు కదా.
అధికారంలోకి మళ్ళీ మేమొస్తే అని అన్నారో సహించం కాక సహించం అని గుడ్లురిమారు. బెదిరించే వారికి ఈ సారు అస్సలు భయపడడు.. రాజకీయంగా అనుకుంటే జస్ట్ 48 గంటల్లో అంతా క్లియర్ చేసేస్తాం అని హూంకరించారు. ఇక్కడ అర్థం కానిదేంటంటే...సారుకు కోపం ఎందుకొచ్చింది? ఎదుటి పార్టీవారేదో తమను బెదిరిస్తున్నారని.. సరే మరి మీరు బదులిచ్చిన ధోరణి ఎలా ఉంది? అది కూడా ఫక్తు బెదిరింపు ధోరణే కదా. ఈ మాత్రం దానికి మరీ అంతలేసి బిల్డప్పులు అవసురమా సార్. అసలు ఈపాటికే మీరు మీ పెద్దసారు చేయాల్సిందంతా చేస్తున్నారుగా.. ఇంకా తీగ లాగుడు ఎందుకు?
పోనీ అలా అంటే వారేమైనా బెదురుతారా అంటే అదీ జరగదని మీక్కూడా తెలుసు. మరెందుకు పవరేశ్వర్ సార్ ఈ అనవసర రౌద్రు బీభత్స భయానక సమ్మిళిత డైలాగులు. దీనికన్నా కాస్త పాలన బెటర్‌గా చేయండి పదుగురు హ్యాపీగా ఫీలవుతారు. అంతేగానీ...రాక రాక వచ్చిందోచ్ నాకూ పవరూ అంటే ..అదేదో మీరన్నారే క్లియర్ చేస్తామని.. అంత రిస్క్ మీకెందుకు సార్.. మన ప్రజలున్నారుగా.. అయిదేళ్లు ఓపిక పట్టండి వారే క్లియర్ సేల్స్ బోర్డు పెట్టేస్తారు.
-ఆర్‌ఎం


