ఆరోగ్యశ్రీని ప్రైవేట్ బీమా కంపెనీ ద్వారా అమలుకు టెండర్ పిలిచిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ పథకం అమలులో కీలకంగా వ్యవహరిస్తూ పేద ప్రజలకు సేవలు అందించిన వేలాది ఉద్యోగుల గుండెల్లో చంద్రబాబు ప్రభుత్వం రైళ్లు పరిగెట్టిస్తోంది. ఒకటిన్నర దశాబ్దంగా ప్రభుత్వంలో పనిచేస్తూ ఏదో ఒక రోజు ఉద్యోగాలు శాశ్వతం అవుతాయని వారు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా విధానంలో అమలు చేయడానికి ప్రభుత్వం టెండర్ పిలిచింది. పథకం కింద సేవలు అందిస్తున్న ఆరోగ్య మిత్ర, టీం లీడర్‌లు, ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉద్యోగులందరినీ బీమా కంపెనీకి అప్పజెప్పేలా టెండర్ నిబంధనలు రూపొందించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల మంది ఆరోగ్య మిత్రలు, వంద మంది టీం లీడర్‌లు క్షేత్ర స్థాయిలో సేవలు అందిస్తున్నారు. వీరితో పాటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రాష్ట్ర, జిల్లా కార్యాలయాల్లోని ఉద్యోగులందరు కలిపి 2,500 మందికి పైగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరిలో మెజారిటీ శాతం 18 ఏళ్లుగా పనిచేస్తున్న వారే ఉన్నారు.
అందరిలో కలవరపాటు
2019–24 మధ్య ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసిన వైఎస్ జగన్ సర్కారు.. ఈ పథకం అమలులో కీలకమైన ఉద్యోగులకు ఆరి్థకంగా భరోసా ఇచి్చంది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో మిత్రలకు రూ.6 వేలు, టీం లీడర్‌లకు రూ.10,600 చొప్పున వేతనాలు ఉండేవి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2019 నవంబర్‌లో ఆరోగ్య మిత్రలకు రూ.12 వేలు, టీం లీడర్‌కు రూ.15 వేల వరకూ వేతనాలను పెంచారు. ప్రభుత్వ రంగంలో నిశ్చింతగా పని చేసుకుంటూ, ఏదో ఒక రోజు ఉద్యోగాలు శాశ్వతం అవుతాయని కోరుకుంటున్న ఉద్యోగుల గుండెల్లో 2024లో చంద్రబాబు బీమా బాంబు పేల్చారు.
ప్రీమియంలో వీలైనంత మిగుల్చుకోవాలనే లాభాపేక్షతో పనిచేసే బీమా కంపెనీల చేతుల్లో ప్రజారోగ్యాన్ని పెట్టడమే కాకుండా, 2500 మంది ఉద్యోగుల కుటుంబాలకు పొగ పెట్టడానికి సిద్ధం అయ్యారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, ఖర్చులను తగ్గించుకోవడం కోసం ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగులను ఎడాపెడా తొలగించేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో లాభాపేక్షే పరమావధిగా పనిచేసే ప్రైవేటు బీమా కంపెనీల్లో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనని చిరుద్యోగులు కలవరపాటుకు గురవుతున్నారు.


