మ్యూచువల్ ఫండ్ రూల్స్‌లో భారీ మార్పులు
ఇన్వెస్టర్లకు సెబీ గుడ్ న్యూస్
బ్రోకరేజీ చార్జీలపై పరిమితులు
ముంబై: మార్కెట్లో పెట్టుబడులపై వ్యయాల భారం తగ్గి, లాభాలు పెరిగేలా ఇన్వెస్టర్లకు మరింత ప్రయోజనం చేకూర్చే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పలు సంస్కరణలకు తెరతీసింది. బోర్డు సమావేశంలో నిబంధనల్లో పారదర్శకతను పెంచేందుకు వ్యయ నిష్పత్తి ఫ్రేమ్‌వర్క్, బ్రోకరేజీ చార్జీల పరిమితుల్లో మార్పులతో పాటు అనేక చర్యలు తీసుకుంది. కొత్త నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
వీటి ప్రకారం వ్యయ నిష్పత్తి పరిమితుల నుంచి ఎస్‌టీటీ, జీఎస్‌టీ, సీటీటీ, స్టాంప్ డ్యూటీలాంటి లెవీలను తొలగించినట్లు సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే తెలిపారు. ఇకపై వ్యయ నిష్పత్తి పరిమితులను బేస్ ఎక్స్‌పెన్స్ రేషియోగా పరిగణిస్తారని పేర్కొన్నారు. వివిధ స్కీములపై అదనంగా 5 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వ్యయాలను విధించేందుకు అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలకి ఇస్తున్న వెసులుబాటును తొలగించారు. 2018లో ప్రవేశపెట్టిన 0.05 శాతం ఎగ్జిట్ లోడ్ నిబంధనను సెబీ తొలగించింది. 1963లో ప్రారంభమైన మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ప్రస్తుతం రూ. 80 లక్షల కోట్ల పైగా ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి.
మరిన్ని నిర్ణయాలు...
→ బ్రోకరేజీ చార్జీలు క్యాష్ మార్కెట్ లావాదేవీలపై 12 బీపీఎస్ నుంచి 6 బీపీఎస్‌కి, డెరివేటివ్ లావాదేవీలపై 5 బీపీఎస్ నుంచి 2 బీపీఎస్‌కి తగ్గింపు.
→ స్కీము పనితీరు ఆధారంగా వ్యయ నిష్పత్తి అమలు. ఏఎంసీలు దీన్ని స్వచ్ఛందంగా అమలు చేయొచ్చు.
→ ట్రస్టీలు సమావేశం కావాల్సిన ఫ్రీక్వెన్సీ తగ్గింపు. స్కీముల్లో మార్పులను తెలియజేసేలా పత్రికా ప్రకటనలు ఇవ్వాలన్న నిబంధన తొలగింపు. ప్రకటనల స్థానంలో ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపరిస్తే సరిపోతుంది.
→ రియల్ ఎస్టే ట్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్‌ఫ్రా డెట్ ఫండ్ స్కీముల్లో పునరావృతమయ్యే చాప్టర్ల తొలగింపు. దీనితో నిబంధనల పరిమాణం 162 పేజీల నుంచి 88 పేజీలకు తగ్గింది. పదాల సంఖ్య కూడా 67,000 నుంచి 54 శాతం తగ్గి 31,000 పదాలకు పరిమితమవుతుంది.
→ డెట్ మార్కెట్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెంపొందించే దిశగా సీనియర్ సిటిజన్లు, మహిళలు, రిటైల్ ఇన్వెస్టర్స్‌లాంటి వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు డెట్ ఇష్యూయర్లను అనుమతించే ప్రతిపాదనకు ఆమోదముద్ర.
→ రిటైల్ ఇన్వెస్టర్ల సౌలభ్యం కోసం కంపెనీలు.. డీఆర్‌హెచ్ పీ దశలో కీలక వివరాలతో కూడుకున్న సంక్షిప్త ప్రాస్పెక్టస్‌ను కూడా అందుబాటులో ఉంచాలి.
→ ఇతరత్రా ఆర్థిక రంగ నియంత్రణ సంస్థల పరిధిలోని ఆర్థిక సాధనాలకు కూడా రేటింగ్స్ సేవలను అందించేందుకు వెసులుబాటు కలి్పంచేలా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నిబంధనల్లో మార్పులు.
→ సెబీ (స్టాక్ బ్రోకర్స్) రెగ్యులేషన్స్ 1992 స్థానంలో కొత్తగా సెబీ (స్టాక్ బ్రోకర్స్) రెగ్యులేషన్స్ 2025 (ఎస్‌బీ రెగ్యులేషన్స్) అమల్లోకి వస్తుంది. కొత్త ఫ్రేమ్‌వర్క్‌లో పదకొండు చాప్టర్లు ఉంటాయి. పాతబడిన కొన్ని షెడ్యూల్స్‌ను, పనరావృతమయ్యే నిబంధనలను సెబీ తొలగించింది. కొన్నింటిని సమగ్రపర్చింది. మరింత స్పష్టతను ఇచ్చే విధంగా క్లియరింగ్ మెంబర్, ప్రొప్రైటరీ ట్రేడింగ్ మెంబర్‌లాంటి కీలక నిర్వచనాలను సవరించింది. సులభతరంగా అర్థం చేసుకునేలా నిబంధనలకు సంబంధించిన పేజీల సంఖ్యను 59 నుంచి 29కి, పదాల సంఖ్యను 18,846 నుంచి 9,073కి తగ్గించినట్లు సెబీ తెలిపింది.


