రైతులను భూముల కోసం బెదిరించడం దారుణం
ఇప్పటికే భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలి
వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి
చంద్రబాబు ‘మునిసిపాలిటీ’ వ్యాఖ్యలు రైతులను అవమానించేలా ఉన్నాయి
అసలు చంద్రబాబుకే సరైన ప్రణాళిక లేదు.. అందుకే ఈ దుస్థితి
రౌండ్ టేబుల్ సమావేశంలో రైతులు, రైతు సంఘాల నాయకులు, సామాజికవేత్తల ఆగ్రహం
గాందీనగర్(విజయవాడ సెంట్రల్): రాజధాని అమరావతి పేరిట రెండో విడత భూ సమీకరణ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో రైతులను ప్రభుత్వం పదే పదే దగా చేస్తోందని మండిపడింది. తొలుత భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. శనివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ‘అమరావతి భూ సమీకరణ 2.0’పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
అమరావతి రైతు నాయకులు గద్దె తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు ఉద్యమ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. గతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు ఇప్పటివరకు న్యాయం చేయలేదన్నారు. మళ్లీ రెండో విడత పేరుతో భూములు తీసుకోవాలని నిర్ణయించడం దారుణమన్నారు.
24 ప్లాట్‌ఫారాలతో రైల్వేస్టేషన్ కడతానంటున్నారని.. నిజంగా అంత పెద్ద రైల్వేస్టేషన్ అవసరమా? అని ప్రశి్నంచారు. చంద్రబాబు పగటి కలలతో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు లేదా? అని నిలదీశారు. ఎప్పుడు నిర్మిస్తారో తెలియని ఔటర్ రింగ్ రోడ్‌కు ఇప్పుడు భూ సమీకరణ అవసరమా? అని ప్రశ్నించారు.
భూ సమీకరణ జీవో చెల్లదు!
ఔటర్ రింగ్ రోడ్ అంటూ ప్రజలను మోసం చేసి భూములు తీసుకుంటున్నారని ప్రొఫెసర్ రామచంద్రయ్య మండిపడ్డారు. ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవో వెనుక వారి ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులకు ఇచ్చిన హామీలన్నీ పెద్ద మోసాలన్నారు. రైతులకు విద్య, వైద్యం అందించాలని ల్యాండ్ పూలింగ్ జీవో చెబుతున్నప్పటికీ అవేవీ కల్పించలేదన్నారు. సమీకరణపై తెచ్చిన జీవో చెల్లదని, దీనిని కోర్టులో సవాల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అన్‌స్టాపబుల్‌గా భూ సమీకరణ..
అమరావతి అన్‌స్టాపబుల్ అని చెబుతున్న చంద్రబాబు.. భూ సమీకరణ కూడా అన్‌స్టాపబుల్‌గా చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మండిపడ్డారు. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సచివాలయాన్ని రెండేళ్లు, పార్లమెంట్‌ను మూడేళ్లలో పూర్తి చేశారని.. కానీ మన రాజధాని మాత్రం టీవీ సీరియల్‌లా సాగుతోందని ఎద్దేవా చేశారు. ఒక ప్రాంతంలోనే అంతా ఖర్చు చేస్తున్నారని రాయలసీమలో అలజడి మొదలైందని హెచ్చరించారు.
సామాజిక కార్యకర్త వసుంధర మాట్లాడుతూ.. రెండో విడత భూ సమీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే.. అమరావతి మున్సిపాలిటీగా కాదు.. పంచాయతీగా మిగిలిపోవడం ఖాయమన్నారు. సమావేశంలో సీపీఐ నేత అక్కినేని వనజ, కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ, అమరావతి రైతులు ఎం.రవి, రఘునాథ్, గన్నవరం ఎయిర్‌పోర్టు బాధితులు వేదవతి, శ్రీధర్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు పోలారి, తదితరులు పాల్గొన్నారు.
రైతులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?
ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇవ్వకపోతే అమరావతి మున్సిపాలిటీగా మిగులుతుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి. చంద్రబాబూ.. రైతులను బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారా? లేదా అవమానించాలని అనుకుంటున్నారా? అమరావతి రైతులకు చంద్రబాబు ఇప్పటివరకు చేసిందేమీ లేదు. – బుచ్చి తిరుపతిరావు, అమరావతి రైతు
చంద్రబాబుకు ప్రణాళిక లేదు
చంద్రబాబు అమరావతి రైతులను పిలిచి మున్సిపాలిటీ కబుర్లు చెబుతున్నాడు. చంద్రబాబును ఇలాగే వదిలేస్తే రాష్ట్రమంతా భూ సమీకరణ చేస్తాడు. అసలు చంద్రబాబుకు ప్రణాళిక లేదు. అమరావతి రైతులంతా కలిసి చంద్రబాబు మెడలు వంచాలి. – రాజేంద్రప్రసాద్, రైతు


