ఏడాదిన్నర వ్యవధిలో సత్యసాయి జిల్లాలో 120 పోక్సో కేసుల నమోదు
దాదాపు 200 దాకా అత్యాచార ఘటనలు
70 శాతం మద్యం మత్తులోనే జరుగుతున్నవే..
ప్రభుత్వ తీరుపై అన్ని వర్గాల ప్రజల ఆగ్రహం
ధర్మవరం పట్టణంలో వరుసకు మేనమామ కావాల్సిన ఓ వ్యక్తి బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. మైనర్ గర్భం దాల్చడంతో అసలు విషయం బయట పడింది. తల్లి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సాకే నరసింహ అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం వెలుగు చూసింది.
పుట్టపర్తి మండలం బత్తలపల్లి గ్రామంలో వరుసకు పెద్దనాన్న అయిన 60 ఏళ్ల వృద్ధుడు మద్యం మత్తులో 9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి యతి్నంచాడు. బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. ఈ ఘటన మూడు నెలల క్రితం వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి అదుపులోకి తీసుకున్నారు.
సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు ప్రభుత్వంలో బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఒంటరిగా ప్రయాణించాలన్నా భయపడాల్సిన దుస్థితి నెలకొంది. ఇంట్లో ఉండాలన్నా .. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లినా తిరిగి వచ్చే వరకూ ఆలోచించాల్సిన పరిస్థితి. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిద్రావస్థలో ఉండటంతో అల్లరిమూకలు రాజ్యమేలుతున్నారు. అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితుల్లో 70 శాతం మంది మద్యం మత్తులోనే లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.
120కి పైగా పోక్సో కేసులు
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కొత్త మద్యం పాలసీ తీసుకురావడంతో వీధి వీధిగా బెల్టు షాపులు వెలిశాయి. రాత్రింబవళ్లూ మద్యం అందుబాటులో ఉంటోంది. ఫూటుగా సేవించిన తర్వాత మత్తులో సైకోలుగా మారి బాలికలు, మహిళలపై లైంగిక దాడులు చేస్తున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నారులు నుంచి పండు ముసలి వరకూ బాధితులుగా ఉన్నారంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
ఏడాదిన్నర వ్యవధిలో సత్యసాయి జిల్లాలో అత్యాచార ఘటనలు దాదాపు 200 పైగా జరిగాయి. అలాగే 120 పైగా పోక్సో కేసులు నమోదు కావడంతో మహిళల రక్షణ ప్రశ్నార్థంగా మారింది. ఇక.. బయటికి రాని ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు కేసు తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారు కూడా ఉన్నారు.
పోలీసుల నిర్లక్ష్యం..
బాలికలు, అమ్మాయిలు, మహిళలకు అల్లరి మూకల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. బయట ఒంటరిగా కనిపిస్తే చాలు లైంగిక వేధింపులకు దిగడం.. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ‘ఏం జరగలేదు కదా’ అని కేసు తీసుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. కేసులు నమోదు చేస్తే ‘మీకే నష్టం’ అంటూ బాధితులతో చెబుతుండటంతో వారికేం చేయాలో కూడా పాలుపోవడం లేదు. దీనికి తోడు నిందితులు సైతం బెదిరింపులకు దిగుతుండటంతో నమోదు కాని కేసుల సంఖ్య కూడా అధికంగానే ఉంది.
వీడియోల పేరుతో బెదిరింపులు
మద్యం మత్తులో అఘాయిత్యాలకు పాల్పడిన తర్వాత పదే పదే బెదిరిస్తూ.. సదరు మహిళలపై సామూహికంగా వచ్చి వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. వీడియోలు ఉన్నాయంటూ బెదిరిస్తూ గ్యాంగ్ రేప్‌లకు పాల్పడుతుండటం సంచలనం రేపుతోంది. గంజాయి మత్తులో రోడ్డు పక్కన ఇంట్లోకి చొరబడి గ్యాంగ్‌రేప్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. రాప్తాడు, హిందూపురం నియోజకవర్గాల్లోనే ఇలాంటి ఘటనలు అధికంగా వెలుగు చూస్తుండటం గమనార్హం.
మహిళలకు రక్షణ కరువైంది
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ కరువైంది. హోంమంత్రిగా ఓ మహిళ ఉన్నప్పటికీ కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. జిల్లాలో కూడా ఓ మహిళా మంత్రి ఉన్నారు. ఆమె దగ్గర పని చేస్తున్న అనుచరులు సైతం వేధింపులకు గురి చేస్తుండటం సిగ్గుచేటు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి నిందితులను శిక్షించాలి. – ఉషశ్రీచరణ్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు


