ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల పార్లమెంట్‌లో టోకనైజేషన్ బిల్లు గురించి చేసిన ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సామాన్యులకు కూడా భారీ పెట్టుబడుల ఫలాలను అందించేలా ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో అసలు టోకనైజేషన్ అంటే ఏమిటి, దాని వల్ల కలిగే ప్రయోజనాలేమిటో చూద్దాం.
టోకనైజేషన్ అంటే ఏమిటి?
సాధారణ భాషలో చెప్పాలంటే.. ఒక భారీ ఆస్తిని (ఉదాహరణకు ఒక పెద్ద కమర్షియల్ బిల్డింగ్ లేదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్) చిన్న చిన్న డిజిటల్ భాగాలుగా విభజించడాన్నే టోకనైజేషన్ అంటారు. ఈ ఒక్కో భాగాన్ని టోకెన్ అని పిలుస్తారు.
ఉదాహరణకు ఒక హైవే ప్రాజెక్ట్ విలువ వందల కోట్లు అనుకుందాం. అందులో సామాన్యులు పెట్టుబడి పెట్టలేరు. కానీ, దాన్ని కోటి టోకెన్లుగా విభజిస్తే.. ఒక్కో టోకెన్ ధర కేవలం వంద రూపాయల్లోనే ఉండవచ్చు. ఇలా సామాన్యులు సైతం ఆ ప్రాజెక్టులో భాగస్వాములు కావచ్చు.
ఈ బిల్లును ఎందుకు ప్రతిపాదించారు?
ప్రస్తుతం రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కేవలం బిలియనీర్లు లేదా పెద్ద సంస్థలకు మాత్రమే పరిమితమయ్యాయి. మధ్యతరగతి ప్రజలు కేవలం బ్యాంక్ ఎఫ్‌డీలు లేదా మ్యూచువల్ ఫండ్స్‌కే పరిమితం అవుతున్నారు. ఈ బిల్లు వస్తే సామాన్యులు కూడా భారీ ఆస్తుల్లో వాటాలను కొనుగోలు చేసి అధిక లాభాలను పొందవచ్చని ఎంపీ చెప్పారు.
విదేశీ మూలధనం
సింగపూర్, యూఏఈ, అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే ఇటువంటి చట్టాలు ఉన్నాయి. భారత్‌లో కూడా స్పష్టమైన చట్టపరమైన నిబంధనలు ఉంటే అంతర్జాతీయ పెట్టుబడులు భారత్‌కు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
మధ్యతరగతికి మేలు
మధ్యతరగతి ప్రజలు తమ పొదుపు మొత్తాన్ని కేవలం తక్కువ వడ్డీ వచ్చే బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల్లో ఉంచుతున్నారు. టోకనైజేషన్ ద్వారా వారికి రియల్ ఎస్టేట్, గోల్డ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో చిన్న మొత్తాలతోనే పెట్టుబడి పెట్టే అవకాశం దక్కుతుంది.
ప్రయోజనాలు
సాధారణంగా ఒక ఇల్లు లేదా భూమి అమ్మాలంటే చాలా సమయం పడుతుంది. కానీ డిజిటల్ టోకెన్లను షేర్ మార్కెట్ తరహాలోనే సులభంగా, త్వరగా విక్రయించుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రిజిస్ట్రేషన్ గొడవలు లేకుండా నేరుగా బ్లాక్‌చెయిన్ ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. దీనివల్ల ప్రతి లావాదేవీ పక్కాగా రికార్డ్ అవుతుంది. మోసాలకు తావుండదు. ఒకేసారి లక్షల రూపాయలు పెట్టక్కర్లేదు. కేవలం రూ.500 లేదా రూ.1000తో కూడా ఆస్తిలో భాగస్వామ్యం పొందవచ్చు. లాభాలను పంచుకోవచ్చు.
ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన మాత్రమే. ప్రభుత్వం దీనిపై ఇంకా అధికారికంగా ఎటువంటి ముసాయిదాను విడుదల చేయలేదు. అయితే ఇప్పటికే భారత రిజర్వ్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల భద్రత కోసం ‘కార్డ్ టోకనైజేషన్’ విధానాన్ని అమలు చేస్తోంది. దానికంటే విస్తృతమైన అసెట్ టోకనైజేషన్(ఆస్తుల టోకనైజేషన్) కోసం ప్రత్యేక చట్టం కావాలని ఎంపీ కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ క్యూఆర్ కోడ్ బోర్డులు


