స్వామివారికి కాకుండా ఇంకొకరికి ఎందుకిస్తాను?
డిబేట్లు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు
న్యాయస్థానం జోక్యం చేసుకుంటే.. నేనెలాంటి వైద్య పరీక్షలకైనా సిద్ధం
నేను ఎంత మహాపాపం చేశానో తలచుకుని బాధపడని రోజులేదు
‘దయచేసి ప్లీజ్..’ అంటూ కన్నీటితో పరకామణి కేసు ప్రధాన నిందితుడు రవికుమార్ సెల్ఫీ వీడియో
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగానే తన ఆస్తిని తిరుమల శ్రీవారికి రాసిచ్చానే తప్ప.. మరెవ్వరికీ రాసివ్వలేదని పరకామణి కేసులోని ప్రధాన నిందితుడు రవికుమార్ స్పష్టంచేశారు. టీటీడీ పరకామణిలో చోరీకి పాల్పడ్డ రవికుమార్.. ప్రాయశ్చిత్తంతో తన ఆస్తిని శ్రీవారికి రాసిచ్చిన విషయం తెలిసిందే. మూసివేసిన కేసును చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పరకామణి కేసును తిరగతోడి వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా విచారణ చేపట్టింది.
రాజకీయ ప్రయోజనాల కోసం ఎల్లో మీడియా ద్వారా టీడీపీ కూటమికి అనుకూలంగా ప్రచారాలు చేస్తూ పరకామణి కేసును తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రవికుమార్ శనివారం సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అందులో.. ‘నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా శ్రీవారికి నా ఆస్తినంతా రాసిచ్చాను, శ్రీవారికి కాక ఇంకెవరికి రాస్తాను?’.. అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇంకా ఏమన్నారంటే..
నాపై చెప్పేవన్నీ అబద్ధాలే..
అందరికీ నమస్కారం. నా పేరు రవికుమార్. నేను కొంతకాలంగా పెద్దజీయర్ మఠంలో గుమస్తాగా పనిచేస్తున్నా. కేబుల్, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నా. రెండేళ్ల క్రితం అంటే.. 2023 ఏప్రిల్ 29న పరకామణిలో ఓ తప్పు చేశాను. దానిని నేను, మా కుటుంబం మొత్తం మహా పాపంగా భావించి పాప పరిహారార్థం నా ఆస్తిలోని 90 శాతం స్వామివారికి రాసిచ్చాను. కానీ, కొంతమంది దీనిని మరోలా భావించి, ఇంకోలా మాట్లాడుతున్నారు.
కొందరికి డబ్బులిచ్చానని, ఆస్తి రూపంగా ఇచ్చానని.. కొందరి ఒత్తిళ్లతో ఇదంతా చేశానంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. నా ఆస్తిని శ్రీవారికి కాకుండా ఎవరికో ఎందుకిస్తాను చెప్పండి. కొంతమంది నన్ను బ్లాక్ మెయిల్ కూడా చేశారు. అలా చేసిన వారిపై కేసులు పెట్టాను. నా శరీరంలోని ఓ ప్రైవేటు పార్టుకు శస్త్రచికిత్స చేసుకున్నానని అసభ్యకరంగా మాట్లాడారు.
పైగా.. వాటిపై డిబేట్లు పెట్టడం, మా గురించి అసభ్యకరంగా మాట్లాడడం చేస్తున్నారు. దీంతో.. రెండున్నరేళ్లుగా నేను, నా కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదన చెందుతున్నాం. ఈ విషయాలపై కోర్టు కలుగచేసుకుంటే.. నేను ఎలాంటి వైద్య పరీక్షలకైనా సిద్ధం. నేను ఎలాంటి శస్త్ర చికిత్సలు చేసుకోలేదని నిరూపించుకుంటా. వీళ్లు నాపై చెప్పేవన్నీ అబద్ధాలే. నేను ఎంత మహాపాపం చేశానో తలచుకుని తలచుకుని బాధపడని రోజంటూలేదు. దయచేసి ప్లీజ్.. అంటూ రెండు చేతులు జోడించి రవికుమార్ కన్నీటితో వేడుకున్నారు.


