‘సాక్షి’ ఎడిటర్‌పై మరో కేసు | Another case against Sakshi editor | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ ఎడిటర్‌పై మరో కేసు

Dec 7 2025 4:37 AM | Updated on Dec 7 2025 4:37 AM

Another case against Sakshi editor

అక్రమాలు, అరాచకాలు, దోపిడీని ప్రశ్నిస్తున్నందుకు అక్కసు

ఒక్క కర్నూలులోనే ఇప్పటికే ఐదు కేసులు 

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు.. ‘భరత్‌ ఆదేశమా? ప్రభుత్వ నిర్ణయమా?’ కథనంపై తాజాగా మరో కేసు

ఏ, బీ, సీ క్యాంపు క్వార్టర్ల వ్యవహారంలో మంత్రి టీజీ భరత్‌పై తీవ్ర ప్రజా వ్యతిరేకత 

ఇది తట్టుకోలేక ‘సాక్షి’పై కక్షసాధింపు 

మంత్రి ఆదేశాలతో కేసులు నమోదు చేస్తున్న పోలీసులు

హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రెస్‌ కౌన్సిల్‌ ఎన్నిసార్లు హెచ్చరించినా మారని ప్రభుత్వ వైఖరి  

సాక్షి ప్రతినిధి కర్నూలు: ప్రభుత్వ తప్పిదాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’పై ప్రభుత్వ పెద్దలు కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజా వ్యతిరేకత తట్టుకోలేక తప్పుడు కేసులు నమోదు చేస్తూ ‘సాక్షి’ గొంతు నొక్కడానికి విఫలయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కర్నూలులో  ఇప్పటికే ‘సాక్షి’పై 5 కేసులు నమోదు చేశారు. తాజాగా మరో కేసు నమోదైంది. ఇందులో రెండు కేసులు పోలీసులు అక్రమంగా నమోదు చేస్తే, మిగిలిన కేసులు మంత్రి టీజీ భరత్‌ ఆదేశాలతో నమోదయ్యాయి. 

‘క్యాంపు భరతం పట్టేస్తా!’ శీర్షికన సెప్టెంబర్‌ 13న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. కర్నూల్లో కీలకమైన ఆ ప్రాంతాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని వివరించింది. ఉన్నఫళంగా క్వార్టర్లు ఖాళీ చేయా­లని నోటీసులు అందడంతో ఏ,బీ,సీ క్యాంపు క్వార్టర్లలో నివాసం ఉంటున్న వారు, ప్రభుత్వ ఉద్యోగు­లు వరుస ఆందోళనలకు దిగారు. ఎలా­గైనా క్వార్టర్లు కూల్చేయాలని భీష్మించిన మంత్రి టీజీ భరత్‌ ‘క్వార్టర్లు ఖాళీ చేయాల్సిందేనని, లేదంటే కర్ర పట్టుకోవాల్సి వస్తుంది’ అని బెదిరించారు. 

దీంతో క్వార్టర్లు కూల్చేయడం, ఖాళీ చేయడం అనేది ప్రభుత్వ నిర్ణయమా? భరత్‌ వ్యక్తిగత నిర్ణయమా? అనే చర్చ నగరంలో జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణ­యమైతే అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువరించాలి. భరత్‌ వ్యక్తిగత నిర్ణయమైతే క్వార్టర్లు ఖాళీ చేయండనే హక్కు ఆయనకు లేదు. ఇంత వరకూ ప్రభుత్వం నుంచి క్వార్టర్లు ఖాళీ చేయాలని ఉత్తర్వులు లేవు. అక్కడ మినీ స్టేడియం నిర్మిస్తున్నామని, ఖాళీ చేయాలంటూ ఆర్‌అండ్‌బీ అధికారులు కొంత మందికి నోటీసులు జారీ చేశారు. 

నోటీసులకు, మంత్రి మాటలకు పొంతన ఏదీ?  
ఏబీసీ క్వార్టర్లు ఖాళీ చేయాలని, అక్కడ మినీ స్టేడియం నిర్మిస్తున్నామని ఏప్రిల్‌ 10న ఆర్‌అండ్‌బీ ఏఈ, డీఈ, ఈఈలు 39 మందికి నోటీసులు జారీ చేశారు. మినీ స్టేడియం నిర్మిస్తున్నామని నోటీ­సులో స్పష్టంగా పేర్కొన్నారు. దీని నిర్మాణానికి 5 ఎకరాలు కూడా అవసరం లేదు. అయితే అక్కడ 160–­170 ఎకరాల స్థలం ఉంది. మార్కెట్‌ రేటు ప్రకారం ఈ స్థలం విలువ రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్లు ఉంటుంది. తక్కిన స్థలాన్ని పీపీపీ విధానం ప్రకారం టీడీపీ నేతలు కొట్టేయాలనే ప్రచా­రం నడిచింది. 

అధికార, రాజకీయ వర్గాలు కూడా ఈ అంశాన్ని చర్చించాయి. ఇదే విషయాన్ని వివరిస్తూ సెపె్టంబర్‌ 13న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో ఆగ్రహం చెందిన ప్రభుత్వ పెద్దలు టూటౌన్, త్రీటౌన్‌లో ‘సాక్షి’పై కేసు నమోదు చేయించారు. ఈ కథనం తర్వాత నగరవాసులంతా విలువైన ప్రభు­త్వ స్థలం లీజు పేరుతో పరుల పరం కాకూడదని చర్చించుకున్నారు. ఈ వ్యవహారంలో భరత్, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో భరత్‌ అక్కడ హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తున్నామని, స్థలాలు ఖాళీ చేయాల్సిందేనని చెప్పారు. 

అధికా­రులు నోటీసుల్లో పేర్కొన్నట్లు మినీ స్టేడి­యం నిర్మించడం వాస్తవమా? లేక భరత్‌ చెప్పినట్లు హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తున్నారా? ఈ రెండింటిలో ఏది నిజమైనా ప్రభుత్వం నుంచి అనుమతి ఉందా? స్టేడియం నిర్మిస్తున్నామని, లేదా హైకోర్టు బెంచ్‌ ఏ,బీ,సీ క్యాంపుల్లో నిర్మిస్తున్నామని ప్రభుత్వం ఎందుకు జీవో జారీ చేయలేదు? హైకోర్టు బెంచ్‌ ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తున్నారు? తక్కిన స్థలాన్ని ఏం చేస్తారు? అనే విషయాలను ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. 

ఈ వ్యవహారంలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం ప్రభుత్వ అవసరాలకే వినియోగించాలని, పీపీపీ విధానం ద్వారా టీడీపీ నేతలు కొట్టేయకూడదనే ‘సాక్షి’ రాసింది. ప్రజల తరఫున పై విషయాలను ప్రశ్నించినందుకు వాటికి సమాధానం చెప్పలేక తప్పుడు కేసులు నమోదు చేయడంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ‘సాక్షి’ ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో అక్రమ కేసులను చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసింది.

జాతీయ స్థాయిలో తప్పుబట్టినా మారని ప్రభుత్వ, పోలీసు వైఖరి
ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’ పత్రికపై, జర్నలిస్టుల­పై అక్రమంగా కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారని ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పలు సంఘాల నేతలు, జర్నలిస్టు యూ­నియన్లతో పాటు జాతీయ స్థాయిలో ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఎడిటర్స్‌ గిల్డ్‌ కూడా తీవ్రంగా తప్పుబట్టింది. 

హైకోర్టు, సుప్రీ­ంకోర్టు కూడా ప్రభుత్వ వైఖరిని ఎత్తి చూ­పి­ంది. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని, రాజ్యంగం పత్రికలకు భావ ప్రకటన స్వేచ్ఛను హక్కుగా కల్పించిందని, దాన్ని ఇత­ర వ్యవస్థలు కాపాడాలని విన్న­విస్తున్నా ప్రభుత్వా­నికి, పోలీసులకు ఏమాత్రం చెవికెక్క­డం లేదు. 

ప్రభుత్వ పెద్ద­లు ఎలా చెబి­తే అలా అక్ర­మ కేసులు నమో­దు చేస్తు­న్నా­రు. వార్త­లతో ఎవ­రికైనా పరువునష్టం వాటిల్లి ఉంటే కోర్టును ఆశ్రయింవచ్చు. పరువునష్టం దా­వా దాఖలు చేయొచ్చు. కానీ అధికారం ఉందికదా అని ‘సాక్షి’­పై అక్రమ కేసులు నమో­దు చేయించడాన్ని ప్రజలు, మేధావులు తప్పుపడుతున్నా­రు.

కర్నూల్లో ‘సాక్షి’పై ఇవీ కేసులు
» చంద్రబాబు ప్రభుత్వంలో ‘సాక్షి’పై కర్నూలులో 6 కేసులు నమోదు చేశారు. సెప్టెంబర్‌ 13న ‘క్యాంపు భరతం పట్టేస్తా!’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై త్రీటౌన్‌ పోలీసు­స్టేష­న్‌­లో సాక్షి మేనేజ్‌­మెంట్, సాక్షి పబ్లిషర్‌పై క్రైం నెంబర్‌ 419/­20225 కింద సెక్షన్‌ యూ/­ఎస్‌192, 352,353 (1),(బి),356­(1),­­61(1)(ఏ) రెడ్‌విత్‌ 3(5) 
బీఎ­న్‌ఎస్‌ ప్రకారం కేసు నమోదు చేశారు.  

»  ఇదే కథనంపై రెండో పట్టణ పోలీసు­స్టేషన్‌­లో సెక్షన్‌ 192, 356(1),­352, 353(1)(బి)61­(1)­(ఏ)­రెడ్‌విత్‌ 3(5) బీఎన్‌సీపై మరో కేసు నమోదు చేశారు. నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌లో, శరత్‌బాబు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు టూటౌన్‌లో కేసులు నమోదు చేశారు.

»  ‘ప్రభుత్వ నిర్ణయమా? భరత్‌ ఆదేశమా?’ అనే శీర్షికతో గత నెల 28న ప్రచురితమైన కథనంపై ఈ నెల 4న టూ టౌన్‌ పోలీసు­స్టేషన్‌లో గజేంద్ర సింగ్‌ ‘సాక్షి’ ఎడిటర్, పబ్లిషర్, సెల్లర్, రిపోర్టర్‌పై సెక్షన్‌ 192, 352,353(1)(బి),­353(1)(సి),­353(2), 356(3),­356(4)­,­రెడ్‌విత్‌ 3(5) బీఎ­­న్‌ఎస్‌ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసులన్నీ మంత్రి తన అనుచరులతో ఫిర్యాదు చేయించినవే అన్నది బహిరంగ రహస్యం.

»  జూలై 26న కర్నూలు త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ‘సాక్షి­’పై సెక్షన్‌ 132, 308(3), 353(1)(బి), 356(3), రె­డ్‌విత్‌ 61(2)బీఎన్‌ఎస్‌ ప్రకారం కేసు నమోదు చేశారు. ‘రాయ­ల­సీమలో అనకొండ ఐపీఎస్‌’ పేరు­తో ప్రచురి­త­మైన కథనం నేపథ్యంలో ఆ కేసు నమోదు చేశారు. 

» గతేడాది డిసెంబర్‌ 22న కర్నూలులో మునీర్‌ అహ్మద్‌ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీ­సులు కిడ్నాప్‌ చేశారు. దీనిపై కథనం రాస్తే త్రీటౌన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు తన విధులకు ‘సాక్షి’ విలేకరి ఆటంకం కల్గించారని తప్పుడు ఫిర్యాదుతో త్రీటౌన్‌లో కేసు నమోదు చేశారు. 

» కర్నూలు కార్పొరేషన్‌ టెండర్లలో ఎవ్వరూ పాల్గొన­వద్దని మంత్రి భరత్‌ అనుచరుడు సందీప్‌ అనే వ్యక్తి వాట్సాప్‌ గ్రూపుల్లో కాంట్రాక్టర్లకు బెదిరింపు మెసేజ్‌లు పంపారు. దీనిపై ఆధారాలతో ‘సాక్షి’ కథనం ప్రచురిస్తే అతని ఫిర్యాదుతో వన్‌టౌన్‌లో కేసు నమోదు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement