గల్లా మాధవి దంపతులకు క్లీన్‌ చిట్‌! | Clean chit given to Galla Madhavi couple | Sakshi
Sakshi News home page

గల్లా మాధవి దంపతులకు క్లీన్‌ చిట్‌!

Feb 4 2026 5:27 AM | Updated on Feb 4 2026 5:27 AM

Clean chit given to Galla Madhavi couple

అంబటి రాంబాబు ఫిర్యాదు చేసినా వారిపై కేసు నమోదు చేయని పోలీసులు  

వారిద్దరి పేర్లు లేకుండానే కార్పొరేటర్‌ బుజ్జి, మరికొందరు.. అంటూ ఎఫ్‌ఐఆర్‌  

నేడు వైఎస్‌ జగన్‌ రానున్న నేపథ్యంలో హడావుడిగా క్లూస్‌ టీమ్‌ తనిఖీలు 

మాజీ మంత్రి కార్యాలయాన్ని తగలబెట్టిన ఆనవాళ్లే లేవన్న సీఐ  

మరోవైపు నెల్లూరు జిల్లాలో అంబటిపై రెండు అక్రమ కేసులు 

సాక్షి ప్రతినిధి, గుంటూరు/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, కాపునేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయంపై చేసిన దాడిపై పోలీసులు మొక్కుబడిగా కేసు నమోదు చేశారు. అంబటిరాంబాబు ఫిర్యాదు మేరకు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.

అయితే, దాడికి పాల్పడిన, పురిగొల్పిన టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావుతోపాటు ముఖ్యమైన టీడీపీ నాయకుల పేర్లను తప్పించారు. అంబటిఫిర్యాదులో దాడికి పాల్పడిన ముఖ్యమైన వారి పేర్లు స్పష్టంగా పేర్కొన్నారు. అయినా టీడీపీ కార్పొరేటర్‌ వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్‌ అలియాస్‌ ఇసుక బుజ్జి, మరికొందరు... అంటూ  మొక్కుబడిగా కేసు నమోదు చేసి వదిలేశారు.  

కేసు నమోదుకు తర్జనభర్జనలు... 
వైఎస్సార్‌సీపీ లీగల్‌ టీం ద్వారా అంబటి రాంబాబు సోమవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేస్తే తర్జనభర్జనల అనంతరం రాత్రి 11.45 గంటలకు గుంటూరు పట్టాభిపురం పోలీసులు  క్రైమ్‌ నంబర్‌ 43 /2026గా కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు టీడీపీ గూండాలతో వచ్చి తన ఇల్లు, కార్యాలయంపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేస్తే... పోలీసులు మాత్రం టీడీపీ నాయకుల వద్ద మరిన్ని మార్కులు కొట్టేసేందుకు కేసును నీరు గార్చే విధంగా సెక్షన్లు నమోదు చేశారు.  

ఎమ్మెల్యే మాధవి, భర్త రామచంద్రరావు పేర్లకు బదులు కార్పొరేటర్‌ వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్‌ అలియాస్‌ బుజ్జి మరి కొంతమంది.. అంటూ కేసు నమోదు చేయడంపై వైఎస్సార్‌సీపీ నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త రామచంద్రరావులను ఏ1, ఏ–2గా కేసు నమోదు చేసే వరకూ పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ నాయకులు చెబుతున్నారు.

కాగా, అంబటి ఫిర్యాదుపై నమోదు చేసిన సెక్షన్లతో తక్కువ శిక్షలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే మాధవి టీడీపీ కార్యాలయంలో మంగళవారం ప్రెస్‌మీట్‌ పెట్టి అంబటి ఇంటిపై దాడితో తమకు సంబంధం లేదని, క్షమాపణ మాత్రమే కోరామని చెప్పడం గమనార్హం.  

అంబటి ఇంటి వద్ద పోలీసుల హైడ్రామా..  
అంబటి రాంబాబు ఇంటి వద్ద మంగళవారం పోలీసులు హైడ్రామా నడిపారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న నేపథ్యంలో... మంగళవారం సాయంత్రం అంబటి ఇంటి వద్ద క్లూస్‌ టీమ్‌తో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ప్రత్యక్షమయ్యారు. టీడీపీ మూకలు విధ్వంసం సృష్టించిన మూడు రోజుల తర్వాత వచ్చి అంబటి ఇంటి వద్ద పగిలిన కుండీలు, విరిగిపోయిన ఫర్నిచర్, ధ్వంసమైన కార్లను స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. 

దీనికి అంబటి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో తూతూ మంత్రంగా క్లూస్‌ టీమ్‌తో పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నేరస్థల పరిశీలనలో కార్లు, ఫర్నిచర్, అద్దంతో కూడిన కిటికీలు ధ్వంసమైనట్లు గుర్తించామని చెప్పారు. అంబటి కార్యాలయాన్ని తగలబెట్టిన ఆనవాళ్లు కనిపించలేదన్నారు. ఇదిలా ఉండగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మనుబోలు, దుత్తలూరులో టీడీపీ నేతల ఫిర్యాదుల మేరకు పోలీసులు మంగళవారం మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసులు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement