అధికారాన్ని అడ్డం పెట్టుకొని మహిళలపై కూటమి పార్టీల నేతల ఆగడాలు
అరవ శ్రీధర్, ఆదిమూలం, నజీర్, కూన రవి, కిరణ్‌రాయల్, జానీ మాస్టర్.. అంతా ఇదే తీరు
సాక్షి, అమరావతి: అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి పార్టీల నేతలు కామకూట విషం గక్కుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులైన మహిళలనే బెదిరించి.. బ్లాక్ మెయిల్ చేసి.. విశృంఖలంగా లైంగిక దాడులు కొనసాగిస్తుండటం చూస్తుంటే ఇక సామాన్య మహిళల సంగతేమిటంటూ సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ విప్ పదవిలో ఉన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను బెదిరించి ఏడాదిన్నరగా లైంగిక దాడికి పాల్పడటంతోపాటు ఐదుసార్లు గర్భవతిని చేసి అబార్షన్ చేయించినట్లు బాధితురాలు స్వయంగా చెప్పిన వీడియో మంగళవారం ప్రధాన మీడియా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూసినా కూటమి పెద్దల నుంచి కనీస స్పందన లేదు.
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తిరుపతి కూటమి నేత కిరణ్ రాయల్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, మంత్రి వాసంశెట్టి సుభాష్, కూటమి మద్దతుదారు జానీ మాస్టర్.. ఇలా ఎంతో మంది దురాగతాలు బట్టబయలు కావడం కలకలం రేపింది. ఇక నియోజకవర్గాల్లో కూటమి పార్టీల ద్వితీయ శ్రేణి నేతల ఆగడాలు, మహిళలపై వేధింపులు తరచూ బయట పడుతూనే ఉన్నాయి.
స్థానిక నేత తనను మోసం చేశారంటూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం పోలీసు స్టేషన్‌లో పది రోజుల క్రితం ఓ మహిళ ఫిర్యాదు చేశారు. కూటమి అధికారంలోకి వస్తే ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడేంత కఠినంగా చట్టాలు అమలు చేస్తామన్న ఆయా పార్టీల పెద్దలు.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఇలా మహిళలను దారుణంగా వేధిస్తున్నా.. బహిరంగ వీడియోల్లో రాసలీలలు కొనసాగిస్తూ అడ్డంగా దొరికినా.. బెదిరించి గర్భవతులను చేసి అబార్షన్లతో ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నా కనీసం కట్టడి చేయక పోవడంపై జనం నివ్వెరపోతున్నారు.
కిరణ్ రాయల్ వికృత చేష్టలు
తిరుపతి కూటమి నేత కిరణ్ రాయల్ వికృత చేష్టలు గత ఏడాది ఫిబ్రవరి 8న బాధిత మహిళ రిలీజ్ చేసిన వీడియో ద్వారా బయపడ్డాయి. తిరుపతి రూరల్ మండలం చిగురువాడకు చెందిన ఆమెతో కిరణ్‌రాయల్ చనువు పెంచుకుని డబ్బులు అడిగేవారని, కిరణ్ రాయల్‌కు అప్పులు చేసి మరీ రూ.1.20 కోట్లు, 25 సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చినట్టు బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత డబ్బులు అడిగితే రాయల్ బెదిరింపులకు దిగుతున్నారని ఆమె వీడియో రిలీజ్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ తరువాత కూటమి పెద్దలు ఆమెకు, కిరణ్ రాయల్ మధ్య బలవంతంగా రాజీ కుదిర్చారు.
ఆదిమూలం.. అరాచకం
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కూడా కేవీబీపురం మండలంలో ఓ మహిళా నేతను బెదిరించి రాసలీలలు సాగించారు. ఆనక ఆమెను మోసం చేసి బెదిరింపులకు గురిచేశారు. అరాచకాలకు తెగబడ్డారు. ఈ వ్యవహారంపై బాధితురాలు బయటకు వచ్చి చెప్పడంతో ఆయన అసలు రంగు బయటపడింది.
