ఒకప్పుడు కంప్యూటర్ అంటేనే వింతగా చూసిన పల్లె ప్రజలు ఇప్పుడు తమ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. టెక్నాలజీ పుణ్యామా అని ఇప్పుడు చాలా మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చింది. చాట్‌జీపీటీ, జెమిని.. వంటివి కేవలం నగరాలకో, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకో పరిమితం కాలేదు. పంటకు పట్టిన తెగులును ఫోటో తీసి పరిష్కారం అడిగే రైతు నుంచి, ప్రభుత్వ పథకాల వివరాలను మాతృభాషలో అడిగి తెలుసుకునే సామాన్యుడి వరకు.. ఏఐ నేడు ఒక డిజిటల్ సహాయకుడిలా మారుతోంది. ఇంగ్లీష్ రాకపోయినా, టెక్నాలజీపై అవగాహన లేకపోయినా.. కేవలం మాటతోనే పనులు పూర్తి చేసుకునేలా ఏఐ అందుబాటులోకి వస్తోంది.
సామాన్యుల కోసం టెక్ కంపెనీల వ్యూహాలు
చదవడం, రాయడం రాని వారు కూడా తమ మాతృభాషలో మాట్లాడి సమాచారాన్ని పొందేలా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వాయిస్ అసిస్టెంట్లను అభివృద్ధి చేశాయి. మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన భాషిణి వంటి ప్రభుత్వ ఏఐ ప్రాజెక్టులు, గూగుల్ ‘1,000 ల్యాంగ్వేజీ ఏఐ మోడల్’ ద్వారా స్థానిక మాండలికాల్లో ఏఐ సర్వీసులు అందిస్తున్నారు. కొత్త యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం కష్టంగా భావించే వారి కోసం నేరుగా వాట్సాప్ చాట్‌బాట్ల ద్వారా ఏఐ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు.
గ్రామ స్థాయిలో ఏఐ ఎలా ఉపయోగపడుతుంది?
వ్యవసాయానికి సంబంధించి నేల స్వభావం, వాతావరణ మార్పులను బట్టి ఏ పంట వేయాలి? ఎప్పుడు నీరు పెట్టాలి? పురుగుల మందు ఎప్పుడు చల్లాలి? వంటి అంశాలను ఏఐ ముందే సూచిస్తుంది. ఉదాహరణకు, పంట ఆకు ఫోటో తీసి ఏఐ యాప్‌లో పెడితే దానికి ఉన్న సమస్యలు ఏమిటో, ఏ మందు వాడాలో వెంటనే చెబుతుంది.
గ్రామాల్లో డాక్టర్ల కొరత ఉంటుంది. ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ టూల్స్ ద్వారా ప్రాథమిక పరీక్షలు నిర్వహించి తీవ్రతను బట్టి నగరంలోని డాక్టర్లకు సమాచారాన్ని పంపవచ్చు.
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి తమ సొంత భాషలో అడిగి తెలుసుకోవడానికి ఏఐ చాట్‌బాట్లు సహాయపడుతున్నాయి.
ఏఐని సులువుగా ఎలా వాడవచ్చు?
స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా ఏఐను అడగాలంటే టైప్ చేయడం కష్టమైతే కీబోర్డ్ పైన లేదా సెర్చ్ బార్‌లో ఉండే మైక్ బటన్ నొక్కి మీకు కావాల్సిన విషయాన్ని అడగాలి.
గూగుల్ లెన్స్ వంటి ఏఐ టూల్స్ వాడి ఏదైనా తెలియని వస్తువును లేదా మొక్కను ఫోటో తీసి దాని వివరాలు తెలుసుకోవచ్చు.
మీకు రాని భాషలో ఏదైనా ఉత్తరం లేదా బోర్డు ఉంటే, ఏఐ కెమెరా ద్వారా దాన్ని వెంటనే కావాల్సిన భాషలోకి మార్చుకోవచ్చు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం చదువుకున్న వారి కోసం మాత్రమే కాదు, దీన్ని అందరి కోసం తయారు చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు. డిజిటల్ అక్షరాస్యత పెంచడంతో పాటు భాషా పరమైన అడ్డంకులను తొలగిస్తే ఏఐ ఒక సామాన్యుడి డిజిటల్ సహాయకుడిగా మారుతుంది.
ఇదీ చదవండి: వ్యర్థాలుగా కాదు.. వెలుగుల దిశగా అడుగులు


