సాక్షి,విజయవాడ: మరోసారి రాష్ట్ర పోలీసుల వ్యవహారశైలిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్తికొండ న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. కోర్టు గౌరవాన్ని కించపరిచే విధంగా పోలీసులు ప్రవర్తించారని మండిపడింది.
విచారణ సందర్భంగా.. పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘జడ్జి అనుమతి లేకుండా కోర్టు హాల్లోకి ప్రవేశించి అరెస్టులు ఎలా చేస్తారు? అని ప్రశ్నించింది. ‘ఇలాంటి వాటిని అనుమతిస్తే పోలీసులు ఏమైనా చేస్తారు. హైకోర్టులో కూడా ఇలాగే అరెస్టులు చేస్తారా?’ కోర్టు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా పోలీసులు తీరు సరైంది కాదని వ్యాఖ్యానించింది.
దౌర్జన్యం చేసిన పోలీసులకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. బాధ్యులైన అధికారులపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను తేలికగా తీసుకోవద్దని, న్యాయస్థానం గౌరవాన్ని కాపాడే బాధ్యత అందరికీ ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
పత్తికొండ న్యాయవాదుల సంఘం తరఫున దాఖలైన పిటిషన్‌లో, కోర్టు హాల్లోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించి అరెస్టులు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు, పోలీసుల వ్యవహారంపై కఠినంగా స్పందించింది.