మంత్రి సుభాష్ అశ్లీల నృత్యాలు
సంక్రాంతి సంబరాల పేరుతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బహిరంగంగా చేసిన అశ్లీల నృత్యాలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలోని ఏఎస్‌ఎన్ కాలేజీలో సంక్రాంతి సంబరాల పేరిట ఇటీవల మ్యూజికల్ నైట్‌లు, డ్యాన్స్‌లు నిర్వహించారు. బుల్లితెర నటులు, జబర్దస్త్‌లో మహిళా క్యారెక్టర్లు వేసే నటులతో కలిసి మంత్రి సుభాష్ పండగ మూడు రోజులూ పలు పాటలకు అసభ్యంగా చిందులు వేశారు. ఈ వీడియోలు సామాజికమాధ్యమాల్లో చక్కెర్లుకొట్టడంతో మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా మంత్రి తన నృత్యాలను సమర్థించుకున్నారు. ‘నేను మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా నేను నేనుగానే ఉంటాను. ఇలానే ఉంటాను’ అంటూ వింత వాదనకు దిగారు.
కూన రవి వేధింపులకు దళిత ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు తాళలేక ఓ దళిత మహిళా ఉద్యోగి, పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్య గతేడాది ఆగస్టు 18న ఆత్మహత్యకు యత్నించారు. అంతకు ముందు ఆమె శ్రీకాకుళం తిలక్‌నగర్‌లోని తన నివాస గృహంలో ఓ ఎల్రక్టానిక్ మీడియాకు రవి వేధింపులపై ఇంటర్వ్యూ ఇచ్చారు. అనంతరం తన గదిలోకి వెళ్లి బీపీ స్టెరాయిడ్ ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. మాట్లాడుతూ.. పక్కకు తూలిపోవడంతో ఆమెను వెంటనే రిమ్స్‌కు తరలించారు. వైద్యులు 48 గంటల పర్యవేక్షణలో ఉంచారు. ఎమ్మెల్యే వేధింపుల వల్లే తనకీ దుస్థితి వచ్చిందని, ఆయన తన కార్యకర్తల చేత తనపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిస్తున్నారని, తరచూ వీడియో కాల్‌లో మాట్లాడుతూ వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల వల్ల తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
బెత్తంతో కొట్టి తోలు తీసే చట్టాలేవి?
ఈవ్ టీజింగ్‌కు పాల్పడేవారిని, ఆడపిల్లలను అభద్రతా భావానికి గురిచేసే వారిని పది మంది చూస్తుండగా వాతలు తేలిపోయే బెత్తంతో కొట్టి తోలు తీసే చట్టాలు రావాలని కూటమి పెద్దలు పలు సందర్భాల్లో చెప్పారు. అధికారంలో లేనప్పుడైతే.. తమకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని, రాష్ట్రంలో 30 వేల మంది యువతులు అదృశ్యమయ్యారంటూ ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు వారే ప్రభుత్వ పెద్దలుగా కొనసాగుతుండడంతో పాటు కేంద్రంలోని ఎన్డీఏలో మిత్రపక్షంగానూ ఉన్నారు. మరి రాష్ట్రంలో మహిళలపై కూటమి నేతల అఘాయిత్యాలు, కీచక పర్వాలపై నిఘా వర్గాల నుంచి ముందస్తు సమాచారం లేదా? లేదంటే తెలిసీ మౌనంగా ఉన్నారా? అనే ప్రశ్నలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. కాగా, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను బెదిరించి ఏడాదిన్నరలో ఐదుసార్లు గర్భవతిని చేసి, అబార్షన్లు చేయించారన్న బాధితురాలి వీడియో వెలుగులోకి రావడానికి ముందు కూటమి పెద్దల్లో ఒకరు విడుదల చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది. కొందరి వివాహేతర సంబంధాలను పార్టీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆ ప్రకటనలో చెప్పుకొచ్చారు. తద్వారా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంపై వారికి ముందుగానే సమాచారం ఉందా? అని విస్తృతంగా చర్చ జరుగుతోంది. బాధితురాలిపైనే ఎదురు దాడికి దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


