
ఇంధనం బిల్లు ఏడాదిలో 9 బిలియన్ డాలర్లకు పెరిగే ప్రమాదం
భారత చమురు అవసరాలకు దిగుమతులే దిక్కు
35.1 శాతం రష్యా నుంచే కొనుగోలు
భారత్ తన చమురు అవసరాల కోసం ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశంలో ఉపయోగిస్తున్న చమురులో ఏకంగా 80 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. ఇందులో ప్రధాన వాటా రష్యాదే. రష్యా నుంచి చౌకగా ముడిచమురు లభిస్తోంది. ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నెర్ర చేయడానికి, 50 శాతం సుంకాలు విధించడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడమే కారణం.
ఒకవేళ రష్యా నుంచి ముడిచమురు కొనడం ఆపేస్తే భారత్‌పై మోయలేని భారం పడడం ఖాయం. అది దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రతికూలంగా మార్చేయగలదు. రష్యా చమురును వద్దనుకుంటే ఇండియా ఆయిల్ దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతుందని ఎస్‌బీఐ ఒక నివేదికలో తేల్చిచెప్పింది. 2026లో 9 బిలియన్ డాలర్లకు, 2027లో 12 బిలియన్ డాలర్లకు చేరుతుందని వెల్లడించింది. చమురు కోసం పూర్తిగా అరబ్ దేశాలపైనే ఆధారపడితే విపరీతంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. అంతిమంగా ఆ భారం మోయాల్సింది ప్రజలేనన్న సంగతి తెలిసిందే.
1.7 శాతం నుంచి 35.1 శాతానికి..
భారత్ 2022 నుంచి రష్యా నుంచి ముడిచమురును చౌక ధరకే కొంటోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా చమురు ధరపై పరిమితిని నిర్దేశించాయి. దాంతో రష్యా తన చమురును ఇండియాకు విక్రయిస్తోంది. దీనివల్ల ఇండియాకు ఎనలేని మేలు జరుగుతోంది. చమురు బిల్లుల భారం చాలావరకు తగ్గిపోయింది.
మన దేశానికి చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో తొలి స్థానం రష్యాదే. 2020లో ఇండియా చమురు అవసరాల్లో రష్యా వాటా కేవలం 1.7 శాతం ఉండేది. ప్రస్తుతం అది ఏకంగా 35.1 శాతానికి చేరడం గమనార్హం. 2025లో 245 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు దిగుమతి చేసుకోగా, ఇందులో రష్యా వాటా 88 మిలియన్ మెట్రిక్ టన్నులు.
ధరలు 10 శాతం పెరిగే అవకాశం
అమెరికా ఒత్తిడికి తలొగ్గి రష్యా ఆయిల్‌ను ఇండియాతోపాటు ఇతర దేశాలు కొనడం ఆపేస్తే ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రపంచమంతటా ఉపయోగిస్తున్న ఆయిల్‌లో 10 శాతం రష్యా నుంచే వస్తోంది. ఈ ఆయిల్ సరఫరాను హఠాత్తుగా నిలిపివేస్తే.. కొరత వల్ల చమురుకు డిమాండ్ పెరిగి ధరలు కనీసం 10 శాతం పెరుగుతాయి.
ఇండియాతోపాటు అన్ని దేశాలపైనా భారం పడుతుంది. ఇండియాకు ఉన్న సానుకూలత ఏమిటంటే.. రష్యా నుంచే కాకుండా మరో 40 దేశాల నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి సరఫరా ఆగిపోయినా ఇప్పటికిప్పుడు ఇబ్బంది ఉండకపోవచ్చు. ధరల భారం మాత్రం తప్పదు.
– సాక్షి, నేషనల్ డెస్క్