టీడీపీ చేతిలో ఖా‘కీలు బొమ్మలు’ | TDP Leaders And Two Police Officers Accused Of Collusion In Ambati Rambabu Assault And Conspiracy, More Details Inside | Sakshi
Sakshi News home page

టీడీపీ చేతిలో ఖా‘కీలు బొమ్మలు’

Feb 4 2026 5:37 AM | Updated on Feb 4 2026 2:23 PM

Those two policemen played a key role in the attack on Ambatis house

అంబటి ఇంటిపై దాడిలో ఆ ఇద్దరు పోలీసుల కీలకపాత్ర 

తన పరిధిలో దాడి జరిగినా చోద్యం చూసింది ఒకరు.. 

తెలుగుదేశం క్యాడర్‌ కర్రలతో దాడికి సిద్ధమైతే వారికి కాపలా కాసింది మరొకరు.. 

అంబటి వాహనంలో ఆయుధాలు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం 

స్టేషన్‌లో అంబటిని హింసించిందీ ఆ ఇద్దరు పోలీసు అధికారులే 

పక్క సబ్‌ డివిజన్‌లోని స్టేషన్‌లో ఆ సీఐకి ఏం పని? 

ఆ ఇద్దరిపై ఉన్నతాధికారుల శాఖాపరమైన చర్యలేవీ?  

సాక్షి టాస్క్ ఫోర్స్‌: వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేయడంతోపాటు ఆయనపై హత్యాయత్నం జరిగిన ఘటనలో ఇద్దరు పోలీస్‌ అధికారులు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ చేతిలో కీలుబొమ్మలై ఆ పార్టీ అధిష్టానం చెప్పినట్టు నడుచుకున్నట్టు తెలుస్తోంది. 

మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం గోరంట్ల గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు చేసి తిరిగి వస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు గోరంట్ల చిల్లీస్‌ సెంటర్‌లో కర్రలు, మారణాయుధాలతో కాపుగాశారు. అంబటి రాంబాబు వాహనాన్ని అడ్డుకుని కారు మీద చేతులతో కొడుతూ అసభ్య పదజాలంతో దూషించారు. 

రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ వందనాదేవి అయితే ‘‘నువ్వు మొగోడివి అయితే రారా’’అంటూ అంబటిని రెచ్చగొట్టారు. మారణాయుధాలతో తెలుగుదేశం నేతలు పెద్ద సంఖ్యలో గుమిగూడినా వారిని నియంత్రించడంలో నల్లపాడు సీఐ వంశీధర్‌ విఫలమయ్యారు.పైగా టీడీపీ నేతలకు కొమ్ముగాశారు. వైఎస్సార్‌సీపీ నేతల నుంచి ప్రతిస్పందన రాకుండా తెలుగుదేశం మూకలకు రక్షణగా నిలబడ్డారు. పైగా అంబటి వాహనంలో మారణాయుధాలు ఉన్నా­యంటూ దుష్ప్రచారం చేశారు.  

వ్యూహాత్మకంగా దాడి.. 
అంబటిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ కూడా అతిగా స్పందించారు. రాంబాబుకు 24 గంటల్లో తామేంటో సినిమా చూపిస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే శనివారం మధ్యాహ్నం 3.45 గంటలకు నల్లపాడు సీఐ వంశీధర్‌ సిద్ధార్ధనగర్‌లోని అంబటి ఇంటికి వెళ్లి నోటీసు ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు. అయితే నోటీసు ఇవ్వకుండానే ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్లిపోయారు. వెళ్లేటప్పుడు అంబటి ఇంటి వద్ద ఎంతమంది ఉన్నారో గమనించి వెళ్లి టీడీపీ నేతలకు ఉప్పందించారని సమాచారం.

ఈ నేపథ్యంలో అంబటిని అరెస్ట్‌ చేస్తున్నారన్న సమాచారంతో మీడియా అక్కడికి చేరుకుంది. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులూ తరలివచ్చాయి. సాయంత్రం 4 గంటలకు తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త లంకా మాధవి అంబటి ఇంటి వద్దకు వచ్చి అంబటిని ‘‘నా కొడకా రా..రా.. చెప్పుతో కొడతా’’అంటూ దుర్భాషలాడింది. దీనికి వైఎస్సార్‌సీపీ మహిళా నాయకులు ప్రతిస్పందించారు. టీడీపీ కార్యకర్తను అడ్డుకునేందుకు యత్నించారు. 

దీంతో పోలీసులు లంకా మాధవిని అక్కడి నుంచి తప్పించారు. అప్పటికే వ్యూహాత్మకంగా పశ్చిమఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు, అబ్బూరి మల్లి, ఇతర కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అంబటి ఇంటికి చేరుకుని ఒక్కసారిగా మారణాయుధాలు, కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసి విధ్వంసం సృష్టించారు. 

అప్పటికే పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు నేతృత్వంలో వందమందికిపైగా పోలీసులు అక్కడ మోహరించినా.. వారిని అడ్డుకునే యత్నం చేయకుండా చోద్యం చూశారు. గోనుగుంట్ల కోటేశ్వరరావు అనే టీడీపీ దివ్యాంగుల విభాగం నేత మైక్‌ సెట్‌తో వచ్చి ‘‘బయటకు రారా నా కొడకా’’అంటూ అంబటిపై బూతుపురాణం లంకించుకున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ గూండాలకు అండగా నిలబడ్డారు.  

ఈ ఇద్దరూ అధికారపార్టీ తొత్తులే! 
సీఐలు గంగా వెంకటేశ్వర్లు, వంశీధర్‌ ఇద్దరూ అధికారపార్టీ తొత్తులేనని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు గతంలో పలుమార్లు వైఎస్సార్‌సీపీ ర్యాలీలు, సభలను అడ్డుకున్నారు. కొన్ని సందర్భాల్లో అంబటి రాంబాబుతో వాగ్వాదానికీ దిగారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు సీఐలు అధికార పార్టీ నేతల ఆదేశాల ప్రకారం అంబటిని ఇబ్బంది పెట్టాలనే వ్యూహరచన చేశారని వైఎస్సార్‌సీపీ వర్గాలు మండిపడుతున్నాయి. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. దీనిపై కోర్టును ఆశ్రయించడానికి సన్నద్ధమవుతున్నాయి.  

పక్క సబ్‌ డివిజన్‌ స్టేషన్‌లో ఆ సీఐకి ఏం పని?
ఉదయం టీడీపీ నేతలు అంబటిపై దాడికి యత్నించిన ప్రదేశం గోరంట్ల చిల్లీస్‌ సెంటర్‌ నల్లపాడు స్టేషన్‌ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో అన్యాయంగా అక్రమంగా అంబటిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను శనివారం రాత్రి 10.30 గంటలకు నల్లపాడు స్టేషన్‌కు తరలించి లాకప్‌లో పెట్టారు. నల్లపాడు గుంటూరు సౌత్‌ సబ్‌డివిజన్‌ పరిధిలోకి వస్తుంది. ఆ స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు అంబటిని కలవకుండా ఉండేలా ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

అయితే అర్ధరాత్రి లాకప్‌లో నిద్రపోతున్న అంబటిని నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పైఅంతస్తుకు పోలీసులు తీసుకువెళ్లారు. అక్కడ నల్లపాడు సీఐ వంశీధర్‌తోపాటు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లూ ఉన్నారని స్వయాన అంబటి రాంబాబు న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చారు. గంగా వెంకటేశ్వర్లు, వంశీధర్‌ ఇద్దరూ తనను గోడకు ఆనించి కూర్చోబెట్టి రెండు కాళ్లు చీల్చి ఇబ్బందికి గురి చేశారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని పట్టాభిపురం స్టేషన్‌ సీఐ గంగా వెంకటేశ్వర్లుకు సౌత్‌ సబ్‌డివిజన్‌లోని నల్లపాడు స్టేషన్‌లో ఏం పని అనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement