
ఈ చిత్రం చూశారా... ఇది వీరఘట్టం మండలం దయానిధిపురం గ్రామానికి చెందిన చొంగల రామచంద్రరావుకు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డు. పేరు, ఊరుపేరు, మండలం పేరు సరిగా ఉన్నా జిల్లా పేరు పార్వతీపురం మన్యం స్థానంలో విజయనగరం అని ముద్రించారు. వివిధ ధ్రువపత్రాల కోసం స్మార్ట్‌కార్డు జెరాక్స్‌ను దరఖాస్తుకు జతచేసిన సమయంలో జిల్లా పేరు తప్పుగా నమోదుకావడంతో అభ్యంతరం తెలుపుతున్నారు. దీనిని సరిచేసేందుకు ఆయన కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ఈ చిత్రంలోని స్మార్ట్ కార్డును చూశారా.. ఇది పాలకొండ మండలం సింగన్నవలసకు చెందిన కేసిరెడ్డి గంగరాజుకు ఇటీవల కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్‌కార్డు. ఆయన గ్రామం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండగా, శ్రీకాకుళం అని ముద్రించారు. ఈయనకూ తిప్పలు తప్పడం లేదు. జిల్లా పేరు ఏది అని అధికారులు ప్రశ్నించగానే కార్డులో తప్పుగా ముద్రించారని, తమ ప్రమేయం లేదంటూ బదులివ్వాల్సిన పరిస్థితి.
సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గత ప్రభుత్వం మంజూరు చేసిన బియ్యం కార్డులను(రేషన్) మార్పు చేసిన విషయం విదితమే. వాటి స్థానంలో క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తోంది. ముద్రణలోపంతో అవి కాస్త తప్పులతడకగా మారాయి. జిల్లాలో 2,73,000 మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ కొత్తగా కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. కొద్దిరోజులుగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక కూటమి నాయకుల ఆధ్వర్యంలో వీటిని అట్టహాసంగా పంపిణీ చేస్తున్నారు. రేషన్‌లో అక్రమాలను అరికట్టేందుకు ఈ కార్డులు ఉపయోగపడతాయని గొప్పగా చెప్పుకొంటున్నారు. వీటితో రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ పొందవచ్చని ఆర్భాటంగా ఊదరగొడుతున్నారు. కార్డులు పొందిన లబి్ధదారుల పరిస్థితి మరోలా ఉంది. అక్రమాల మాట దేవుడెరుగు.. ఇందులో ఉన్న తప్పులను ఎవరు సరిదిద్దుతారంటూ లబోదిబోమంటున్నారు.
ముద్రణ అస్తవ్యస్తం
కార్డుల ముద్రణలో విపరీతమైన తప్పులు దొర్లాయి. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 1.22 లక్షల కార్డుల పంపిణీ పూర్తయింది. ఇందులో చాలా వరకు తప్పులు కనిపిస్తున్నాయి. ఇంటి యజమాని పేరిట కార్డు రాగా... అందులో భార్య స్థానంలో కుమార్తె పేరు ఉంటోంది. మరోచోట తండ్రి స్థానంలో తల్లిపేరు ముద్రించారు. మండలం, చిరునామా సక్రమంగా ఉన్నా.. చివరన జిల్లాల పేర్లలో తప్పులు దొర్లాయి. కొమరాడ మండలానికి చెందిన ఓ కార్డుదారుడి వివరాల్లో జిల్లాను విజయనగరంగా చూపారు. వీరఘట్టం తహసీల్దారు కార్యాలయం పరిధిలోని ఓ కార్డుదారుడి చిరునామా వద్ద విజయనగరం జిల్లాగా నమోదైంది. పాలకొండ తహసీల్దార్ కార్యాలయం పరిధిలోని మరో కార్డులో శ్రీకాకుళం జిల్లాగా ముద్రించారు. ఇలా దాదాపు అన్ని కార్డుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో లబి్ధదారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఏ సంక్షేమ పథకం అందుకోవాలన్నా.. పిల్లల విద్యాపరంగా ఎటువంటి ధ్రువపత్రం, లబ్ధి పొందాలన్నా.. ఆధార్‌కార్డుతో రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్లో చిరునామాలు, ఇతర వివరాలు తప్పుగా ఉండడం వల్ల ఇబ్బందులు వస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలే మార్చేయడం వల్ల భవిష్యత్తులో పథకాలు, ఇతర రాయితీలకు దూరమవుతామేమోనని అంటున్నారు.
ఇంటి వద్దకే రేషన్ పథకానికి మంగళం పాడి..
వాస్తవానికి గత ప్రభుత్వమే రేషన్ పోర్టుబిలిటీని తీసుకొచ్చింది. ఎక్కడైనా రేషన్ పొందే సౌలభ్యం కలి్పంచింది. దీంతోపాటు ఎండీయూ వాహన వ్యవస్థతో నేరుగా ఇంటి వద్దకే సరకులను అందించేవారు. గిరిజన జనాభా అధికంగా ఉండే మన్యం జిల్లాలో ఈ విధానం ఎంతగానో ఉపయోగపడేది. రేషన్ సరకుల కోసం ఎక్కడో సుదూరాన ఉన్న చౌకధరల దుకాణాలకు వెళ్లే బాధ లబి్ధదారులకు తప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ విధానానికి మంగళం పాడింది. లబి్ధదారులకు మళ్లీ పాత కష్టాలను పునరావృతం చేసింది. ప్రధానంగా గిరిజనులు కొండలు దిగి, రేషన్ తీసుకెళ్తున్న పరిస్థితులు వస్తున్నాయి. ఇవేవీ చాలవన్నట్లు గత ప్రభుత్వంలో ఇచ్చిన బియ్యం కార్డులను రద్దు చేసి, వాటి స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తోంది. ఆ పనీ సక్రమంగా చేయక, తప్పులతో ముద్రణ చేసి లబి్ధదారులకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నిర్వాకాన్ని చూసి ‘ఇదేనా కూటమి ప్రభుత్వం స్మార్ట్.. ఇదేనా సాంకేతికతా?’ అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.