breaking news
Burden of charges
-
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేస్తే పెనుభారమే!
భారత్ తన చమురు అవసరాల కోసం ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశంలో ఉపయోగిస్తున్న చమురులో ఏకంగా 80 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. ఇందులో ప్రధాన వాటా రష్యాదే. రష్యా నుంచి చౌకగా ముడిచమురు లభిస్తోంది. ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నెర్ర చేయడానికి, 50 శాతం సుంకాలు విధించడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడమే కారణం. ఒకవేళ రష్యా నుంచి ముడిచమురు కొనడం ఆపేస్తే భారత్‌పై మోయలేని భారం పడడం ఖాయం. అది దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రతికూలంగా మార్చేయగలదు. రష్యా చమురును వద్దనుకుంటే ఇండియా ఆయిల్ దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతుందని ఎస్బీఐ ఒక నివేదికలో తేల్చిచెప్పింది. 2026లో 9 బిలియన్ డాలర్లకు, 2027లో 12 బిలియన్ డాలర్లకు చేరుతుందని వెల్లడించింది. చమురు కోసం పూర్తిగా అరబ్ దేశాలపైనే ఆధారపడితే విపరీతంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. అంతిమంగా ఆ భారం మోయాల్సింది ప్రజలేనన్న సంగతి తెలిసిందే. 1.7 శాతం నుంచి 35.1 శాతానికి.. భారత్ 2022 నుంచి రష్యా నుంచి ముడిచమురును చౌక ధరకే కొంటోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా చమురు ధరపై పరిమితిని నిర్దేశించాయి. దాంతో రష్యా తన చమురును ఇండియాకు విక్రయిస్తోంది. దీనివల్ల ఇండియాకు ఎనలేని మేలు జరుగుతోంది. చమురు బిల్లుల భారం చాలావరకు తగ్గిపోయింది. మన దేశానికి చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో తొలి స్థానం రష్యాదే. 2020లో ఇండియా చమురు అవసరాల్లో రష్యా వాటా కేవలం 1.7 శాతం ఉండేది. ప్రస్తుతం అది ఏకంగా 35.1 శాతానికి చేరడం గమనార్హం. 2025లో 245 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు దిగుమతి చేసుకోగా, ఇందులో రష్యా వాటా 88 మిలియన్ మెట్రిక్ టన్నులు. ధరలు 10 శాతం పెరిగే అవకాశం అమెరికా ఒత్తిడికి తలొగ్గి రష్యా ఆయిల్‌ను ఇండియాతోపాటు ఇతర దేశాలు కొనడం ఆపేస్తే ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రపంచమంతటా ఉపయోగిస్తున్న ఆయిల్లో 10 శాతం రష్యా నుంచే వస్తోంది. ఈ ఆయిల్ సరఫరాను హఠాత్తుగా నిలిపివేస్తే.. కొరత వల్ల చమురుకు డిమాండ్ పెరిగి ధరలు కనీసం 10 శాతం పెరుగుతాయి. ఇండియాతోపాటు అన్ని దేశాలపైనా భారం పడుతుంది. ఇండియాకు ఉన్న సానుకూలత ఏమిటంటే.. రష్యా నుంచే కాకుండా మరో 40 దేశాల నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి సరఫరా ఆగిపోయినా ఇప్పటికిప్పుడు ఇబ్బంది ఉండకపోవచ్చు. ధరల భారం మాత్రం తప్పదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా వీసా మరింత భారం
వాషింగ్టన్: వచ్చే ఏడాది నుంచి అమెరికా వీసా పొందాలని భావించే భారతీయులకు మరింత ఆర్థికభారం నెత్తిన పడనుంది. 250 డాలర్లు అంటూ దాదాపు రూ.21,000లను సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థి(ఎఫ్/ఎం) వీసాలతోపాటు పర్యాటక(బీ–1), ఉద్యోగ(హెచ్–1బీ), బిజినెస్(బీ–2), ఎక్సే్ఛంజ్(జే) వీసాల కోసం దరఖాస్తుచేసుకునే విదేశీయులు తప్పనిసరిగా ఈ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిందేనని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ ది వన్ బిగ్ బ్యూటిఫుల్’ చట్టం నిబంధనల్లో ఈ మేరకు మార్పులు చేశారు. ఈ ఫీజును వీసా మంజూరు చేసేటప్పుడు హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం వసూలుచేస్తుంది. వీసా పొందాక ఆయా వీసాదారులు సంబంధిత కఠిన నిబంధనావళిని ఖచ్చితంగా పాటించినట్లు ప్రభుత్వం భావిస్తే ఈ ఫీజును తిరిగి ఇచ్చేస్తారు. 2026 ఏడాదికి మాత్రమే ఫీజును 250గా నిర్ణయించారు. ఆ తర్వాతి ఏడాది ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ)లకు అనుగుణంగా ఫీజును పెంచుతారు. అన్ని కేటగిరీ వీసా దరఖాస్తుదారుల నుంచి వసూలుచేస్తున్నందున దీనిని ‘వీసా ఇంటిగ్రిటీ ఫీజు’గా పేర్కొంటున్నారు. ఏ, జీ రకం దౌత్య వీసా కేటగిరీలకు మాత్రం ఈ అదనపు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిన పనిలేదు. ఇతర ఫీజులూ వడ్డింపు ఐ–94 దరఖాస్తుకు 24 డాలర్లు, 90 రోజుల్లోపు అమెరికాలో ఉండే పర్యాటకులు, వ్యాపారులకు ఇచ్చే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్(ఈఎస్టీఏ)కు 13 డాలర్లు వసూలుచేయనున్నారు. ఇక చైనీయులకు ఇచ్చే పర్యాటక, బిజినెస్ వీసాలపై మరో 30 డాలర్ల ఫీజు వసూలుచేస్తారు. శరణార్థులుగా వచ్చే వాళ్లు దరఖాస్తుతోపాటు 1,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. శరణార్థులుగా వచ్చి అమెరికాలో తాత్కాలిక చిన్న ఉద్యోగాలు చేసుకోవాలనుకునే వాళ్లు అదనంగా 500 డాలర్లు చెల్లించాలి. చట్టప్రకారం శాశ్వత స్థిర నివాస హోదా దరఖాస్తుతోపాటు మరో 1,500 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. తమ వీసా పొందాలనుకునే విదేశీ పౌరులు అమెరికా ఇమిగ్రేషన్ చట్టనిబంధనలను పాటించాల్సిందేనని వన్ బిగ్ బ్యూటిఫుల్ చట్టంలో ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రస్తుతమున్న అమెరికా వీసా ఫీజుల విధానం ప్రకారం ఒక భారతీయుడు పర్యాటక(బీ–1) లేదా బిజినెస్(బీ–2) వీసా పొందాలంటే ఖచ్చితంగా 185 డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. ఇకపై కొత్త నిబంధనల ప్రకారం ఈ 185 డాలర్లతోపాటు సెక్యూరిటీ ఫీజు(250 డాలర్లు), ఐ–94ఫీజు(24 డాలర్లు), ఈఎస్టీఏ ఫీజు(13 డాలర్లు) కలిపి మొత్తంగా 472 డాలర్లు(దాదాపు రూ.41వేలు) చెల్లించాల్సి ఉంటుంది. అంటే వాస్తవ ఫీజు కంటే ఇది రెండున్నర రెట్లు ఎక్కువ అని అమెరికాలోని ప్రైవేట్ ఇమిగ్రేషన్ సేవల సంస్థ ఫ్రాగోమెన్ పేర్కొంది. అఫ్గానిస్తాన్, సిరియా వంటి పేద దేశాల నుంచి వలసలను అడ్డుకునే దురుద్దేశంతో ట్రంప్ ప్రభుత్వం ఇలా శరణార్థులు సైతం ఏకంగా 1,000 డాలర్ల సెక్యూరిటీ డిపాజిట్ ఫీజును చెల్లించాలనే కఠిన నిబంధనను చేర్చిందని అమెరికాలోని వలసదారుల హక్కుల సంస్థ ‘నేషనల్ ఇమిగ్రేషన్ ఫోరమ్’ ఆగ్రహం వ్యక్తంచేసింది. అక్రమ వలసదారులను తగ్గిస్తున్నామంటూ ఆ వంకతో ప్రభుత్వం అన్ని రకాల కేటగిరీ వీసా దరఖాస్తుదారుల నుంచి అదనపు ఫీజులు వసూలుచేస్తోందని నేషనల్ ఇమిగ్రేషన్ ఫోరమ్ ఆరోపించింది. -
అంతర్జాతీయ ప్రయాణం .. మరింత భారం
పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం దాయాదీ దేశం పాకిస్తాన్‌పై భారత్ కఠిన ఆంక్షలు విధించింది. పాకిస్తాన్ సైతం అదే రీతిలో స్పందిస్తూ తమ గగనతలాన్ని భారతదేశ విమానాలు ఉపయోగించుకోకుండా నిషేధించింది. ఇండియా విమానాలు తమ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలపై అదనంగా ఆర్థిక భారం పడుతోందని, అతిమంగా ప్రయాణికులే భరించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఉత్తర భారతదేశం నుంచి పాక్ గగనతలం గుండా ప శ్చిమ దేశాలకు ప్రయాణించాల్సిన విమానాలు ఇక చుట్టూ తిరిగి వెళ్లక తప్పదు. దీనివల్ల విమాన చార్జీలు 8 నుంచి 12 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరప్, ఉత్తర అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లేవారు అదనపు భారం భరించాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ రూట్లలో విమాన ప్రయాణాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఇండియాలో రిజిస్టర్ అయిన అన్ని విమానాలతోపాటు భారతీయుల యాజమాన్యంలో ఉన్న విమానాలు పాక్ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి లేదు. ఇక సుదూర ప్రయాణాలే పాక్ ఆంక్షల ప్రభావం ఇప్పటికే మొదలైందని ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు నిర్ధారించాయి. తమ అంతర్జాతీయ విమానాలను మరో మార్గం గుండా మళ్లించామని తెలిపాయి. తమ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాక్ ఆంక్షల విషయంలో తాము చేయగలిగేది ఏమీ లేదని నిస్సహాయత వ్యక్తంచేశాయి. ఇండియా నుంచి యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల రెండు నుంచి రెండున్నర గంటల అదనపు సమయం పడుతోందని ఓ పైలట్ చెప్పారు. ఢిల్లీ, అమృత్సర్, జైపూర్, లక్నో, వారణాసి తదితర నగరాల నుంచి ప్రయాణించేవారు అదనపు సమయం వెచి్చంచడంతోపాటు అదనపు వ్యయం భరించాల్సి వస్తోంది. ఇండియా విమానాలకు పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ అత్యంత కీలకం. చాలావరకు విమానాలు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి. ఇన్నాళ్లూ ఎటువంటి ఇబ్బందుల లేకుండా ప్రయాణాలు సాగిపోయాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఏ విమానానికి ఎంత సమయం అదనంగా అవసరమన్న దానిపై త్వరలో పూర్తి స్పష్టత వస్తుందని సీనియర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఒకరు తెలిపారు. కనెక్టింగ్ విమానాలు అందుకోవడం కష్టం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరింత ఖరీదు కాబోతున్నాయి. విమానాలు ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఇంధనంతోపాటు నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతాయి. అదే స్థాయిలో టికెట్ చార్జీలు పెరగడం తథ్యం. విమానయాన సంస్థలు తమపై పడే అదనపు వ్యయాన్ని ప్రయాణికులకే బదిలీ చేస్తాయి. మరో ఇబ్బంది ఏమిటంటే.. ప్రయాణానికి అదనపు సమయం పట్టడం వల్ల ఇతర దేశాల్లో కనెక్టింగ్ విమానాలు అందుకోవడం కష్టం కావొచ్చు. అందుకే ప్రయాణ ప్రణాళికను రీషెడ్యూల్ చేసుకోవాలి. విదేశాల నుంచి వచ్చేవారు కూడా ఆలస్యంగా స్వదేశానికి చేరుకుంటారు. లాంగ్ జర్నీ వల్ల విమానాల్లో ఇంధనం లోడ్ పెరుగుతుంది. ఎక్కువ ఇంధనాన్ని నింపుకోవాలి. ప్రయాణ సమయానికి అనుగుణంగా భద్రతాపరమైన ప్రమాణాలు కూడా పాటించాలి. పేలోడ్‌ను తగ్గించుకోవాలి. అంటే తక్కువ మంది ప్రయాణికులు, తక్కువ లగేజీతో ప్రయాణించాలి. దీనివల్ల విమానాల్లో సీట్లు లభించడం కష్టమవుతుంది. ఓవర్‌బుకింగ్ వంటి పరిణామాలు ఎదురవుతాయి. ముందస్తు ప్రణాళిక ఉంటే తప్ప అంతర్జాతీయ విమానాల్లో అప్పటికప్పుడు సీట్లు దొరకవు. భారత విమానాలకు తమ గగనతలాన్ని పాక్ మూసివేయడం ఇదే మొదటిసారి కాదు. 2019 ఫిబ్రవరిలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తింది. భారత సైన్యం చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడుల నేపథ్యంలో తమ గగనతలం గుండా భారత విమానాలు ప్రయాణించకుండా నిషేధించింది. ఈ నిషేధం కొన్ని నెలలపాటు కొనసాగింది. ఇప్పట్లో భారత ప్రయాణికులకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు చేయాల్సిందేమిటి? → పాక్ ఆంక్షల కారణంగా విమానయాన చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా టికెట్లు బుక్ చేసుకోవాలి. → విమానాల విషయంలో అప్డేట్స్ కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్ వెబ్సైట్ లేదా యాప్‌ను తరచూ చెక్ చేసుకోవాలి. → అంతర్జాతీయ ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించేందుకు సిద్ధపడాలి. తదనుగుణంగా పక్కా ప్లానింగ్ ఉండాలి. → ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయాణికుల లగేజీపై పరిమితి విధించే అవకాశం కనిపిస్తోంది. కనుక తక్కువ లగేజీతోనే ప్రయాణించాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రయివేటు బస్సుల దోపిడీ
► పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెరిగిన ప్రయాణికుల రద్దీ ► విజయవాడ - హైదరాబాద్ బస్సులకు డిమాండ్ ► డబల్ చార్జీ వసూలు చేస్తున్న ప్రయివేటు ట్రావెల్స్ ► ఆర్టీసీ బస్సుల్లో స్పెషల్ సర్వీసు పేరిట బాదుడు విజయవాడ : పెళ్లిళ్ల సీజన్లో ప్రయివేటు బస్సులకు డిమాండ్ పెరిగింది. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా తీసుకున్న ప్రయివేటు ఆపరేటర్లు అమాంతం రేట్లను పెంచేసి పయాణికులను నిలువునా దోచేస్తున్నారు. ప్రధానంగా విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య నడిచే ప్రయివేటు బస్సుల్లో ఆదివారం చార్జీలను రెట్టింపునకు పైగా పెంచారు. ఈ నెల 25వ తేదీన వివాహాలు, ఇతర శుభకార్యాలు అధికంగా ఉండటంతో హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రయాణికుల రద్దీ పెరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రోజూ 187 ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుం టాయి. హైదరాబాద్ నుంచి తెలంగాణ ఆర్టీసీ నుంచి కూడా 50 బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ఆదివారం విజయవాడ నుంచి అదనంగా 82 ప్రత్యేక సర్వీసులు నడిపారు. ఆర్టీసీ బస్సుల్లో సీట్లు పూర్తిగా బుక్ కావడంతో ప్రయాణికులు ప్రయివేటు బస్సుల వైపు ఎగబడ్డారు. దీంతో నగరం నుంచి ైహైదరాబాద్ వెళ్లే ప్రయివేటు బస్సుల చార్జీలను హైస్పీడులో పెంచేశారు. సాధారణ రోజుల్లో విజయవాడ, హైదరాబాద్ మధ్య 500 నుంచి 700 ప్రయివేటు బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. మామూలు రోజుల్లో 10 నుంచి 50 శాతం వరకు ఆన్లైన్లో చార్జీ తగ్గించి ఆఫర్లు ప్రకటిస్తున్న ప్రయివేటు ఆపరేటర్లు పెళ్లిళ్ల సీజన్లో జబర్దస్తీగా టికెట్ల ధరలు పెంచేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు సాధారణ రోజుల్లో ఏసీ బస్సుల్లో రూ.500 నుంచి రూ.600 చొప్పున చార్జీ వసూలు చేసేవారు. రద్దీ పెరగడంతో ఆదివారం ఏసీ ప్రయివేటు బస్సు చార్జీ రూ.1500 వరకు పలికింది. అదే స్లీపర్ కోచ్‌ల్లో రూ.2,200 వసూలు చేశారు. ప్రయివేటు ఆపరేటర్లు అందరూ ఇదే తరహాలో అధిక చార్జీలు వసూలు చేశారు. విజయవాడ, హైదరాబాద్ మధ్య నాన్ ఏసీ బస్సుల్లో రూ.400 చొప్పున ఉండే చార్జీని రూ.700 వరకు వసూలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం అధిక చార్జీ ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం అధికంగా చార్జీ వసూలు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే సూపర్ లగ్జరీ సర్వీసు చార్జీ రూ.269. అయితే ప్రత్యేక సర్వీసుల్లో రూ.404 చొప్పున వసూలు చేశారు. ఏసీ ప్రత్యేక సర్వీసుల్లో కూడా టికెట్ ధరలను ఆర్టీసీ అధికారులు పెంచారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే గరుడ చార్జీని రూ.559 నుంచి రూ.839కి పెంచారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన సర్వీసులు సిటీ బస్సులు, పల్లె వెలుగు సర్వీసుల్లో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతూ హైదరాబాద్, విజయవాడ మధ్య రాకపోకలు సాగించారు. -
ఢిల్లీ, బెంగళూరు కన్నా మన మెట్రో మరీ భారం
సాక్షి, ముంబై: ముంబైలో మెట్రో రైలు ప్రయాణం ఢిల్లీ, బెంగళూర్‌లకంటే ఖరీదైనదిగా మారింది. సబ్సిడీ లేకపోవడం వల్లనే ప్రయాణికులపై చార్జీల భారం పడుతోంది. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మార్గంలో ముంబైలోని మొదటి మెట్రో రైలు సేవలు వినియోగంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా మెట్రో రైలు చార్జీలు గణనీయంగా పెరిగాయి. దీనికి ప్రధాన కారణంగా ఢిల్లీ, బెంగళూరుల మాదిరిగా పన్నులో రాయితీలతోపాటు సబ్సిడీ లభించకపోవడమేనని నిపుణులు పేర్కొన్నారు.. ముంబై మెట్రో రైలు సేవలకు కూడా పన్ను రాయితీలతోపాటు సబ్సిడీ లభించినట్టయితే ప్రయాణ చార్జీలు 50 శాతం మేర తగ్గుతాయని వారు అభిప్రాయపడ్డారు. ఇటీవలే కోర్టు అనుమతించడంతో ముంబై మెట్రో రైలు చార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. ఈ చార్జీలు ఢిల్లీ, బెంగళూర్ మెట్రో రైలు చార్జీలకంటే అధికం కావడం విశేషం. ఢిల్లీ, బెంగళూర్ మెట్రో రైలు ప్రాజెక్టులకు తక్కువ వడ్డీతో రుణాలు లభించాయి. మరోవైపు ఎక్స్పర్ట్ డ్యూటీ లేకపోవడంతోపాటు అనేక పన్నులలో రాయితీలు లభిస్తున్నాయి. వీటితోపాటు ఢిల్లీ, బెంగళూర్ మెట్రో రైలు సేవల కోసం వినియోగించే విద్యుత్ కూడా సబ్సిడీ లభిస్తోంది. ఇలా ఢిల్లీ, బెంగళూర్ మెట్రో రైలు చార్జీల నియంత్రణలో ఉండగా మరోవైపు ఇలాంటివేమి లభించకనే మెట్రో రైలు ప్రయాణం ప్రియమైందని తెలిసింది. -
బస్సెక్కితే ఏడు రూపాయలు
సాక్షి, ముంబై: బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ ముంబైకర్లపై ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి (ఆదివారం) నుంచి చార్జీల భారం మోపనుంది. బెస్ట్ పరిపాలన విభాగం రూపొందించిన ప్రతిపాదనకు బీఎంసీ స్టాండింగ్ కమిటీ మంజూరు లభించింది. దీంతో మొదటి స్టేజీకి కనీస చార్జీ రూపాయి పెరగనుంది. ప్రస్తుతం బెస్ట్ బస్సులో కనీస చార్జీ ఆరు రూపాయలు చేస్తున్నారు. కాగా ఆదివారం నుంచి ఏడు రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు. ఈ చార్జీల పెంపు సాధారణ బస్సులతోపాటు ఎక్స్‌ప్రెస్, లిమిటెడ్, ఏసీ బస్సులకు కూడా వర్తించనుంది. చార్జీల పెంపు ప్రభావం వృద్ధులకు, వికలాంగులకు, విద్యార్థులకు ఇస్తున్న రాయితీలపై కూడా పడనుంది. ఆర్థికంగా నష్టాల బాటలో నడుస్తున్న బెస్ట్ సంస్థను కొంతమేరకైనా గట్టెక్కించాలంటే చార్జీలు పెంచక తప్పలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. బెస్ట్ పరిపాలన విభాగం 2014లోనే చార్జీల పెంపు ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చింది. కానీ బీఎంసీలో అధికారంలో ఉన్న శివసేన-బీజేపీ కూటమి రూ.150 కోట్లు ఆర్థిక సాయం అందజేయడంతో చార్జీలు పెంపు వాయిదా పడింది. ఆ తరువాత ఆగస్టులో మరోసారి చార్జీల పెంపు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే శాసనసభ ఎన్నికలు సమీపించడం మళ్లీ వాయిదా వేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఎట్టకేలకు చార్జీల పెంపు ప్రతిపాదనకు బీఎంసీ ఆమోదం తెలిపింది. అయితే చార్జీలను రెండు విడతలుగా పెంచాలని నిర్ణయించింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఒక రూపాయి, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మరో రూపాయి మేరకు చార్జీలు పెంచాలని నిర్ణయించింది. తొలి విడత భారం ఈ ఆదివారం ఉంచి అమలులోకి రానుంది. రెండో విడత చార్జీల పెంపు కూడా అమలులోకి వస్తే నగరంలో బెస్ట్ బస్సు కనీస చార్జీ రూ.8కి చేరుకుంటుంది. కాగా సాధారణ ప్రజలు పొందే సీజన్ పాస్‌తోపాటు వివిధ రాయితీలు పొందే సీజన్ పాస్‌లకు కూడా ఇది వర్తిస్తుందని బెస్ట్ యాజమాన్యం తెలిపింది. అదేవిధంగా బీఎంసీ పరిధి దాటి వెళ్లే ప్రయాణికులు అదనంగా మరో రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. టోల్‌నాకా, ఇతర పన్నులను దృష్టిలో ఉంచుకుని ఈ చార్జీలు నిర్ణయించారు. ఏసీ బస్సు ప్రయాణికులపై అదనంగా రూ.5 భారం పడనుంది. ఇదిలాఉండగా ఉద్యోగుల సౌకర్యార్థం నగరంలోని కొన్ని ప్రముఖ రైల్వే స్టేషన్ల నుంచి కార్పొరేట్ కార్యాలయాల వరకు ప్రత్యేకంగా నడుపుతున్న బస్సులకు కనీస చార్జీలు రూ.ఆరు మాత్రమే వసూలు చేసేవారు. కాని ఆదివారం నుంచి దూరాన్ని బట్టి చార్జీలు వసూలు చేయనున్నారు. అదేవిధంగా ఇదివరకు 3, 5, 7, 8, 15, 25, 35 కి.మీ.లకు ఒక స్టేజీ చొప్పున నిర్ధారించారు. ఆదివారం నుంచి 2, 4, 6, 10, 14, 20 కి.మీ.లకు ఒక స్టేజీగా నిర్ణయించారు. దీనివల్ల కొందరు ప్రయాణికులకు లాభం, మరికొందరికి నష్టం జరగనుంది.