బెంగళూరు: బెంగళూరు నగరంలో రూ. 449 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఒక డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కాస్తా రన్నింగ్ ట్రాక్‌గా మారిపోయింది. నగరంలోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్, ఎలక్ట్రానిక్స్ సిటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రూ. 449 కోట్ల భారీ వ్యయంతో ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. దాదాపు ఐదు కి.మీ పొడవున్న ఈ ఫ్లైఓవర్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌గా పేరొందింది.
ఈ ఫ్లైఓవర్ మొదటి దశ (రాగిగుడ్డ నుండి హెచ్‌ఆర్‌ఎస్ లేఅవుట్‌కు) పనులు 2024 జూలై నాటికి పూర్తయ్యాయి. దీంతో సిల్క్ బోర్డ్ జంక్షన్ వద్ద రద్దీ కొంత మేరకు తగ్గింది. అయితే రెండవ దశ (హెచ్‌ఎస్‌ఆర్ నుండి రాగిగుడ్డ వైపు) నిర్మాణం పూర్తైనట్లు కనిపిస్తున్నా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.ఈ జాప్యానికి భారీ ట్రాఫిక్ రద్దీ, పని గంటలపై విధించిన ఆంక్షలే కారణమని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్)అధికారులు చెబుతున్నారు. కాగా ప్రారంభానికి నోచుకోని ఈ ఫ్లైఓవర్‌ను స్థానికులు తమ మార్నింగ్ జాగింగ్, వాకింగ్‌లకు ట్రాక్‌గా ఉపయోగిస్తున్నారు.
స్థానికుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ ‘ఈ ఫ్లైఓవర్ ప్రారంభానికి దాదాపు సిద్ధమైంది. అయితే యాక్సెస్ ర్యాంప్ ఇంకా సిద్ధం కాలేదు. అందుకే మేము కట్టే రోడ్డు టాక్స్‌ను సద్వినియోగం చేసుకునేందుకు దీనిపై రన్నింగ్ చేస్తున్నామన్నారు. అధికారికంగా వాహన రాకపోకలకు తెరుచుకోని ఈ ఫ్లైఓవర్ నగరంలో తాత్కాలిక వాహన రహిత రన్నింగ్ ట్రాక్‌గా మారిపోయింది. కాగా బీఎంఆర్‌సీఎల్ అధికారులు మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలోని మిగిలిన 10శాతం పనులు త్వరలోనే పూర్తిచేసి, 2026 జనవరి చివరి నాటికి అందుబాటులోకి తెస్తామంటున్నారు.
ఇది కూడా చదవండి: కొద్ది రోజుల్లో ప్రళయం.. ఘనా ప్రవక్త జోస్యం!


