ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా ఒక కిలో బియ్యం సేకరించి, దాన్ని భద్రపరిచి, రవాణా చేసి లబ్ధిదారుడికి చేరవేసేసరికి దాదాపు రూ.40 వరకు ఖర్చు చేస్తోంది. అంటే, మనం ‘ఉచితం’ అని పిలుచుకుంటున్న ఈ బియ్యం వెనుక సామాన్యుడు పన్ను రూపంలో చెల్లించిన భారీ మూల్యం ఉంది. దురదృష్టవశాత్తు 2025 ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలోనే రవాణా, నిల్వ లోపాల వల్ల సుమారు 53,000 టన్నుల ఆహార ధాన్యాలు వృథా అయ్యాయి. ఒకవైపు ఆకలి కేకలు, మరోవైపు గోడౌన్లలో కుళ్లిపోతున్న ధాన్యాలు వెరసి ప్రభుత్వానికి ఆర్థిక భారం తప్పడం లేదు.
ఈ భారీ నష్టాన్ని, లీకేజీలను అరికట్టడానికి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా ‘నగదు బదిలీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ DBT)’ పరిష్కారంగా తోస్తుంది. ప్రభుత్వం భరిస్తున్న ఈ రూ.40 ఖర్చును నేరుగా పేదల ఖాతాల్లో వేస్తే వారు మార్కెట్‌లో తమకు నచ్చిన నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందనే వాదనలున్నాయి. భారతదేశపు అతిపెద్ద ఆహార భద్రతా పథకంలో రావాల్సిన విప్లవాత్మక మార్పులపై విశ్లేషణ.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమంగా పేరుగాంచిన భారత ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ప్రస్తుతం 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచితంగా బియ్యం, గోధుమలను అందిస్తోంది. అయితే, పేదల ఆకలి తీరుస్తున్న ఈ పథకం వెనుక ప్రభుత్వం భరిస్తున్న ఆర్థిక భారం, వ్యవస్థలోని లోపాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఒక కిలో ధాన్యం ధర ఎంత?
సాధారణ పౌరులకు రేషన్ దుకాణాల్లో బియ్యం, గోధుమలు ఉచితంగా లభిస్తున్నప్పటికీ, ప్రభుత్వంపై పడుతున్న వ్యయం సామాన్యమైనది కాదు. ధాన్యాల సేకరణ, నిల్వ, రవాణా, వడ్డీ ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే కిలో ధాన్యం రేషన్ షాపుకు చేరడానికి ప్రభుత్వానికి రూ.28 నుంచి రూ.40 వరకు ఖర్చవుతోంది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌సీఐ వ్యయం
బియ్యం (కిలోకు): రూ.39.75
గోధుమలు (కిలోకు): రూ.27.74
మొత్తం ఆహార సబ్సిడీ బిల్లు: రూ.2.05 లక్షల కోట్లు
వ్యవస్థలోని లోపాలు.. వేల కోట్ల నష్టం
ప్రభుత్వం ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నా ఆ ఫలాలు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందడం లేదనే అభిప్రాయాలున్నాయి. గణాంకాల ప్రకారం, సబ్సిడీ ధాన్యాల్లో సుమారు 28 శాతం లక్షిత గృహాలకు చేరడం లేదు. అంటే దాదాపు 20 మిలియన్ టన్నుల ధాన్యం పక్కదారి పడుతోంది లేదా వృథా అవుతోంది. దీనివల్ల ఏటా ప్రభుత్వానికి రూ.69,108 కోట్ల నష్టం వాటిల్లుతోంది. రవాణా, నిల్వ సమయంలో జరుగుతున్న నష్టం కూడా ఆందోళనకరంగా ఉంది. 2025 ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలోనే ఎఫ్‌సీఐ రవాణాలో 40,000 టన్నులు, నిల్వలో 13,000 టన్నుల ధాన్యాన్ని కోల్పోయింది.
నగదు బదిలీ(DBT) పరిష్కారమేనా?
ఈ లాజిస్టిక్స్ చైన్‌లోని లోపాలను సరిదిద్దడానికి నగదు బదిలీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ DBT) ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ధాన్యం పంపిణీకి చేసే ఖర్చును నేరుగా లబ్ధిదారుల ఆధార్ అనుసంధిత బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల..
సప్లై చైన్ లీకేజీలను అరికట్టవచ్చు.
లబ్ధిదారులు తమకు నచ్చిన నాణ్యమైన ఆహారాన్ని స్థానిక మార్కెట్లలో కొనుగోలు చేయవచ్చు.
కర్ణాటకలోని ‘అన్న భాగ్య’ నగదు బదిలీ పథకం ద్వారా లబ్ధిదారులు మెరుగైన ఆహారాన్ని కొనుగోలు చేయడమే కాకుండా, కొత్త బ్యాంక్ ఖాతాలు తెరవడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములయ్యారు.
ముందున్న మార్గం
పీడీఎస్ వ్యవస్థను నేరుగా నగదు బదిలీకి మార్చడం ఒకేసారి సాధ్యం కాకపోవచ్చు. దీనికోసం ప్రభుత్వం కొన్ని వ్యూహాలను అనుసరించాలి.
లబ్ధిదారులే స్వచ్ఛందంగా నగదు లేదా ధాన్యం ఎంచుకునేలా 12-18 నెలల సమయం ఇవ్వాలి.
ద్రవ్యోల్బణానికి అనుగుణంగా నగదు బదిలీ మొత్తాన్ని సవరించాలి.
మౌలిక సదుపాయాలు లేని చోట్ల నగదుకు బదులు ఆహార కూపన్లను వినియోగించవచ్చు.
ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే పెట్టి పుట్టాల్సిందే!


